/rtv/media/media_files/2025/07/12/prakash-raj-2025-07-12-13-47-15.jpg)
Prakash raj
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. ఓట్ చోరీ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించారు. ఎన్నికల పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. "పోలింగ్ బూత్ డ్రెస్ చేంజింగ్ రూమ్ కాదు, మీరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే ముందు మహిళల అనుమతి తీసుకున్నారా? మీ సౌకర్యవంతమైన సాకులతో మాకు పనిలేదు. మాకు కావాల్సింది పారదర్శకత" అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు #justasking, #VoteChori అనే హ్యాష్‌ట్యాగ్‌లను యాడ్ చేశారు. ఆయన ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించారు.
Did you take permission of the women before you placed those cctv s .?? Polling booth is not a dress changing room. We are not interested in your Convenient EXCUSES.. WE need TRANSPARENCY. #justasking#VoteChorihttps://t.co/QJQtRdEENE
— Prakash Raj (@prakashraaj) August 17, 2025
పోలింగ్ బూత్‌లో సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ డిమాండ్‌పై ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. మహిళల ప్రైవసీ కారణంగా పోలింగ్ బూత్‌లో సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేమని కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. దీనికి కౌంటర్‌గా ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. పోలింగ్ బూత్‌లో కెమెరాలు ఏర్పాటు చేసేముందు మహిళల అనుమతి తీసుకున్నారా అని ఎక్స్‌లో ప్రశ్నించారు. ఈ ట్వీట్ దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలలో, సామాన్య ప్రజలలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా మహిళల భద్రత, గోప్యతకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడంతో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది నెటిజన్లు ప్రకాష్ రాజ్ వాదనకు మద్దతు తెలుపుతూ, పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాలు ఉండడం అవసరం, అయితే మహిళల గోప్యతకు భంగం కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఓటు వేసే సమయంలో ముఖం కనిపించేలా మాత్రమే కెమెరాలు ఉండాలి, అంతకు మించి అదనపు కెమెరాలు అవసరం లేదని వాదిస్తున్నారు. మరోవైపు, ప్రకాష్ రాజ్ విమర్శలు అసంబద్ధమైనవని, పోలింగ్ బూత్‌లలో పారదర్శకత, నిజాయితీ కోసం సీసీ కెమెరాలు అవసరమని ఇంకొందరు అంటున్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలను నివారించడానికి, ఓట్ల చోరీ జరగకుండా ఉండటానికి ఇది ఒక ముఖ్యమైన చర్య అని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రకాష్ రాజ్ ట్వీట్ లోని #VoteChori అనే హ్యాష్‌ట్యాగ్ ఎన్నికలలో అవకతవకలు జరుగుతున్నాయని సూచిస్తోంది. ఈ ట్వీట్ ఎన్నికల కమిషన్‌కు ఒక పరోక్ష హెచ్చరికగా కూడా పరిగణించబడుతోంది. మొత్తం మీద, ప్రకాష్ రాజ్ ట్వీట్ ఎన్నికల పారదర్శకత, ఓటర్ల భద్రతపై కొత్త చర్చకు తెరలేపింది.