/rtv/media/media_files/Fq67zAOzbpcN6TAvvXZm.jpg)
Ganesh Chaturthi
Ganesh Chaturthi : వినాయక చవితి వచ్చిందంటే కేవలం నవరాత్రుల్లో భక్తితో పూజలు చేయడం, అందంగా అలంకరించిన పందిళ్లు, డీజే పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే కాదు. ఈ పండుగ వేల కోట్ల వ్యాపారానికి కూడా ఊతమిస్తుందంటే అతిశయోక్తికాదు. వినాయక చవితి దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే గొప్ప ఉత్సవమని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అభిప్రాయపడింది. ఈ పండుగ ద్వారా ఈ ఏడాది వేల కోట్ల బిజినెస్ జరిగినట్లు వివరించింది.ఈ పండుగ కేవలం భక్తి, సంస్కృతి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊపు తెచ్చిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తేల్చి చెప్పింది.
ఈ సంవత్సరం గణేష్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు రూ. 45,000 కోట్ల వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. గత ఏడాది ఇదే వినాయక చవితికి రూ.25,000 కోట్ల వ్యాపారం జరిగినట్లు CAIT వివరించింది. అయితే ఈసారి నిర్వహకులు పూర్తిగా స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దేశీయ వ్యాపార రంగాలకు మేలు జరిగిందని వెల్లడించింది. CAIT జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా మాట్లాడుతూ, వినాయక చవితి సందర్భంగా ఒక్క గణపతి విగ్రహాల వ్యాపారమే రూ. 1000 కోట్లకు పైగా జరిగిందని తెలిపారు. వీటితో పాటు పుష్పాలు, దండలు, కొబ్బరికాయలు వంటి అవసరమైన సామగ్రి కొనుగోళ్లు సుమారు రూ. 500 కోట్ల బిజినెస్ చేశాయి. ఇక మోదకాలు, ఇతర స్వీట్ల డిమాండ్ రూ. 2,000 కోట్ల మార్క్‌ను దాటింది. పండగ సమయంలో కేటరింగ్, స్నాక్స్ సర్వీసులు రూ. 3,000 కోట్ల వ్యాపారాన్ని సృష్టించాయని ఆయన తెలిపారు.
ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల గణేష్ మండపాలు ఏర్పాటయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 7 లక్షల పందిళ్లు, కర్ణాటకలో 5 లక్షలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో ఒక్కో చోట 2 లక్షల వరకు పందిళ్లు వెలిశాయి. ఒక్కో పందిరికి కనీసం రూ. 50,000 ఖర్చు అయ్యింది. ఇక మండపాల అలంకరణలు, ఏర్పాట్లు, పూజల కోసం మొత్తం రూ. 10,000 కోట్లకు పైగా ఖర్చయిందని భారతియా తెలిపారు. గణేష్ చతుర్థి కేవలం పూజలు, పందిళ్లతోనే ఆగలేదు. ఈ పండుగ స్థానిక టూరిజం, బస్సులు, క్యాబ్‌లు, రైళ్ల వ్యాపారాలకు కూడా మేలు చేసింది. ఆయా రంగాలకు రూ. 2,000 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిందని ఆయన వివరించారు. కొత్త బట్టలు, ఆభరణాలు, హోమ్ డెకరేషన్, గిఫ్ట్ ఐటెమ్‌ల వంటి రిటైల్ వ్యాపారం రూ. 3,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున ఈవెంట్‌లు నిర్వహించే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు రూ. 5,000 కోట్ల ఆదాయాన్ని సంపాదించుకున్నాయి.
గణేష్ నవరాత్రలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో పలు ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చిందని CAIT సెక్రటరీ జనరల్ ఎమెరిటస్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు. రక్షా బంధన్‌తో మొదలైన పండగల సీజన్ గణేష్ చతుర్థి, నవరాత్రులు, దసరా, కర్వా చౌత్, దీపావళి, ఛత్ పూజ ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్‌తో భారత ఆర్థిక వ్యవస్థ ఊపందుకోనుందని CAIT అంచనా వేస్తోంది.
Also Read: ఎంపీ సోదరికి అత్తింటివారి వేధింపులు.. నడిరోడ్డుపై కర్రతో కొట్టిన మామ.. వీడియో వైరల్