/rtv/media/media_files/2025/09/30/major-accident-at-chennai-ennore-power-plant-2025-09-30-20-36-39.jpg)
Major accident at Chennai Ennore Power Plant
Crime News : తమిళనాడు రాజధాని చెన్నై నగరం సమీపంలో ఉన్న ఓ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా కట్టడం కూలడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. చెన్నై సమీపంలోని ఎన్నూర్ థర్మల్ పవర్‌ప్లాంట్‌లో ప్లాంట్ నిర్మాణ పనులు చేస్తుండగా మంగళవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న ఓ కట్టడం కూలిపోయింది. దీంతో దానిపై ఉన్న కార్మికులు కిందపడి గాయాలపాలయ్యారు. వీరిలో 9 మంది మృతి చెందగా... మరో 15 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన రెస్క్యూ సిబ్బంది.. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ప్రాథమిక సమాచారం మేరకు మంగళవారం ఎన్నూర్ పవర్ ప్లాంట్‌లో ఆర్చ్ నిర్మాణం జరుగుతోంది. ఈ సమయంలో ఊహించని విధంగా ఆర్చ్ ఒక్కసారిగా కుప్పకూలింది. 30 అడుగుల పైనుంచి ఆర్చ్ కిందపడింది. శిథిలాల కింద పడి 9 మంది కార్మికులు చనిపోయారు. ఓ కార్మికుడు అత్యంత తీవ్రంగా గాయపడగా.. 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాయపడ్డ వారిని స్టేన్‌లీ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై ది అవదీ పోలీస్ కమిషనరేట్ స్పందిస్తూ.. ‘ఆర్చ్ ఎందుకు కూలిందో సరైన కారణం ఇంకా తెలియరాలేదు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము’ అని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు