Bihar Elections:  బీహార్‌ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా...తేజస్వీ..ఎక్కడనుంచి అంటే?

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోంది. కానీ, ఇప్పటివరకు విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో సీట్ల పంపకాలు మాత్రం పూర్తికాలేదు. దీనిపై కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఆర్జేడీ సోమవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

New Update
Lalu and Tejashwi

Lalu and Tejashwi

Bihar Elections: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోంది. కానీ, ఇప్పటివరకు విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో సీట్ల పంపకాలు మాత్రం పూర్తికాలేదు. దీనిపై కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ సోమవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 143 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ జాబితాను విడుదల చేసింది. కాగా ఆర్జేడీ (RJD) అగ్రనేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) వైశాలి జిల్లాలోని రాఘోపుర్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు జాబితా వెల్లడించింది.

బీహార్‌ ఎన్నికల రెండో విడతకు నామినేషన్ల గడువు నేటితో ముగుస్తోంది. దీంతో ఆర్జేడీ అధికారిక జాబితాను విడుదల చేయడం గమనార్హం. తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల గడువు అక్టోబరు 17నే ముగిసింది. నామనేషన్ల ఉపసంహరణకు సోమవారమే ఆఖరు తేదీ. అటు కాంగ్రెస్‌ కూడా ఇప్పటివరకు 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ ప్రకటించింది.

ఇండియా కూటమిలో చీలికలు తప్పవా?

కాగా, ఇండియా కూటమిలో భాగస్వామి అయిన ఆర్జేడీకి, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఆర్జేడీనేత తేజస్వి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మధ్య దూరం పెరగడం వల్లే ఇలా జరిగినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. దీని వల్లే ఇప్పటివరకు మహాగఠ్‌బంధన్‌ ఇంతవరకూ సీట్ల పంపకాలపై ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. అంతేకాదు.. తొలివిడత పోలింగ్‌ జరిగే 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపింది. కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపానికి ఇదే నిదర్శనంగా కనిపిస్తోంది. బిహార్‌లో నవంబరు 6, 11వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 14న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించనున్నారు. అయినా ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదు.

ఇండి కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ,  సీపీఐ (ఎమ్ఎల్) ఎల్, సీపీఐ (ఎం), సీపీఐ, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లతో కలిసి కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ తొలి దశలో మొత్తం 20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మరోవైపు ఇండి కూటమిలో సీట్ల పంపకాల విషయంలో సమస్యలున్న మాట వాస్తవమేనని కాంగ్రెస్ పార్టీ నేత సురేంద్ర రాజ్‌పుత్ వెల్లడించారు. ఈ సమస్యలను చర్చల ద్వారా తాము పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. అయితే తొలి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 17వ తేదీతోనే ముగిసిన సంగతి తెలిసిందే.

243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 6, 11 తేదీల్లో ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14వ తేదీన వెలువడుతాయి. ఈ ఎన్నికల ద్వారా మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని ఎన్డీయే భావిస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఇండి కూటమి కృత నిశ్చయంతో ఉంది. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటరు పట్టం కట్టాడనేది నవంబర్ 14వ తేదీన తెలనుంది. ఇంకోవైపు ఈ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహాకర్త, జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తన పార్టీ అభ్యర్థులను బరిలో దింపారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read :  9,600mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. నేలకు కొట్టి, నీటిలో వేసినా ఏం కాదు..!

Advertisment
తాజా కథనాలు