Indigo Flight Crime News
Indigo Flight Crime News: ముంబై నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానం (Indigo Flight )లో ఓ దురదృష్టకర సంఘటన జరిగింది. విమానంలో పానిక్ అటాక్‌తో బాధపడుతున్న ప్రయాణికుడిని తోటి ప్రయాణికుడు నిర్దాక్షిణ్యంగా చెంపపై కొట్టడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారు నిందితుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఘటన తర్వాత ప్రయాణికుల భద్రత, విమానంలో ప్రవర్తించాల్సిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వివరాల ప్రకారం.. విమానం ముంబై నుంచి కోల్‌కతాకు బయలుదేరిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు పానిక్ అటాక్‌తో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అతను భయంతో ఊగిపోతూ, అటూ ఇటూ నడుస్తూ సహాయం అడిగాడు. అతని పరిస్థితిని గమనించిన ఎయిర్ హోస్టెస్‌లు వెంటనే అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించారు. ఓదార్చి.. కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. వెనుక సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి ఒక్కసారిగా లేచి.. పానిక్ అటాక్‌తో ఉన్న వ్యక్తి చెంపపై బలంగా కొట్టాడు.
వీడియో సోషల్ మీడియాలో వైరల్..
ఈ దాడి విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే ప్రయాణికుడు నిందితుడిని నిలదీస్తూ.. ఎందుకు కొట్టావ్ అని ప్రశ్నించాడు. అందుకు ఆ నిందితుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియోలో ఎయిర్ హోస్టెస్‌లు కూడా ఆ నిందితుడిని నిలదీసే ప్రయత్నం చేశారు. ఇతర ప్రయాణికులు అతడి దుష్ప్రవర్తనను ఖండించడం విషయాలు వీడియో కనిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవడంతో.. ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై ప్రకటన విడుదల చేశారు. విమానంలో ఇటువంటి అవాంఛనీయ ప్రవర్తనను సహించబోమని.. ప్రయాణికులు, సిబ్బంది భద్రత, గౌరవానికి భంగం కలిగించే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని సంస్థ పేర్కొంది. తమ సిబ్బంది తక్షణమే స్పందించి.. వారి విధి విధానాల ప్రకారం వ్యవహరిస్తారని ఇండిగో తెలిపింది. ఇటువంటి అవాంఛనీయ ప్రవర్తనను పూర్తిగా నిషేధిస్తామన్నారు. మా ప్రయాణికులు, సిబ్బంది భద్రత, గౌరవానికి భంగం కలిగించే ఏ చర్యలనైనా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండిగో ఆ ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: చిన్నాన్న నీకు మనసెలా వచ్చింది!
We are aware of an incident involving a physical altercation on board one of our flights. Such unruly behaviour is completely unacceptable and we strongly condemn any actions that compromise the safety and dignity of our passengers and crew.
— IndiGo (@IndiGo6E) August 1, 2025
Our crew acted in accordance with…
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ సంఘటనపై తీసుకున్న చర్యలను కూడా వెల్లడించింది. విమానం కోల్‌కతాలో ల్యాండ్ అయిన వెంటనే.. దాడికి పాల్పడిన వ్యక్తిని అన్‌రూలీ ప్యాసింజర్ (Unruly Passenger)గా గుర్తించి, భద్రతా అధికారులకు అప్పగించారు. విమానయాన నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారం.. సంబంధిత ఏజెన్సీలకు ఈ విషయం గురించి సమాచారం అందించారు. ఇలాంటి ప్రయాణికులకు నో-ఫ్లై జాబితాలో పెట్టడం వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఇండిగో భరోసా ఇచ్చింది. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. పానిక్ అటాక్‌తో ఉన్న వ్యక్తిని సహాయం చేయాల్సింది పోయి.. ఇలా కొట్టడం అమానవీయ చర్య అని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
( Latest News | telugu-news)
ఇది కూడా చదవండి: 13 ఏళ్ల చిన్నారి అస్థి పంజరం.. లో దుస్తులు.. ధర్మస్థల కేసులో వెలుగులోకి మిస్టరీ విషయాలు!