/rtv/media/media_files/2025/09/26/singer-zubeen-garg-death-case-2025-09-26-10-33-40.jpg)
Singer Zubeen Garg death case
Zubeen Garg : అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయనది సాధారణ మరణం కాదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు విచారణ మరింత వేగవంతం చేశారు. జుబీన్ గార్గ్ ఇటీవల సింగపూర్‌లో అనుమానస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదవశాత్తు మరణించారని అంటున్నప్పటికీ అభిమానులు మాత్రం ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు. ఈ క్రమంలో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. జుబీన్‌కు మిషమిచ్చి ఉంటారని ఆయన బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేయడంతో కేసు మరో మలుపుతిరిగింది. జుబీన్ గార్గ్ మేనేజర్, ఫెస్టివల్ ఆర్గనైజేషన్ ఈ కుట్రకు పాల్పడి ఉంటారని గోస్వామి ఆరోపించడం సంచలనంగా మారింది.
కాగా జుబీన్ మృతిపై ఇప్పటికే అస్సాం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పలువురు సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసుకున్నారు. జుబీన్ బ్యాండ్‌మేట్ అయిన గోస్వామిని విచారణకు పిలిచారు. విచారణ అనంతరం ఆయన ఈ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘సింగపూర్‌లో జుబీన్‌ఆయన మేనేజర్ సిద్ధార్థ్ శర్మ ఒకే హోటల్‌లో ఉన్నారు. యాట్ ట్రిప్‌లో గాయకుడికి ప్రమాదం జరిగిన అనంతరం శర్మ తీరు అనుమానాస్పదంగా కన్పించిందని ఆరోపించారు. సముద్రం మధ్యలో ఆ విహార నౌకను మేనేజర్ బలవంతంగా తన నియంత్రణలోకి తీసుకున్నారన్నారు. అంతకుముందు మా అందరికీ డ్రింక్స్ తీసుకు రావొద్దని అస్సాం అసోసియేషన్ (సింగపూర్) సభ్యుడు, ఎన్‌ఆర్‌ఐ తన్మోయ్‌కు చెప్పారన్నారు. సిద్ధార్థ్ శర్మనే స్వయంగా డ్రింక్స్ తీసుకొచ్చారు’’ అని గోస్వామి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనడం గమనార్హం.
అంతేకాక జుబీన్ గార్గ్ మునిగిపోతున్న సమయంలోనూ శర్మ ‘అతన్ని వెళ్లనివ్వండి’ అంటూ అరవడం తనకు వినిపించిందని గోస్వామి వివరించారు. గార్గ్ శిక్షణ పొందిన స్విమ్మర్ అని, తనతో పాటు ఎంతోమందికి స్విమ్మింగ్‌లో కోచింగ్ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన ఈత కొడుతూ నీట మునిగి చనిపోయే ఆస్కారమే లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. మేనేజర్ శర్మతో కలిసి ఈవెంట్ ఆర్గనైజర్ శ్యామ్‌కాను మహంత కలిసి ఈ కుట్రకు పాల్పడి ఉంటారని గోస్వామి అనుమానం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే వారు జుబీన్‌కు విషమిచ్చి ఉంటారని ఆరోపించారు. ఆ తర్వాత దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉంటారని వెల్లడించారు. జుబీన్ నోరు, ముక్కు నుంచి నురగ వస్తున్నప్పుడు కూడా మేనేజర్ ఏమాత్రం కంగారు పడలేదని తెలిపారు. వెంటనే వైద్య చికిత్స అందించకుండా ఆలస్యం చేశారని కీలక ఆరోపణ చేశాడు.
కాగా గోస్వామి ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే జుబీన్ మృతి కేసులో మేనేజర్ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఆయనపై నాన్‌బెయిలబుల్ అభియోగాలు కూడా నమోదు చేశారు.ఆయనతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ మహంత ఆర్థిక వ్యవహారాల పైనా ఆరా తీస్తున్నారు. గతంతో మహంతా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు అస్సాం సీఐడీ పోలీసులు గుర్తించడం గమనార్హం. ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలతో కూడుకున్న కేసు కావడంతో త్వరలోనే ఈ కేసులో ఈడీ, ఐటీ విభాగం కూడా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కాగా సెప్టెంబరు 19న సింగపూర్‌లో జుబీన్ మరణించాడు. ఆయన స్కూబా డైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత విహార నౌకలో ప్రమాదానికి గురైన జుబీన్‌ను సింగపూర్ ఆసుపత్రికి తరలించారని, ఆయన అక్కడే మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Weight loss Tips: డైలీ ఈ టిప్స్ పాటిస్తే.. నెల రోజుల్లో హెవీ వెయిట్ లాస్.. ఎలాగంటే?