/rtv/media/media_files/2025/07/07/hp-2025-07-07-21-20-04.jpg)
Himachal Pradesh
బ్యాంక్ అంటే సేఫ్. తమ దగ్గర ఉంటే ఎక్కడ దొంగతనం అయిపోతాయో అని భయంతో అందరూ తమ డబ్బులను, బంగారాన్ని అక్కడ దాచుకుంటారు. కానీ ఆ బ్యాంకే కొట్టుకుపోతే.. హిమాచల్ ప్రదేశ్ లో అదే జరిగింది. అక్కడి మండి జిల్లాలో తునాగ్ అనే ప్రాంతంలో ఒకే ఒక్క బ్యాంక్ ఉంది. ఆ జిల్లాలో ప్రజలందరూ అక్కడే డబ్బులు దాచుకుంటారు. కానీ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. దీని ప్రభావానికి లోనైన ప్రాంతాల్లో తునాగ్ కూడా ఉంది. ఈ వరదల్లో అక్కడ చాలా ఇళ్ళతో పాటూ బ్యాంక్ కూడా కొట్టుకుపోయింది. వాన నీరు, కొట్టుకొచ్చిన శిథిలాలు బ్యాంక్ రెండు అంతస్తుల భవనంలోని మొదటి ఫ్లోర్‌ను ముంచెత్తాయి. దాంతో దాని షటర్లు దెబ్బతిన్నాయి.
మా డబ్బులు ఏమయ్యాయో..
తునాగ్ లో ఈ బ్యాంక్ ఒక్కటే ఉంది. ఇది చాలా కాలంగా పని చేస్తోంది. ప్రతీరోజూ భారీ సంఖ్యలో లావాదేవీలు జరుగుతుంటాయి అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అందులో తమ డబ్బు, బంగారం, దస్త్రాలు అన్నీ దాచుకుంటామని తెలిపారు. ఇప్పుడు ఆ బ్యాంక్ వరదల్లో దెబ్బ తినడంతో తమ డబ్బు, పేపర్లు, బంగారం అన్నీ ఏమయ్యాయో తెలియడం లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరదల్లో ఏవైనా కొట్టుకుపోయి, దోపిడీకి గురికావొచ్చని స్థానికులు కాపలాకాస్తున్నారు.
జూన్ 20 నుంచి జూలై 6 వరకు హిమాచల్ ప్రదేశ్ లో వరుసగా వరదలు వచ్చాయి. ఏకంగా 23 సార్లు ఇక్కడి ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. ఇందులో 78 మంది వరకు చనిపోగా మరో 37 మంది గల్లంతయ్యారు. ఇప్పుడు రానున్న మరో మూడు రోజులు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.