/rtv/media/media_files/2025/10/28/notice-issued-to-prashant-kishor-over-name-in-voter-lists-of-bihar-and-west-bengal-2025-10-28-21-04-58.jpg)
Big shock for Prashant Kishor's Jan Suraj Party
Prashant Kishor : బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ జన్ సూరాజ్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. పోటీ చేసిన ఏ ఒక్క స్థానంలోనూ ఈ పార్టీ విజయం సాధించలేకపోయింది. కనీసం.. రెండో స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ 0-5 సీట్లు గెలుస్తాయని అంచనా వేసినప్పటికీ అదీ జరగలేదు. ప్రశాంత్ కిషోర్ బలమైన అభ్యర్థులు కూడా పోటీకి దగ్గరగా లేరు. రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీలను అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయిన ప్రశాంత్ కిషోర్.. సొంత పార్టీకి జనంతో జై కొట్టించుకోలేక జీరోగా మిగిలారు. ఆయన తన సొంత పార్టీ JSP విషయంలో అట్టర్ ప్లాప్ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ప్రసంగాలు వినడానికి వచ్చిన జనం ఓటు వేయడంలో మాత్రం వెనుకడుగు వేశారు.
కాగా ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిషోర్ ఒక జాతీయ టీవీ జర్నలిస్టుతో మాట్లాడుతూ, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ యునైటెడ్ 25 సీట్లకు మించి గెలవదని అన్నారు. అలా జరగకపోతే తాను రాజీకీయాలనుంచ తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఆ జర్నలిస్ట్ మళ్ళీ ఆయనను అడిగినప్పుడు, "ఈ రికార్డింగ్ ను ఉంచుకోండి. నా పార్టీ అధికారంలోకి వచ్చినా, జేడీయూ 25 సీట్లకు పైగా గెలిస్తే, నేను రాజకీయ సన్యాసం చేస్తాను" అని అన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం, ప్రశాంత్ కిషోర్ ఒక ప్రకటనలో రాబోయే ఐదు సంవత్సరాలు ప్రజల మధ్య పోరాడుతూనే ఉంటానని అన్నారు.
ప్రశాంత్ కిషోర్ తన పార్టీ విషయంలో చేసిన మొట్టమొదటి పెద్ద తప్పు ఏంటంటే.. బీజేపీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్ను JSP జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించడం. ఉదయ్ సింగ్ అంత పాపులర్ ఏం కాదు. బీహార్ దాటిపోతే ఆయన ఎవరో కూడా ఏ ఒక్కరికీ తెలియదు. బీహార్లో కూడా చాలామందికి ఆయన గురించి అంత తెలియదు. పెద్దగా జనాదరణ లేని ఆయనను తీసుకొచ్చి జన్ సూరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించి.. JSP పార్టీని ఒక రిమోట్ కంట్రోల్ పార్టీగా ప్రశాంత్ కిషోర్ మార్చేశారు.
అలాగే తేజశ్విపై పోటీ చేస్తానని సవాల్ చేసి ఆ తర్వాత తప్పుకోవడంతో ఆయన ప్రజల్లో విశ్వసనీయతను కోల్పొయారు. "బీహార్‌కు కొత్త సూర్యుడిని తీసుకువస్తానని" చెప్పుకున్న కిషోర్, ప్రత్యామ్నాయ నాయకుడిగా తనను తాను స్థాపించుకునే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోకపోవడం. ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం అధికారం. అలాంటిది.. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ఆ పార్టీ స్థాపించిన వ్యక్తే బలంగా చెప్పుకోలేకపోవడం అంటే.. స్వయంకృతాపరాధమే. ఎందరో విద్యావంతులను, డాక్టర్లను, ఇంజనీర్లను, ప్రొఫెసర్లను అభ్యర్థులుగా బరిలో నిలిపిన ప్రశాంత్ కిషోర్ తాను సీఎం అభ్యర్థిని అని ప్రొజెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. పీకేను జనం నమ్మకపోవడానికి మరో ప్రధాన కారణం.. మాట మీద నిలకడలేకపోవడం.
అలాగే ఎన్నికల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి కేంద్ర నాయకులను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం ఆయన మానుకున్నారు. దీంతో కిషోర్ బీజేపీకి బీ-టీమ్‌గా వ్యవహరిస్తున్నారని ప్రజలు భావించారు. ప్రశాంత్ కిషోర్ బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి (ఉప ముఖ్యమంత్రి), జెడీయు నాయకుడు అశోక్ చౌదరి (మంత్రి) సహా ప్రముఖ ఎన్డీఏ నాయకులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. అయితే, కిషోర్ తన ఆరోపణలను విలేకరుల సమావేశానికే పరిమితం చేశారు. కుల రాజకీయాలకు పాల్పడబోమని హామీ ఇచ్చి, కులం, మతం పేరుతో టిక్కెట్లు ఇవ్వడం మైనస్ అయింది. మద్య నిషేధం విషయంలోనూ ఆయన వైఖరి స్పష్టం చేయకపోవడం కూడా ప్రశాంత్ కిశోర్ రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి కారణమైంది.
Follow Us