Revanth reddy: ఇక మీదట హైదరాబాద్‌లో రోడ్లకు ఆ కంపెనీల పేర్లు. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

హైదరాబాద్‌లో రోడ్లకు నేతల పేర్లు పెట్టే ట్రెండ్‌ మార్చి.. ప్రముఖ కంపెనీల పేర్లు పెట్టాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అత్యున్నత జీవ‌న ప్రమాణాలతో కూడిన అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను నిలపడమే త‌న మొదటి ప్రాధాన్యత అన్నారు.

New Update
FotoJet (91)

CM Revanth Reddy at the US-India Strategic Partnership Summit held in Delhi

Revanth reddy:  ఇన్నాళ్లు ఎక్కడైనా రోడ్లకు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సంఘసేవకుల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అది వారిని గౌరవించడంతో పాటు వారి సేవలను గుర్తు చేసుకోవడానికి ఉపకరిస్తుందని అలా పెట్టడం సాధారణం. అయితే ఇక మీదట హైదరాబాద్‌లో రోడ్లకు నేతల పేర్లు పెట్టే ట్రెండ్‌ మార్చి.. ప్రముఖ కంపెనీల పేర్లు పెట్టాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల పేర్లను ఇవ్వాలన్న ఆలోచన ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.అత్యున్నత జీవ‌న ప్రమాణాలతో కూడిన అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను తీర్చిదిద్దడమే త‌న మొదటి ప్రాధాన్యత అని రేవంత్‌ రెడ్డి  వివరించారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ దేశంలోనే నూత‌న న‌గ‌రంగా మారనుందన్నారు. మూసీ న‌దీ పునరుజ్జీవనం పూర్తయితే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.

హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు తెలంగాణలో క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని సీఎం ఆహ్వానించారు. ఢిల్లీలో జ‌రిగిన అమెరికా -భార‌త్‌ వ్యూహాత్మక భాగ‌స్వామ్య స‌ద‌స్సులో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అంత‌ర్జాతీయ స్థాయి మౌలిక వ‌స‌తులు, పరిశ్రమలకు అనువైన వాతావ‌ర‌ణం, భద్రతకు ఢోకా లేని నగరం హైదరాబాద్‌ అని ఆయన వివరించారు. హైదరాబాద్‌ పెట్టుబ‌డిదారుల‌కు ఉత్తమ గమ్యస్థాన‌మ‌ని తెలిపారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో యువ‌త‌, వేగవంత‌మైన వృద్ధి రేటు ఉందని వెల్లడించారు. గ‌త 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీల ప్రభుత్వాలు సార‌థ్యం వ‌హించినప్పటికీ.. పెట్టుబ‌డుల‌కు, పెట్టుబ‌డిదారుల‌కు అంద‌రూ మద్దతుగా నిలిచార‌ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. భార‌త‌దేశంలో పెట్టుబ‌డుల‌కు హైద‌రాబాద్ ముఖ ద్వారంగా నిలిచిందని సీఎం వివరించారు. జీసీసీల‌కు గమ్యస్థానమైన హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డుల‌కు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. మ‌హిళా సాధికారిత‌తో పాటు నాణ్యమైన విద్య, యువ‌త‌కు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధి వంటి మెరుగైన వ‌స‌తులు, అత్యున్నత జీవ‌న ప్రమాణాలతో కూడిన అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను తీర్చిదిద్దడమే త‌న ప్రథమ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన గ‌త 23 నెల‌ల్లో రాష్ట్ర ప్రభుత్వం చేప‌ట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం ఈ సందర్భంగా వివ‌రించారు. అద్భుత‌మైన మౌలిక వ‌స‌తులతో 30 వేల ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ దేశంలోనే నూత‌న న‌గ‌రంగా నిర్మించనున్నామని తెలిపారు. మూసీ న‌దీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్‌ఫ్రంట్‌ల తరహాలో హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుంద‌ని సీఎం వివరించారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పురోగ‌తిని ఈ సందర్భంగా ఆయన వివ‌రించారు. స‌ద‌స్సు ప్రారంభంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి  ఆహ్వానం మేరకు USISPF సభ్యులలో అత్యధికులు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ( Telangana Rising Global Summit) కు హాజరవుతారని, తెలంగాణ విజన్‌ను దగ్గరగా తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని USISPF అధ్యక్షుడు డాక్టర్ ముఖేష్ ఆఘీ తెలిపారు.

Also Read :  10 + 12 తరగతుల పరీక్షల తేదీలు రిలీజ్.. ఎప్పట్నుంచంటే..?

Advertisment
తాజా కథనాలు