/rtv/media/media_files/2025/09/17/sbi-bank-robbery-2025-09-17-10-26-53.jpg)
SBI Bank Robbery
SBI Bank Robbery : కర్ణాటకలో మరోసారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గతంలో నగదు తరలిస్తున్న వాహనంపై దాడి చేసి భారీగా నోట్ల కట్టలు ఎత్తుకెళ్లిపోయిన దొంగలు ఈసారి ఏకంగా బ్యాంక్‌పైనే దాడి చేశారు. విజయపుర జిల్లా ఎస్‌బీఐ బ్యాంక్‌లోకి చొరబడి.. సిబ్బందిని బెదిరించి రూ.58 కోట్ల విలువైన నగదు, నగలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది. ముసుగులు ధరించి వచ్చిన దుండగులు తుపాకులు, ఇతర ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి భారీగా బంగారం, రూ.8 కోట్ల నగదును దోచుకొన్నారు. మంగళవారం సాయంత్రం దొంగలు బ్యాంకులోకి ఒక్కసారిగా చొరబడినట్లు ఉద్యోగులు తెలిపారిఉ. ఉద్యోగులను బంధించి యథేచ్ఛగా దోపిడీకి పాల్పడి పరారయ్యారు.
విజయపుర జిల్లా శివారు పట్టణం చడవణలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌లోని మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఏడు, ఎనిమిది మంది సభ్యులు కలిగిన ముఠా ఒకటి లోపలికి ప్రవేశించి నానా హంగామా సృష్టించింది. అక్కడి సిబ్బందిని గన్స్, కర్రలు, రాడ్స్‌తో బెదిరించారు. అంతేకాకుండా మేనేజర్, ఉద్యోగుల చేతులు, కాళ్లు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. బ్యాంకు మూసివేసి ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో ఈ దోపిడీ జరిగింది.
బ్యాంక్ మేనేజర్, ఉద్యోగులు బ్యాంక్ తాళాలు వేసుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడుతున్న సమయంలో ఒక్కసారిగా దొంగల ముఠా బ్యాంక్‌లోని ప్రవేశించింది. అనంతరం అక్కడ ఉన్న వారందరిని భయపెట్టి ఈ ఘాతుకానికి పాల్పడింది. మేనేజర్ దగ్గర ఉన్న సేఫ్టీ లాకర్ తాళాలు తీసుకున్న ముఠా సభ్యులు లాకర్స్ ఓపెన్ చేసి రూ.8 కోట్ల నగదు, రూ.50 కోట్ల విలువైన నగలు దోచుకున్నారు. అనంతరం వాహనాల్లో దొంగల ముఠా మహారాష్ట్ర వైపు వెళ్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు… దొంగల ముఠా కోసం గాలిస్తున్నారు. భారీ ఎత్తున చోరీ జరగడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుని గాలిస్తున్నారు.నిందితులు వాడిన కారు పంధర్‌పుర్ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. దొంగల కోసం కర్ణాటక, మహారాష్ట్రలో భారీగా గాలింపు చర్యలు చేపట్టారు. దొంగలు మిలిటరీ యూనిఫామ్‌ను పోలిన దుస్తులు ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దోపిడీ సమయంలో బ్యాంక్ మేనేజర్ అలారమ్ బెల్‌ను నొక్కకుండా వారు ఆయుధాలతో బెదిరించినట్లు తెలిసింది.
ఇప్పటికే డాగ్‌స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులను ఆ ప్రాంతానికి రప్పించారు. వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. కేసును ఎస్పీ లక్ష్మణ్ నింబార్గి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. దుండగులు సిబ్బందిని బెదిరించి స్ట్రాంగ్‌రూమ్ వివరాలు తెలుసుకొని.. అందులోని సొమ్మును దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ కస్టమర్ ఆ సమయంలో బ్యాంకులోకి వెళ్లిన సమయంలో అక్కడి పరిస్థితి గమనించి.. పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. దొంగలు మహారాష్ట్రకు పారిపోయి ఉంటారని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మేలో కూడా విజయపుర జిల్లాలోని కెనరా బ్యాంక్‌లో ఇలాగే భారీ దోపిడీ జరిగింది. లాకర్ల నుంచి 58 కిలోల బంగారం రూ.5.2 లక్షల నగదును దుండుగులు ఎత్తుకెళ్లారు. దొంగలు బ్యాంకులో చొరబడే ముందు సీసీటీవీ కెమెరాల వైర్లు, విద్యుత్తు తీగలను కత్తిరించారు. ఖాదీమారా ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: Dhanush Son: ఫస్ట్ టైమ్.. కొడుకుతో కలిసి దుమ్మురేపిన ధనుష్.. డాన్స్ వీడియో వైరల్!
.