ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 8వ వేతన సంఘం నియమావళికి కేబినెట్ ఆమోదం

దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు నియమావళికి కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్‌లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

New Update
ashwini vaishnaw

ashwini vaishnaw

దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన నియమావళికి కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లు ఈ కమిషన్ సిఫార్సుల ద్వారా ప్రయోజనం పొందనున్నారు. వేతన సంఘం నియమావళి ఖరారు కావడంతో, త్వరలోనే కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకం ప్రక్రియ మొదలవుతుంది. ఈ కమిషన్‌ తాత్కాలిక సంస్థగా పనిచేస్తుంది. కమిషన్ ఏర్పాటు చేసిన తేదీ నుంచి 18 నెలల్లో తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ కమిషన్ సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రావచ్చని కేంద్ర మంత్రి అంచనా వేశారు. సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లను సవరించడానికి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1తో ముగుస్తాయి.

8వ వేతన సంఘం సిఫార్సులు చేసేటప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక క్రమశిక్షణ అవసరం, సంక్షేమ చర్యల కోసం తగిన వనరుల లభ్యత, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగ ఉద్యోగుల వేతన నిర్మాణం వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ వేతన సంఘం సిఫార్సుల ద్వారా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచే అవకాశం ఉన్నందున, కేంద్ర ఉద్యోగుల కనీస మూల వేతనం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినప్పటికీ, నియమావళి ఖరారు, ఛైర్మన్ నియామకంలో జాప్యం జరగడంపై ఉద్యోగుల్లో కొంత ఆందోళన ఉండేది. తాజాగా నియమావళికి ఆమోదం లభించడంతో వేతన సవరణ ప్రక్రియలో ఒక అడుగు ముందుకు పడింది.

Advertisment
తాజా కథనాలు