Trump tariffs on India: ట్రంప్ టారిఫ్‌లా.. రష్యా చమురు కొనుగోళ్లా.. ఇండియాకి ఏది బెటర్..?

రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు నిలిపివేస్తే సుంకాలు తగ్గిస్తామని పీటర్ నవారో అన్నారు. ఇప్పుడు భారత్ ముందున్నవి రెండే ఆప్షన్లు. ఇండియాపై అమెరికా సుంకాల భారం కంటే.. రష్యా నుంచి చమురు కొనుగోలు మనకు ముఖ్యమా..? ఈ రెండిటిలో ఇండియాకి బెటర్.

New Update
Modi between trump and russia

Trump tariffs on India

అమెరికాతో ఇండియా దౌత్యసంబంధాలు పూర్తిగా దెబ్బతింటోన్నాయి. ఇండియాపై 50శాతం టారిఫ్‌ల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ఆగస్ట్ 27 నుంచి భారత్ ఎగుమతులపై 50శాతం సుంకాలు అమలు అవుతున్నాయి. దీనిపై గురువారం అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు నిలిపివేస్తే సుంకాలు తగ్గిస్తామని పీటర్ నవారో అన్నారు. ఇప్పుడు భారత్ ముందున్నవి రెండే ఆప్షన్లు. ఇండియాపై అమెరికా సుంకాల భారం కంటే.. రష్యా నుంచి చమురు కొనుగోలు మనకు ముఖ్యమా..? ఈ రెండిటిలో ఇండియాకు ఏది ప్రాధాన్యతో ఇప్పుడు చూద్దాం.. 

ట్రంప్ టారీఫ్‌లు Vs రష్యా కొనుగోళ్లు

భారతదేశంపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు, రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ట్రంప్ ప్రభుత్వ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చేసిన విమర్శలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ఒకవైపు రష్యా నుంచి చౌకగా లభిస్తున్న ముడి చమురు దేశ ఇంధన అవసరాలను తీరుస్తుంటే, మరోవైపు దీనిపై అమెరికా విధించిన భారీ సుంకాల వల్ల భారత ఎగుమతులు దెబ్బతింటున్నాయి. అయితే, ఈ క్లిష్ట పరిస్థితులు భారత్‌కు కొత్త మార్గాలను అన్వేషించే అవకాశాన్ని కల్పిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ప్రభుత్వ సలహాదారు పీటర్ నవారో తన విచిత్రమైన వాదనతో భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే కారణమని ఆయన ఆరోపించారు. ఈ యుద్ధాన్ని "మోదీ యుద్ధం"గా అభివర్ణించారు. రష్యా నుంచి భారత్ చౌకగా కొన్న చమురును శుద్ధి చేసి, యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలకు అధిక ధరలకు అమ్ముతోందని, ఈ లాభాలు రష్యాకు యుద్ధానికి అవసరమైన నిధులను అందిస్తున్నాయని ఆరోపించారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపితే, తాము విధించిన 50 శాతం సుంకాలను 25 శాతానికి తగ్గిస్తామని నవారో ఇండియా ముందు ఓ డీల్ పెట్టారు.

అమెరికా 50% సుంకాలు మన GDPపై 2% ప్రభావం

అమెరికా విధించిన 50 శాతం సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సుంకాలు ప్రధానంగా భారతీయ వస్త్రాలు, ఆభరణాలు, తోలు ఉత్పత్తులు, ఆటోమొబైల్స్ వంటి రంగాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఈ నిర్ణయం వల్ల భారత ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతారని, లక్షల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సుంకాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపదని మరికొందరు చెబుతున్నారు. ఎందుకంటే, అమెరికాకు భారత్ చేసే ఎగుమతులు మొత్తం జీడీపీలో కేవలం 2 శాతమే. కాబట్టి ఈ ప్రభావం పరిమితంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

దేశ ప్రయోజనాలకే ఇండియా స్టాండ్ 

అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్ తన దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, భారత్ తన 140 కోట్ల జనాభాకు సరసమైన ధరల్లో ఇంధనం అందించడానికి రష్యా చమురు అవసరమని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు అంతర్జాతీయ ఆంక్షలకు లోబడే ఉన్నాయని, అమెరికా ఈ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని భారత్ విమర్శించింది. అమెరికా సహా ఐరోపా దేశాలు కూడా రష్యా నుంచి ఇప్పటికీ చమురు కొనుగోలు చేస్తున్నాయని గుర్తు చేసింది.

సవాళ్లను అధిగమించే మార్గాలు

ట్రంప్ ప్రభుత్వం విధించిన ఈ సుంకాలు భారత్‌కు ఒక రకంగా మేలు చేస్తాయని కొందరు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అమెరికా సుంకాలతో తలెత్తే సవాళ్లను అధిగమించడానికి భారత్ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఈ పరిస్థితులను "మేల్కొలుపు పిలుపు"గా అభివర్ణించారు. ఏ ఒక్క దేశంపై కూడా ఎక్కువగా ఆధారపడకుండా, ఇతర మార్కెట్లలో ఎగుమతులను విస్తరించాలని ఆయన సూచించారు. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా వంటి ప్రాంతాల్లో కొత్త మార్కెట్లను అన్వేషించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదే సమయంలో దేశీయ వినియోగాన్ని పెంచేందుకు "మేడ్ ఇన్ ఇండియా" ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది.

ముగింపు

అమెరికాతో వాణిజ్య లోటు ఉన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం కొనసాగుతుందని ఇరు దేశాల నాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ, భారత్ తన నిర్ణయాలను దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తీసుకుంటుందని అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు కొనడం నిలిపివేస్తే తాత్కాలికంగా సుంకాల నుంచి ఉపశమనం పొందవచ్చు, కానీ దీర్ఘకాలంలో దేశానికి ఆర్థికంగా, రాజకీయంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భారత్ ఈ విషయంలో తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Advertisment
తాజా కథనాలు