/rtv/media/media_files/2025/08/15/modi-2025-08-15-09-25-45.jpg)
Modi
Narendra Modi : దేశాభివృద్ధిలో మిజోరం భాగస్వామ్యం కీలకమని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. కొండమార్గంలో రైలు మార్గం కష్టతరంలో కూడుకున్నదని, సవాల్‌తో కూడిన నిర్మాణాలు అద్భుతమని కొనియాడారు. మిజోరం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌ను భారత రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే చరిత్రాత్మక బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఇది 51.38 కిలోమీటర్ల రైలు మార్గం. రూ. 8,070 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు, ఈశాన్య భారతదేశంలో కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ఒక మైలురాయిగా నిలిచింది. ఈ ప్రాజెక్టు యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా, మిజోరం రాజధానిని అస్సాంలోని సిల్చార్‌తో, ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది.
ఈ సందర్భంగా మిజోరంలో రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీఈ రోజు శ్రీకారం చుట్టారు. వర్చువల్‌గా అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రైల్వే లైన్లు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతాయని, పర్యాటక రంగంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని తెలియజేశారు.ఏ రాష్ట్రాభివృద్ధికైనా రోడ్డు, రైల్వే, పోరు కనెక్టివిటీ ముఖ్యమని స్పష్టం చేశారు. మిజోరం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, వేగవంతమైన దేశాభివృద్ధిలో మిజోరం యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మిజోరంలో రవాణా సౌకర్యాలు పెంచామని, నూతన రైళ్ల ప్రారంభోత్సవంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడుతాయని మోడీ వివరించారు. కష్టతరమైన కొండ ప్రాంతాల్లో రైల్వే సౌకర్యం సంతోషకరమైన విషయమన్నారు. ఇంజినీర్ల నైపుణ్యం, కార్మికుల స్ఫూర్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని ప్రశంసించారు. కఠినమైన భూభాగంతో అనేక సవాళ్లను అధిగమించి నిర్మాణం పూర్తి చేశారని మోడీ కొనియాడారు.
కాగా ఈ రైలు మార్గం హోర్టోకి, కావున్‌పుయి, మువాల్‌ఖాంగ్, సైరాంగ్-సిహ్ముయి అనే నాలుగు స్టేషన్లను కలిగి ఉంది. 48 సొరంగాలు, 55 పెద్ద వంతెనలు, 87 చిన్న వంతెనలు, 5 రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు, 6 రోడ్ అండర్ బ్రిడ్జ్‌లతో ఈ రైలు మార్గాన్ని ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా, 114 మీటర్ల ఎత్తున్న బ్రిడ్జ్ నెం.196... కుతుబ్ మీనార్ కంటే 42 మీటర్లు ఎక్కువ ఎత్తున ఉంది. ఈ రైలు మార్గం ఐజ్వాల్‌ను గౌహతి, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాలతో అనుసంధానించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచుతుంది. ఈ ప్రాజెక్టు మిజోరం రాష్ట్రానికి రైలు కనెక్టివిటీని అందించడమే కాకుండా, దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులను రైలు మార్గంలో అనుసంధానించాలనే దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాకారం చేస్తుంది. ఇలా రైల్వే రంగాన్ని కేంద్ర ప్రభుత్వం క్రమంగా విస్తరిస్తూ.. మరిన్ని ప్రాంతాలకు దాన్ని చేరువ చేస్తోంది.
ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో మూడు కొత్త రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో సైరాంగ్-ఆనంద్ విహార్ (ఢిల్లీ) రాజధానీ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ), కోల్‌కతా-సైరాంగ్-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ (త్రై-వీక్లీ), గౌహతి-సైరాంగ్-గౌహతి ఎక్స్‌ప్రెస్ (డైలీ) ఉన్నాయి. ఈ రైళ్లు మిజోరంను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించి, వాణిజ్యం, పర్యాటకం, రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయి. అయితే, భారీ వర్షం కారణంగా ప్రధాని లెంగ్‌పుయి విమానాశ్రయం నుంచి ఐజ్వాల్‌లోని లమ్మువాల్ గ్రౌండ్‌కు హెలికాప్టర్‌లో చేరుకోలేకపోయారు. దీంతో, ఆయన విమానాశ్రయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సాంప్రదాయ మిజో ఈకల టోపీని ధరించి, స్థానిక సంస్కృతిని గౌరవించారు.
ఈ రైలు మార్గం మిజోరంలో ఆర్థిక వృద్ధిని పెంచడమే కాకుండా, పర్యాటక రంగాన్ని, స్థానిక వ్యాపారాలను, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ఉత్పత్తుల రవాణా సులభతరం కానుంది, ఇది మార్కెట్ ధరలను తగ్గించడానికి దోహదపడుతుంది. అదనంగా, ప్రధాని మోదీ రూ.9,000 కోట్ల విలువైన ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇందులో రెసిడెన్షియల్ స్కూల్, ఎల్‌పిజి బాట్లింగ్ ప్లాంట్, రోడ్లు, ఇంధనం, క్రీడా సౌకర్యాలు వంటివి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.
Also Read: బాలయ్య 'అఖండ' లో బజరంగీ భాయిజాన్ చైల్డ్ ఆర్టిస్ట్! ఇప్పుడు ఎంత అందంగా ఉందో