No Diwali: ఆ గ్రామాల్లో దీపావళి వేడుకల్లేవ్‌.. ఎందుకో తెలుసా?

దేశవ్యాప్తంగా దీపావళి సంబురాలు ఘనంగా నిర్వహించుకుంటారు. కానీ, పంజాబ్‌లోని మూడు గ్రామాలు,  తమిళనాడులోని కొల్కుడ్​పట్టి , వెట్టంగుడిపట్టి గ్రామాలు మాత్రం అనేక దశాబ్ధాలుగా దీపావళి వేడుకలకు దూరంగా ఉంటున్నాయి. దీనికి కారణం కంటోన్మెంట్ , వలస పక్షులు ఉండటమే.

New Update
There are no Diwali celebrations in those villages.

There are no Diwali celebrations in those villages.

No Diwali : దీపావళి అనగానే దివ్వెలతో వెలిగే అందమైన దృశ్యం కళ్లముందు కదలాడుతోంది. అంతేకాదు, పటాకులు కాల్చుకుని జరుపుకునే సంబురం ఎంతో ఆనందాన్నిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా దీపావళి సంబురాలు ఘనంగా నిర్వహించుకుంటున్నప్పటికీ.. పంజాబ్‌ రాష్ట్రం లోని మూడు గ్రామాలు మాత్రం అనేక దశాబ్ధాలుగా దీపావళి వేడుకలకు దూరంగా ఉంటున్నాయి,  దీనికి కారణం  ఆర్మీ కంటోన్మెంట్‌, ఆయిల్‌ డిపోలకు సమీపంలో ఆ గ్రామాలు ఉండటమే. పంజాబ్‌లో బఠిండా ప్రాంతంలో 1976లో  కంటోన్మెంట్‌ ఏర్పాటయ్యింది. దీంతో దానికి సమీపంలో ఉన్న  ఫస్‌ మండీ, భాగు, గులాబ్‌గఢ్‌ గ్రామాల్లో.. స్థానిక  ఆర్మీ అధికార యంత్రాంగం బాణసంచా కాల్చడంపై కఠిన ఆంక్షలు విధించింది. ప్రతి దీపావళి ముందు ఈ గ్రామాల్లో బాణసంచాతోపాటు పంట వ్యర్థాలను కాల్చవద్దని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తారు. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘించి కాల్చితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. పంటపొలాల్లో వ్యర్థాలకు చిన్నపాటి మంట పెట్టినా సైనికుల నుంచి హెచ్చరికలు వస్తాయి. దీపావళి వచ్చిందంటే తమ పిల్లలు పటాకులు కాల్చుకోవడానికి అమ్మమ్మ లేదా నానమ్మ వాళ్ల ఇళ్లకు పంపిస్తామని స్థానికులు చెబుతున్నారు.

కాగా 1976లో ఇక్కడ కంటోన్మెంట్‌ ఏర్పాటు చేయడానికి ఫస్‌ మండీ సహా పొరుగు గ్రామాల నుంచి వందలాది ఎకరాల భూమి సేకరించారని గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. అంతేకాక మందుగుండు సామగ్రి తరలించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆయా గ్రామాల్లో కొత్త నిర్మాణాలపైనా ఆంక్షలు ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఈ మూడు గ్రామాల్లో మొత్తంగా 1100 నివాసాలు ఉండగా.. 5వేలకుపైగా ప్రజలు నివసిస్తున్నట్లు అధికారుల తెలుపుతున్నారు.ఈ గ్రామాల్లో బాణసంచా, పంట వ్యర్థాలను కాల్చడంపై నిషేధం విధించడంతో పాటు కంటోన్మెంట్​లో గడువు ముగిసిన మందుగుండు పేల్చుతుంటారు. దీని వల్ల తమ గ్రామంలో వాటి శకలాలు పడిన ఘటనలు కూడా ఉన్నాయని ఫూస్​ మండి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సంఘటనల్లో తమ ఆస్తులకు అనేకసార్లు నష్టం కలిగింది అని స్థానిక ప్రజలు అంటున్నారు. కానీ వాటిపై ఫిర్యాదు చేస్తే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.

వలస పక్షుల కోసం..

 తమిళనాడు రాష్ట్రంలోని శివగంగ జిల్లాలో ఉన్న కొల్కుడ్​పట్టి , వెట్టంగుడిపట్టి గ్రామస్థులు కూడా దీపావళి పండుగ‌కు పటాకులు కాల్చరు. దీనికి ఓ పెద్ద కార‌ణ‌మే ఉంది. ఇక్కడ ఉన్న వెట్టంగుడి అభయారణ్యానికి కొన్ని దశాబ్దాలుగా వలస పక్షులు వస్తుంటాయి. అక్కడే కొన్ని రకాల పక్షులు పిల్లల్ని కూడా కంటాయి. అయితే, అవి ముఖ్యంగా శీతాకాలంలో స్విట్జర్లాండ్​, రష్యా, ఇండోనేషియా, శ్రీలంక వంటి సుదూర ప్రాంతాల నుంచి ఈ అభయారణ్యానికి వస్తుంటాయి.  సుమారు 15 వేల పక్షులు అలా వలస వస్తాయి. వలస వచ్చే పక్షులు భయపడకుండా వాటికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఇక్కడి గ్రామస్థులు దీపావళికి పటాకులు కాల్చడాన్ని నిషేదించారు.

 ఈ అభయారణ్యానికి సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య  వివిధ జాతుల పక్షులు వ‌ల‌స‌లు వస్తాయి. అందులో గ్రే హెరాన్‌లు, డార్టర్‌లు, కామన్ టీల్స్ సహా మరో ఐదు నుంచి 10 రకాల వలస పక్షులు జాతులు ఉన్నాయి. ఈ అభయారణ్యం మొత్తం 38 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సుమారు అర్ధశతాబ్దం నుంచి 200 జాతుల వలస పక్షులు వెల్లంగుడి అభయారణ్యానికి వస్తున్నాయని ఇక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. పక్షులను సురక్షితంగా చూసుకునేందుకు ఇక్కడివారంతా కొన్ని ద‌శాబ్దాల నుంచి దీపావళి సమయంలో పటాకులను పేల్చడం కానీ.. తమ పిల్లలు చేత కాల్పించ‌డం కానీ చేయ‌డం లేదు. అయితే గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల పక్షుల రాక తగ్గిందని, పర్యాటకుల సంఖ్య కూడా త‌గ్గింద‌ని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  తుమ్మల, పొన్నం అసలు మీరు మనుషులేనా.. హీటెక్కిన జూబ్లీహిల్స్ ఫైట్!

Advertisment
తాజా కథనాలు