Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు కారణమిదే.. 18 మంది ప్రాణాలు తీసిన బ్యాగ్

ఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో అసలు కారణం వెలుగులోకి వచ్చింది. 2025 ఫిబ్రవరిలో జరిగిన ఈ విషాద ఘటనకు ప్యాసింజర్ తలపై మోస్తున్న బ్యాగ్ కిందపడటమే ప్రధాన కారణమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వెల్లడించారు.

New Update
Delhi Railway Station stampede

ఢిల్లీలోని రైల్వే స్టేషన్‌ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో అసలు కారణం వెలుగులోకి వచ్చింది. గత ఫిబ్రవరిలో జరిగిన ఈ విషాద ఘటనకు ప్యాసింజర్ తలపై మోస్తున్న పెద్ద బ్యాగ్ కిందపడటమే ప్రధాన కారణమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వెల్లడించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ జీ లాల్ సుమన్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ, ఈ ఘటనపై నియమించిన ఉన్నత స్థాయి విచారణ కమిటీ నివేదికలోని వివరాలను ఆయన పంచుకున్నారు.

మహా కుంభమేళా కారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో, ఫిబ్రవరి 15న రాత్రి 8:48 గంటలకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి-3పై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్లాట్‌ఫారమ్ నంబర్ 14, 15లను కలుపుతుంది.

బ్యాగ్ కిందపడి..

విచారణ కమిటీ నివేదిక ప్రకారం, రాత్రి 8:15 గంటల తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరిగింది. చాలా మంది ప్రయాణికులు తమ తలలపై భారీ లగేజీని మోసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో, ఒక ప్రయాణికుడు తలపై మోస్తున్న ఒక పెద్ద బ్యాగ్ జారి కిందపడింది. దీంతో పై మెట్లపై ఉన్న ప్రయాణికులు కింది మెట్లపై ఉన్న వారిని నెట్టుకున్నారు. ఇది డొమినో ప్రభావంలా పనిచేసి, మెట్లపై ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ తొక్కిసలాటలో 18 మంది చనిపోగా, 15 మంది గాయపడ్డారు.

ప్రభుత్వం బాధితులకు పరిహారం

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి, మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 1 లక్ష చొప్పున పరిహారం చెల్లించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రైల్వే శాఖ అనేక చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు