/rtv/media/media_files/2025/05/10/S38Dm0saQrmtj8snkW56.jpg)
India-Pakistan Agreed to Ceasefire
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇరుదేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నామని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. మొత్తానికి యుద్ధం ఆగడానికి పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. దీనికి గల 10 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1.పాక్‌ను తిప్పికొట్టిన భారత్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, POKలోని 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాకిస్థాన్.. డ్రోన్లు, మిసైళ్లతో భారత్‌పై దాడులకు దిగింది. కానీ వాటిని భారత్ తిప్పికొట్టింది. అలాగే పాకిస్థాన్‌లోని లాహోర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసింది. కానీ పాకిస్థాన్ భారత్‌లో డ్రోన్లు, మిసైళ్లతో ఎలాంటి నష్టం చేయలేకపోయింది.
2.పాకిస్థాన్‌కు సరిపడా ఆయుధాలు లేకపోవడం
పాకిస్థాన్ ప్రతిరోజూ కాల్పులకు దిగితే వాటి వద్ద ఉన్న ఆయుధాలు కొన్ని రోజుల్లోనే ఖాళీ అయిపోతాయి. గతంలో పాకిస్థాన్ ఉక్రెయిన్‌కు కూడా ఆయుధాలు అమ్ముకుంది. కానీ భారత్‌కు మాత్రం పాకిస్థాన్‌కు కన్నా ఎక్కువగా ఆయుధాలు, ఆధునిక టెక్నాలజీ ఉంది.
3.పాక్‌కు ప్రపంచ దేశాల సాయం నిరాకరణ
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు టర్కీ తప్ప మిగతా ఏ దేశాలు కూడా మద్దతు తెలిపేందుకు ముందుకు రాలేదు. ఆఖరికి చైనా కూడా పాక్‌కు మద్దతిచ్చేందుకు వెనుకాడింది. ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. చివరికి గల్ఫ్ కంట్రీస్ కూడా పాక్‌కు సపోర్ట్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. మొత్తానికి ఇక్కడ పాకిస్థాన్ ఏకాకి అయిపోయింది.
4.అమెరికా వార్నింగ్
పాకిస్థాన్ భారత్‌పై F16 ఫైటర్ జెట్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. దాన్ని పాక్ అమెరికా నుంచి కొనుగోలు చేసింది. దాన్ని కేవలం ఉగ్రవాదులపై మాత్రమే వినియోగిస్తామని అమెరికాతో ఒప్పందం చేసుకుంది. కానీ దాన్ని భారత్‌పై ప్రయోగించింది. ఈ విషయంలో అమెరికా కూడా పాక్‌పై అసహనం వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌కు కూడా భారత్ ఎదురుదాడుల వల్ల గట్టి షాక్ తగిలింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా మధ్యవర్తిత్వం వహించాలని అమెరికాతో కాళ్లబేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. పాక్ విదేశాంగ మంత్రి కూడా భారత్ కాల్పులు ఆపితే తాము కూడా ఆపుతామంటూ ప్రకటన చేశారు.
5. పాకిస్థాన్‌లోనే వ్యతిరేకత
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం వల్ల పాకిస్థాన్‌లోని ప్రజలు కూడా అక్కడి షెహబాద్ షరీఫ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముందుగా తమ రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయాలంటూ కూడా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
6. పక్కలో బల్లెంలా మారిన బలూచిస్థాన్
ప్రస్తుతం పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ వివాదం కూడా నడుస్తోంది. అక్కడి వాళ్లు బలూచిస్థాన్‌ను స్వయంప్రతిపత్తి గల రాష్ట్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పాక్ రైలును కూడా హైజాక్ చేశారు. తాజాగా భారత్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా పాక్ సైనికులపై దాడులకు దిగారు. ఓ కాన్వాయ్‌ను కూడా పేల్చేశారు. అందులో దాదాపు 12 మంది పాక్ సైనికులు మృతి చెందారు. పాకిస్థాన్‌కు భారత్‌తోనే కాకుండా బలూచిస్థాన్‌తో కూడా వైరుధ్యం ఉండటంతో ఆ దేశానికి పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది.
7. ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్
పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిపోయాయి. అక్కడి ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరింది. ప్రజలు కనీసం నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌తో యుద్ధం చేస్తే ఇంకా తమ పరిస్థితి మరింత క్షీణిస్తుందనే భావన పాకిస్తాన్‌కు వచ్చేసింది.
8. పాక్ ఉగ్రవాద బండారాన్ని ప్రపంచానికి చూపిన భారత్
భారత్.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, POKలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భారత్ తెలిపింది. అయితే పాకిస్థాన్ సైనికులు ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న వీడియోలు బయటకి వచ్చాయి. ఈ విషయంలో ప్రపంచ దేశాల నుంచి కూడా పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
9. రాజకీయ సంక్షోభం
పాకిస్థాన్‌లో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం కూడా ఉంది. భారత్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్ పార్లమెంటులో అక్కడి ఎంపీ షెహబాజ్ షరీఫ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రధాని పిరికివాడంటూ వ్యాఖ్యానించారు. అక్కడి ప్రజలు కూడా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చివరికి షెహబాద్ సోదరుడు నవాజ్ షరీఫ్ కూడా యుద్ధం విషయంలో రాజీపడేందుకు ముందుకొచ్చారు.
10 ఇమ్రాన్ ఖాన్ ఎఫెక్ట్
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రసుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన మద్దతుదారులు ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. కొందరు ఇమ్రాన్ ఖాన్ ఉంటున్న జైలుకు వెళ్లి కూడా నిరసనలు చేశారు. యుద్ధ పరిస్థితులు తీవ్రతరమైతే ఇమ్రాన్ ఖాన్‌కు ఇది అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు సైనికుల చేతిల్లోకి పాలన వెళ్లిపోయే పరిస్థితులు కూడా రావొచ్చు. అందుకే పాకిస్థాన్ యుద్ధం విషయంలో మొత్తానికి కాళ్లబేరానికి వచ్చింది.
telugu-news | rtv-news | national | international | india pakistan war