Karur Stampede: పక్కా ప్లాన్ తోనే కరూర్ తొక్కిసలాట.. విజయ్ ర్యాలీపై ఖుష్బూ సంచలన ఆరోపణలు!

తమిళనాడు కరూర్‌లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటన 'పక్కా ప్రణాళికతో, కావాలని జరిగినట్లుగా కనిపిస్తోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

New Update
BJP leader Khushbu

తమిళనాడు కరూర్‌లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటన 'పక్కా ప్రణాళికతో, కావాలని జరిగినట్లుగా కనిపిస్తోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రంలోని అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన ఈ విషాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఖుష్బూ సుందర్ స్పందిస్తూ, "ఈ దుర్ఘటనలో పూర్తిగా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ ర్యాలీకి ఎంతమంది జనం వస్తారో డీఎంకే ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ, ర్యాలీ నిర్వహించడానికి సరైన స్థలాన్ని కేటాయించలేదు. ఇది ఎవరో కావాలని సృష్టించిన విపత్తులాగా అనిపిస్తోంది" అని ఆమె తీవ్రంగా విమర్శించారు. 41 మంది ప్రాణాలు కోల్పోయినా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మౌనంగా ఉండటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. "ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికైనా తన మౌనాన్ని వీడి ఈ విషయంపై మాట్లాడాలి. ఈ ఘటనకు ముందు పోలీసులు లాఠీఛార్జ్ ఎందుకు చేశారు? దీనికి సంబంధించిన వీడియోలు చాలా బయటకు వచ్చాయి. ఈ చర్య వెనుక పక్కా ప్రణాళికతో కూడిన కుట్ర ఉందని నమ్ముతున్నాను" అని ఖుష్బూ ప్రశ్నించారు.

ప్రస్తుతం ఈ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ప్రారంభించింది. ఈ కేసులో టీవీకే పార్టీకి చెందిన కొందరిపై ఇప్పటికే కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అయితే, బీజేపీ నేత ఖుష్బూ చేసిన ఈ 'పక్కా ప్రణాళిక' ఆరోపణలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి.

Advertisment
తాజా కథనాలు