Maoist Party: సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయం కాదు..అభయ్‌ వ్యక్తిగతం...మావోయిస్టు పార్టీ

సాయుధ పోరాటాన్ని విరమిస్తామని  పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్‌రావు ఎలియాస్‌ అభయ్‌ ఎలియాస్‌ సోనూ పేరిట లేఖలు విడుదలయ్యాయి. అయితే సాయుధ పోరాటం కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పేరిట మరో లేఖ వెలువడింది.

New Update
Maoist party

Maoist party

 Maoist Party :  ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కోలుకోలేని దెబ్బతింది. పార్టీకి చెందిన పలువురు అగ్రనాయకులు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. దీంతో పార్టీ కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రతిపాదన తీసుకొచ్చింది. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని, సాయుధ పోరాటాన్ని విరమిస్తామని  పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్‌రావు ఎలియాస్‌ అభయ్‌ ఎలియాస్‌ సోనూ పేరిట లేఖలు విడుదలయ్యాయి. అయితే  తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పేరిట మరో లేఖ వెలువడింది. అయితే వీరిద్దరి లేఖలు  పరస్పర విరుద్ధంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరామం ప్రకటించి శాంతిచర్చలకు సిద్ధంగా ఉన్నామని అభయ్‌ లేఖలో ప్రస్తావించగా.. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని దానికి పార్టీకి ఏమాత్రం సంబందం లేదని జగన్‌ పేర్కొనడం కలకలం రేపింది. ఇది పార్టీ అధికారిక ప్రకటన కాదని ఆయన చెప్పారు. అదే సమయంలో  కేంద్ర ప్రభుత్వ బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలను తీవ్రతరం చేయాలని జగన్‌ పిలుపునివ్వడం సంచలనంగా మారింది. అయితే ఈ రెండు లేఖల్లో ఉన్న అభిప్రాయాలను బట్టి ఆయుధాలను వీడే విషయంలో పార్టీ అగ్రనేతల మధ్య భిన్నాభిప్రాయాలున్నట్లు  చర్చ సాగుతోంది.

జగన్‌ విడుదల చేసిన లేఖలోని సారాంశం ఇది

‘విప్లవోద్యమ నిర్మూలనకు బీజేపీ ఎప్పటి నుంచో కగార్‌ పేరుతో భారీస్థాయి యుద్ధ చర్యలు కొనసాగిస్తోంది. ఈ ఏడాది మార్చిలో కొందరు ప్రజాస్వామికవాదులు శాంతికమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి, మావోయిస్టు పార్టీకి మధ్య శాంతిచర్చల ప్రతిపాదన చేశారు. దీనికి జవాబుగా కూంబింగ్‌లు, కొత్త క్యాంపుల నిర్మాణాల్ని నిలిపివేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. కానీ కేంద్రం ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా యుద్ధచర్యలను కొనసాగిస్తూనే ఉంది. హోంమంత్రి బాహాటంగానే 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని ప్రకటిస్తున్నారు. మావోయిస్టులతో చర్చించేది లేదని.. ఆయుధాలు విడిచి లొంగిపోవాలని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. ఈ క్రమంలో మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న బృందంపై దాడి చేయడంతో 28 మంది  మరణించారు. జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య కూడా పలువురు కేంద్ర, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు మృతిచెందారు. ఇలా హత్యాకాండ కొనసాగుతుండగా నెల రోజులు సమయం ఇవ్వాలని అడగడం అనాలోచితం. పార్టీ కమిటీ సభ్యులు ఈమెయిల్‌ ఇచ్చి అభిప్రాయాలు కోరడం ఏం పద్ధతో అర్థం కావడం లేదు. ఉద్యమాన్ని విడిచి జనజీవనంలో కలిసి లీగల్‌గా పనిచేయాలనుకున్నప్పుడు పార్టీ కమిటీలో చర్చించి అనుమతి పొందొచ్చు. తన అభిప్రాయాన్ని పార్టీ ఛానల్‌లో పంపించినా జవాబు దొరికేది. కానీ, ఇలాంటి కీలక విషయాన్ని బహిరంగంగా ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. దేశంలోని ఏ పార్టీ ఇలాంటి నిర్ణయాలను ఇంటర్నెట్‌ ద్వారా బహిరంగ చర్చకు పెట్టి పరిష్కరించాలని చూడదు. అలాంటిది ఒక రహస్య పార్టీపై తీవ్రమైన దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో సరిగ్గా ఆలోచించే వాళ్లెవరూ ఇలా చేయరు. ప్రస్తుతం పార్టీలో అనవసరంగా నష్టపోవాలని ఎవరూ అనుకోవడంలేదు. ఈ సమస్యలకు ఇప్పటికిప్పుడే పరిష్కారం దొరక్కపోవచ్చు. 2024లో పొలిట్‌బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్‌ను అమలు జరపడమే తక్షణ కర్తవ్యం..’ అని జగన్‌ పేర్కొనడం గమనార్హం.

Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్‌ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్

Advertisment
తాజా కథనాలు