Lawrence Bishnoi Gang: రెచ్చిపోతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..ఢిల్లీ, కెనడాల్లో వరుస కాల్పులు

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మళ్ళీ రెచ్చిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు రోజులుగా వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. అలాగే కెనడాలో కూడా కాల్పులకు పాల్పడింది.  అయితే ఇందులో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

New Update
lawrence

దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. గత రెండు రోజులుగా  గన్ కాల్పులు పోలీసులు, ఆ ప్రాంత నివాసితులను వణికించాయి. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఇది మామూలుగా జరిగిన సంఘటన కాదని...గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చేసిన కాల్పులని తెలిసింది. ఆ గ్యాంగ్ దోపిడికి ఇదొక కొత్త నమూనా అని తేలింది.

మొదటి సంఘటన సోమవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో తూర్పు ఢిల్లీలోని వెస్ట్ వినోద్ నగర్ లో జరిగింది.  అర్ధరాత్రి సమయంలో ఇద్దరు హెల్మెట్ ధరించిన బైకర్లు ఆ ప్రాంతంలోకి ప్రవేశించారు. వారు ఆస్తి వ్యాపారి జితేంద్ర గుప్తా ఇంటి బయట ఆగారు. వారు గాల్లోకి కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయారు. ఇది మొత్తం  సీసీటీవీలో రికార్డైంది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాల్పుల తరువాత లారెన్స్ బిష్ఱోయ్ గ్యాంగ్ తరుఫు నుంచి ఒక కాల్ వచ్చింది. తనను తాను తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా పరిచయం చేసుకుని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. కాల్పుల తర్వాత రెండు ఆడియో సందేశాలు కూడా పంపబడ్డాయి.

రెండో ఘటన..

రెండవ సంఘటన మంగళవారం రాత్రి (జనవరి 13, 2026) ఢిల్లీలోని పశ్చిమ విహార్ ప్రాంతంలో జరిగింది. గుర్తు తెలియని దుండగులు జిమ్ వెలుపల కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దం సమీపంలోని నివాసితులను భయభ్రాంతులకు గురిచేసింది. తదనంతరం, జిమ్ కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కనిపించింది.

కెనడాలో కూడా..

ఢిల్లీలో కాల్పుల ఘటన తర్వాత కెనడాలో కూడా మరో కాల్పుల సంఘటన వెలుగులోకి వచ్చింది. కెనడాలోని బ్రాంప్టన్ లో ఇది జరిగింది. మంగళవారం జస్వీర్ ధేసి అనే వ్యక్తి ఇంటిపై కాల్పులు జరిగాయి. దీనికి కూడా తమదే బాధ్యత  సోషల్ మీడియాలో లారెన్స్ బిష్ఱోయ్ గ్యాంగ్ మళ్ళీ ప్రకటించింది. పోస్ట్‌లో.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా తనను తాను గుర్తించుకున్న గోల్డీ ధిల్లాన్ అనే వ్యక్తి..మా ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చే ఎవరికైనా ఇదే గతి పడుతుంది అని రాశాడు. కాల్పుల వీడియోను కూడా పోస్ట్ చేశారు. 

 కెనడా, ఇండియాతో పాటూ చాలా దేశాల్లో తమ నెట్ వర్క్ ఉందని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చెబుతోంది. మాదకద్రవ్యాల వ్యాపారులు మన భవిష్యత్ తరాలను నాశనం చేస్తున్నారని...వారందరినీ ఏరిపారేస్తామని గ్యాంగ్ నుంచి హషీం బాబా సహచరుడు ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.  ఇకపై దోపిడీకి మాత్రమే పరిమితం కాకుండా, నేరుగా మాదకద్రవ్య మాఫియాను కూడా లక్ష్యంగా చేసుకుంటామని చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు