/rtv/media/media_files/2025/09/12/modi-pm-2025-09-12-15-28-42.jpg)
Narendra Modi
Manipur : జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు పర్యటించడానికి సిద్ధమయ్యాడు. అయితే మోదీ పర్యటన వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మణిపూర్‌కు చెందిన 43 మంది స్థానిక నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఘటన ఉఖ్రుల్ జిల్లాలోని ఫుంగ్యార్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని రాజీనామా చేసిన నేతలు వాపోయారు. పార్టీలో అంతర్గత సంప్రదింపులు, కలుపుగోలుతనం లోపించాయని, క్షేత్రస్థాయి నాయకత్వాన్ని ఏమాత్రం గౌరవించడం లేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు తాము కట్టుబడి ఉన్నామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో మాత్రం కొనసాగలేమని స్పష్టం వారు చేశారు. రాజీనామా చేసిన వారిలో ఫుంగ్యార్ అధ్యక్షుడు, మహిళా, యువ, కిసాన్ మోర్చాల అధ్యక్షులు, పలువురు బూత్ స్థాయి అధ్యక్షులు కూడా ఉన్నట్లు తెలిపారు.
అయితే ఈ మూకుమ్మడి రాజీనామాలపై మణిపూర్ బీజేపీ రాష్ట్ర విభాగం తీవ్రంగా స్పందించింది. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ అని కొట్టి పారేసింది. ఇది ముమ్మాటికి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆవుంగ్ షిమ్రే హోపింగ్‌సన్ ఆరోపించారు. "రాజీనామా చేసిన వ్యక్తులు 2022 అసెంబ్లీ ఎన్నికల నుంచే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే ఈ చర్యకు పాల్పడ్డారు" అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
నేడు మోదీ పర్యటన
కాగా, మే 2023లో మైతీ, కుకీ వర్గాల మధ్య జాతి హింస చెలరేగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్‌కు రావడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ 13న ఆయన పర్యటన ఖరారైన నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. హింస కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 260 మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగా, అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచిన విషయం తెలిసిందే.
కాగా మోదీ పర్యటన సందర్భంగా అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో అట్టుడికిపోయిన చురాచాంద్‌పూర్ ను సందర్శిస్తారు. శాంతిభద్రతలు పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతోండటం, మణిపూర్ పై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రతిపక్షాలు నిలదీస్తోన్న పరిస్థితుల్లో ఆయన ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ పర్యటనలో భాగంగా బాధిత కుటుంబాలను కలుసుకుంటారు. అనంతరం రూ. 8,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిలో చురాచంద్‌పూర్- రూ. 7,300 కోట్లు, ఇంఫాల్- రూ. 1,200 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు అదనంగా మరో రూ. 7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీత్ కుమార్ గోయల్ ఈ వివరాలను వెల్లడించారు. కొద్దిసేపటి కిందటే ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఢిల్లీ నుంచి ఉదయం 10 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో మోదీ మణిపూర్ కు బయలుదేరివెళుతారు. 11:30 గంటలకు చురాచంద్‌పూర్‌కు చేరుకుంటారు. అల్లర్లు, దాడుల ఘటనల్లో నష్టపోయిన బాధితులను పరామర్శించనున్నారు. మృతుల కుటుంబీకులతో సమావేశమైన అనంతరం మౌలిక సదుపాయాల కల్పనక సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. కొన్నింటిని ప్రారంభిస్తారు. స్టేట్ పీస్ గ్రౌండ్‌లో బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్లాకు చేరుకుంటారు. అక్కడ కూడా బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.
Also Read : Cyber Fraud: సైబర్ నేరగాళ్ల వలలో జనసేన ఎంపీ.. ఏకంగా రూ.92 లక్షలు ఎలా కొట్టేశారంటే?