/rtv/media/media_files/2025/12/29/dogs-2025-12-29-17-00-31.jpg)
ఢిల్లీలో వీధి కుక్కలపై ఇటీవల పెద్ద హడావుడే జరిగింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవలసి వచ్చింది. దాంతో ఢిల్లీ ప్రభుత్వం చర్యలను చేపట్టింది. కానీ అవి కూడా ఇప్పుడు పెద్ద గొడవకు దారి తీస్తున్నాయి. దేశ రాజధానిలోని వీధి కుక్కలను లెక్కింపునకు ఉపాధ్యాయులను వినియోగించాలని ఢిల్లీ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. వీధి కుక్కల లెక్కింపు కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను నోడల్ ఆఫీసర్లుగా నియమించాలని అన్ని జిల్లాల విద్యా అధికారులకు విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం ఉపాధ్యాయుల పేర్లు, వివరాలను పంపాలని..వాటిని ప్రు్వ ప్రధాన కార్యదర్శి ఆఫీసుకు పంపుతామని చెప్పారు. సుప్రీంకోర్టు సూచనలతో ప్రజా భద్రత కోసం ఈ చర్యలు తీసుకున్నట్టు ఉత్తర్వులలో స్పష్టం చేశారు. పైగా దీనిని అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలని కూడా చెప్పింది. ప్రైవేటు, ప్రభుత్వ టీచర్లు ఇద్దరూ ఇందులో భాగస్వాములవుతారని అధికారులు చెబుతున్నారు.
కుక్కలా..విద్యార్థులా..మా పనేంటి?
వీధి కుక్కలను లెక్కించే ప్రక్రియ కోసం ఒక్కో జిల్లా నుంచి కనీసం 118 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి తమకు ఉత్తర్వులు అందాయని...తమకు వేరే దారి లేదని..కచ్చితంగా చేయాల్సిందేనని టీచర్లు అంటున్నారు. అయితే ఇంకా వీధి కుక్కల లెక్కింపు ప్రక్రియను మొదలెట్టలేదని ఒక టీచర్ చెప్పారు. కానీ ఈ ఉత్తర్వుపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. దీనిని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. టీచర్లు ఇలాంటి పనులు చేయడమేంటి...దీనికి ఇంకెవరూ దొరకలేదా అంటూ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మేము కుక్కుల వెంట పడితే విద్యార్థులకు ఎవరు పాఠాలు చెబుతారు అని అడుగుతున్నారు. ఊపాధ్యాయుల గౌరవం, ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు అంటూ ఉపాధ్యాయుల సంఘం (GSTA) సభ్యుడు కృష్ణ ఫోగట్ మండిపడ్డారు. జంతు సంరక్షణ, అటవీ లేదా ఇతర ప్రభుత్వ విభాగాలకు ఈ ప్రక్రియను ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. టీచర్ వృత్తి అంటే అసలు ఎంత పవిత్రమైనది, గౌరవప్రదమైనది. అలాంటి వారిని వీధి కుక్కల లెక్కింపు పనికి నియమిస్తే...సమాజం ఏమవుతుందని అడుగుతున్నారు. అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యాశాఖ మంత్రికి లేఖ రాశామని కృష్ణ ఫోగట్ తెలిపారు.
అయితే అధికారులు మాత్రం తాము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఉత్తర్వులను జారీ చేశామని చెబుతున్నారు. వీధి కుక్కులను విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల నుంచి సంరక్షణ కేంద్రాలకు తరలించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గత నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది. కుక్కలను తరలించే ముందు వాటికి స్టెరిలైజేషన్, టీకాలు వేసేలా చూడటానికి నోడల్ అధికారులను నియమించాలని కూడా కోర్టు ఆదేశించింది. దానికి తగ్గట్టే తాము నడుచుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఆదేశాల్లో ఎక్కడా టీచర్లను నియమించాలని లేదని..కోర్టు ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి ఢిల్లీ వీధి కుక్కల విషయం మరోసారి రచ్చ అయ్యేలా కనిపిస్తోంది.
Follow Us