జమిలి ఎన్నికల బిల్లు.. విప్ జారీ చేసినా 20 మంది బీజేపీ ఎంపీలు డుమ్మా

మంగళవారం కేంద్రం లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టగా.. దాదాపు 20 బీజేపీ ఎంపీలు ఈ సభకు డుమ్మా కొట్టారు. ఎంపీలందరూ రావాలని విప్‌ జారీ చేసినప్పటికీ ఇలా పలువురు రాకపోవడంతో హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రానివారందరికీ నోటీసులు పంపించనుంది.

New Update
Lok Sabha

కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందుకోసం సోమవారమే హైకమాండ్‌ బీజేపీ ఎంపీలందరూ తప్పకుండా సభకు హాజరుకావాలని విప్ కూడా జారీ చేసింది. అయినప్పటికీ కూడా అందరూ రాలేదు. దాదాపు 20 మంది బీజేపీ ఎంపీలు మంగళవారం జరిగిన లోక్‌సభ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం హాజరుకాని ఎంపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సభకు రాని 20 మంది ఎంపీలకు నోటీసులు జారీ చేయనుంది.  

Also Read: ఇండియా కూటమికి షాక్.. సీఎం ఫడ్నవీస్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే

ఇదిలాఉండగా గత కొన్నేళ్లుగా చర్చనీయాంశమవుతున్న జమిలి ఎన్నికల బిల్లు ఎట్టకేలకు పార్లమెంటులోకి వచ్చింది. ఇందుకోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు-2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు-2024ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ రెండు బిల్లులకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు. మరో 198 మంది ఎంపీలు ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటేశారు. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ విధానంలో ఈ ఓటింగ్ జరిగింది. 

అయితే ఈ బిల్లులు ప్రవేశపెట్టడానికి ముందు అధికార, విపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీల ఎంపీలు ఈ బిల్లులను వ్యతిరేకించారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రజాస్వామ్య మౌలిక వ్యవస్థపై దాడి చేయడమేనని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి అన్నారు. ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. అలాగే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమని కాంగ్రెస్ పార్టీ సూచించింది. 

Also Read: జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు..

 జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే లోక్‌సభ, రాజ్యసభలో మూడింట రెండొంతుల మంది సభ్యులు మెజార్టీ రావాలి. లోక్‌సభలో మొత్తం 545 మంది సభ్యులు ఉన్నారు. రెండొంతు అంటే దాదాపు 364 మంది ఎంపీలు జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతుగా ఓటు వేయాలి. ఇక రాజ్యసభలో మొత్తం 245 మంది ఉంటారు. ఇందులో రెండొంతుల అంటే కనీసం 164 మంది సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేయాలి. అయితే ప్రస్తుతం ఎన్డీయేకు కేవలం లోక్‌సభలో 293 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. రాజ్యసభలో 125 మంది సభ్యుల బలం ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ఎన్డీయే కూటమి ఇతర పార్టీల మద్దతు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు