CPI : భారత్‌లో ఎర్రజెండాకు వందేండ్లు

శ్రామిక వర్గ జయకేతనం ‘ఎర్రజెండా’భారత్‌లో శతవసంతాలుదాటి నూరేళ్ళ పండుగ జరుపుకుంటోంది. 1925డిసెంబర్ 25నపుట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఏడాదితో వందేండ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది.

New Update
FotoJet (11)

100 years of the red flag in India

 CPI : శ్రామిక వర్గ జయకేతనం ‘ఎర్రజెండా’భారత్‌లో శతవసంతాలుదాటి నూరేళ్ళ పండుగ జరుపుకుంటోంది. 1925డిసెంబర్ 25నపుట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఏడాదితో వందేండ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది. మార్క్సిస్టు మూల సూత్రాల ఆధారంగా రూపుదిద్దుకున్న వర్గ పోరాటంతో ప్యారిస్‌ కమ్యూన్ ఏర్పడినప్పటికీ అది వేళ్ళమీద లెక్కబెట్టుకునే రోజులే మనుగడలో ఉంది. ప్యారిస్‌ కమ్యూన్ గుణపాఠం తీసుకొని వ్లాదిమిర్‌ ఇల్విచ్ లెనిన్ రష్యాలో శ్రామిక వర్గ రాజ్యాంగ యంత్రం అనే మార్క్సిస్టు సిద్ధాంతం వెలుగులో 1919 అక్టోబర్ విప్లవం విజయవంతం చేశాడు.

సువిశాల భూభాగం,ప్రజాబాహుళ్యంగల రష్యాలో ఎర్రజెండా ఆవిర్భావంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రామిక వర్గంపై ఆ ప్రభావం పడింది. మార్క్సిస్టు సిద్ధాంత కర్తలు ఏర్పాటు చేసుకున్న ‘కమ్యూనిస్టు ఇంటర్నేషనల్’కూడా ప్రపంచం అంతటా ఎర్రజెండా విస్తరణకు బాటలు వేసింది. రష్యా అక్టోబర్ విప్లవ ప్రభావంతోనే ఇండియాలో కూడా 1925లోనే రాడికల్ హ్యుమనిస్టు యంయన్.రాయ్,  దత్,యస్ఏ డాంగే, తదితర కార్మిక నేతల నేతృత్వంలో “కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా” సీపీఐకి అంకురార్పణ జరిగింది. ఆనాటి బ్రిటిష్ వలసవాదులు కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించడంతో అప్పట్లో రహస్యంగా పనిచేయవలసి వచ్చింది. భారత స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్‌తో కలిసి పని చేయడంతో పాటు బొంబాయి డాక్ కార్మికుల సమ్మె లాంటి చారిత్రక తిరుగుబాటుకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. భారత దేశం కంటే ఆలస్యంగా ఎర్రజెండా ఆవిర్భావం జరిగిన పొరుగు దేశం చైనాలో మావో నేతృత్వంలో 1949లోనే విప్లవం విజయవంతమైంది . అక్కడ కమ్యూనిస్టులు అధికారంలోకి రాగలిగినప్పటికీ ఇండియాలో కమ్యూనిస్టు పార్టీ విస్తరణ దశలోనే ఉంది.

విభిన్న భౌగోళిక వాతావరణం, విభిన్న జీవన విధానాలు, సంస్కృతి,వర్గ పొందికల్లో వ్యత్యాసాల మూలంగా దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించినప్పటికీ  కమ్యూనిస్టు పార్టీ అధికారం లోకి రాలేకపోయింది. ఇదే సమయం లో తెలుగు నాట ముఖ్యంగా నైజాం రాజరికం ఉన్న తెలంగాణ రాష్ట్రం లో భూస్వామ్య శృంఖలాలు తెంచడంలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర కీలకమైనది.ఆంధ్రమహాసభ కార్యక్రమం లో రహస్యంగా ప్రవేశించి గ్రంధాలయ ఉద్యమం,రాత్రి బడులు లాంటి చిన్న చిన్న సంస్కరణలు ద్వారా రైతాంగ ఉద్యమానికి పునాదులు వేసింది.చివరకు అది ‘తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం’ గా మారి ఐదు లక్షల గ్రామాలకు ఎర్రజెండా విస్తరించింది.”దున్నే వానికే భూమి”కీలక నినాదం ను ముందుకు తేవడం ద్వారా దేశంలో భూసంస్కరణలు అమలు జరపడానికి కమ్యూనిస్టుల పోరాటమే మూలం.దేశ స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే తొలిదశ ఎన్నికల్లో తలపడి నప్పటికీ కమ్యూనిస్టు పార్టీ అధికారం లోకి రాకపోయినప్పటికీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నిలిచి పోరాడింది.

బారత కార్మిక వర్గంలో తనదైన పునాదులు విస్తరించుకున్నది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నికల ద్వారా సంకీర్ణ రాజకీయ అధికారం పంచుకున్న కమ్యూనిస్టు పార్టీలు అటు తర్వాత పశ్చిమ బెంగాల్, త్రిపుర,కేరళ వంటి కీలక రాష్ట్రం లలో అదికారంలోకి రాగలిగినప్పటికీ కేంద్రం లో అధికారం చేపట్ట గలిగిన స్థితి రాలేదు.ఒకానొక దశలో జ్యొతిబస్ కు సంకీర్ణ రాజకీయాల్లో ఆ అవకాశం వచ్చినప్పటికీ సైద్ధాంతిక వెలుగు లో ఆనాటి సిపియం పార్టీ తిరస్కరణ తో ఆ అవకాశం చేజారింది. నూరేళ్ళ కమ్యూనిస్టు పార్టీ ప్రయాణం లో కష్టాలు,కన్నీళ్ళతో నే ఎర్రజెండా చరిత్రను నిలబెట్టుకుంది.కార్మికవర్గంలోనూ, రైతాంగం లోనూ నీతి, నిజాయితీ లతో ఉద్యమాలు నిర్మించి అనేకమైన త్యాగాలతో,రక్త తర్పణాలతో చారిత్రిక చాళ్ళను నిర్మించుకుంది ఎర్రజెండా!

అయితే, భారతదేశంలో కాల,మాన పరిస్థితులు,  శత్రృవులను అంచనా వేయడంలో,సరైన పోరాటం పందాలను ఎన్నిక చేసుకోవడంలో విఫలం అయిన కమ్యూనిస్టు పార్టీ, వివిధ రకాల సూత్రీకరణలతో అతివాద,మితవాద తప్పిదాలకు గురై చీలికలు,పేలికలుగా మారి తనకు తానే బలహీనం అయ్యింది.1955సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలో ప్రధాన ప్రతిపక్షం గా నిలిచిన కమ్యూనిస్టు పార్టీ సోషలిస్టు విధానాలు ప్రజల్లో ప్రచారంలో పెట్టినప్పటికీ అధికార కాంగ్రెస్‌  సోషలిస్టు ప్రచారాన్ని అధిగమించలేకపోయింది. సైద్దాంతిక గందరగోళం మధ్య సరైన పంథాలో పయనం సాగించలేకపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీ 1964లో రెండుగా చీలింది.

జనతా ప్రజాతంత్ర విప్లవం నిర్వచనం, పంథాల్లో విబేధాలు పొడజూపి సీపీఐ నుంచి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) సీపీఎం పార్టీ అవతరించింది. సీపీఐకి చండ్ర రాజేశ్వరరావు, నల్లమల్ల గిరి ప్రసాద్, సీపీఎంనకు పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య లాంటి దిగ్గజాలు నేతృత్వం వహించారు. సీపీఎం, సీపీఐ వామపక్ష ఐక్య రాజకీయాల ద్వారా పశ్చిమ బెంగాల్, త్రిపుర,కేరళ రాష్ట్రాల్లో మాత్రం అధికారంలోకి రాగలిగారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రానికే పరిమితమయ్యారు. కమ్యూనిస్టు పంథా విషయంలో తిరిగి సీపీఎం పార్టీలో తలెత్తిన విబేధాల మూలంగా 1967లో మరో చీలికకు దారితీసి ‘నక్సల్ బరీ ‘గ్రామంలో తలెత్తిన తిరుగుబాటుతో (భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు, లెనినిస్ట్ పార్టీ ,సీపీఐ(ఎంఎల్‌)గా ఉనికిలోకి వచ్చింది.

మితవాద ఆలోచనల్లో నుంచి బయటపడే క్రమంలో అతివాద తప్పటడుగులకు కమ్యూనిస్టు పార్టీలు గురయ్యాయి. బెంగాల్ నక్సల్బరీ రైతాంగ ఉద్యమం విభేదాలలోనే చారుమజుందార్,కానూసన్యాల్ , వినోద్ మిశ్రా లాంటి నేతలు నక్సలైట్ ఉద్యమానికి బాటలు వేశారు. ఆంధ్రప్రదేశ్ లో దేవులపల్లి వెంకటేశ్వరరావు,తరిమల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి,పైలా వాసుదేవరావు, కొండపల్లి సీతారామయ్య లాంటి నేతలు పనిచేశారు.  శ్రీకాకుళం ప్రాంతంలో రైతాంగ తిరుగుబాటుకు నక్సలైట్లు నాయకత్వం వహించారు. అప్పటి కాంగ్రెస్‌ పార్టీ జలగం వెంగళరావు ప్రభుత్వం నెత్తుటి ఏరులు పారించి నిర్దాక్షిణ్యంగా నక్సల్‌ ఉద్యమాన్ని అణచివేసింది. శ్రీకాకుళం స్ఫూర్తితో తెలుగు నాట గోదావరి లోయ, సిరిసిల్ల, జగిత్యాల,నల్లమల్ల అటవీప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం ఒక దశలో ఉద్ధృతంగా విస్తరించి నప్పటికీ సైద్ధాంతిక విబేధాల పేరుతో ఆయాపార్టీలు, గ్రూపులుగా చీలికలు పీలికలైపోవడంతో చిన్న చిన్న గ్రూపులుగా ప్రస్తుతం ఉనికిలో ఉన్నాయి.

సీపీఐఎంల్‌  కూడా  ఎన్నికల్లో పాల్గొని ఒకానొక దశలో ఇల్లెందు, సిరిసిల్ల అసెంబ్లీ స్థా నాలు చేజిక్కించుకున్నప్పటికీ, ఇప్పుడు ఉద్యమ ప్రాంతాల్లోనే ఆయా పార్టీలు ఎదురీదుతున్నాయి. ఇక ఎన్నికల బహిష్కరణ నినాదం ఇచ్చిన నక్సలైట్లకు కొంతకాలం కొండపల్లి సీతారామయ్య,కేజీ సత్యమూర్తి,రవూఫ్ లాంటి కీలక నేతలు నేతృత్వం వహించి కరీంనగర్, ఖమ్మం,వరంగల్, నల్లమల్ల ప్రాంతాలలో ఉద్యమాలు నిర్మించినప్పటికీ పాలకుల తీవ్ర అణచివేత చర్యలు, ఎన్‌కౌంటర్లతో మిగిలిన నేతలు దండకారణ్యం బాట పట్టారు.2004లోపీపుల్స్ వార్, ఎంసీసీ గ్రూపులు కలిసి మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించిన దండకారణ్యాన్ని బేస్‌ గా చేసుకొని ఈ పార్టీ పనిచేసింది. గిరిజనుల్లో సాయుధ పోరాట బీజాలు నాటి మధ్య భారతంలోని దండకారణ్యంలో జనతన సర్కార్ పేరుతో ప్రత్యామ్నాయ ప్రభుత్వం, చైనా తరహా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పియల్జిఏ) గెరిల్లా సైన్యం సైతం ఏర్పరిచింది.

కేంద్రంలో సంఘ్ పరివార్ రాజకీయ ఎజెండా కలిగిన బీజేపీ అధికారంలోకి రావడంతో దండకారణ్యం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపింది. అనేక ఆపరేషన్ల అనంతరం “ఆపరేషన్ కగార్ ‘పేరుతో సైన్యాన్ని రంగంలోకి దించి నక్సలైట్ ఉద్యమం ఊపిరాడకుండా చేయడంలో కేంద్రం సఫలమైంది. దండకారణ్యం. విప్లవోద్యమం సైతం ఇక చారిత్రక ఘట్టంగా మాత్రమే కమ్యూనిస్టు చరిత్రలో నిలిచిపోనుంది.

ఒకవైపు అతివాద పొరపాట్లు,మరోవైపు ఎన్నికల్లో పాల్గొంటున్న కమ్యూనిస్టు పార్టీలు ఇతర పార్టీలతో పెట్టుకున్న అవకాశవాద ఎన్నికల పొత్తుల వలన ఎర్రజెండా ఉనికి, మనుగడ కొన్ని ప్రాంతాల్లో ప్రశ్నార్థకం అయిన మాట వాస్తవం. 1925లోపుట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ సైద్ధాంతికంగా ఎన్ని చీలికలు,పేలికలు అయినా పేదలు పక్షాన నిలిచి పోరాడడంలో ఎర్రజెండా త్యాగం పునీతమైనదని చెప్పవచ్చు.ఈవందేళ్ళలో రక్త తర్పనలతోనే త్యాగాల పునాదులపై కమ్యూనిస్టు పార్టీలు తమను తాము నిర్మించుకున్నాయి.

దేశంలో కీలకమైన రైతాంగం, గిరిజన,కార్మిక పోరాటాలకు నేతృత్వం వహించి వర్గపోరాట పంథాను ముందుకు తీసుకుపోయింది మాత్రం ఎవరేమన్నా ఎర్రజెండానే ఈ జెండానే కష్టాల్లో ఉన్న ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచింది ఈ జెండానే.  ప్రస్తుతం రాజకీయాలు అవినీతి,అబద్దాల పునాదుల మీద రాజ్యమేలుతున్న ఒక అవకాశవాద రాజకీయ ఊబిలోకి పాలకులు కూరుకు పోతున్నదశ. ఈదశలోనైనా ప్రజలు కమ్యూనిస్టు త్యాగాలు,చరిత్రను గుర్తించి ముందుకు రాక పోతారా !అన్న ఆశతోనే వివిధ కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ,సీపీఎం, సీపీఐఎంఎల్ తదితర అనేక పార్టీలు, గ్రూపులు ఎర్రజెండా ఎజెండాతోనే ముందుకు పోతున్నాయి. ఇప్పటికీ శ్రామికులైన కార్మికులు, రైతాంగంలో కమ్యూనిస్టులకు గట్టి పట్టుంది. అయితే విభిన్న సైద్ధాంతిక విభేదాలతో కమ్యూనిస్టు భావజాలం చీలికలు,పీలికలై ఉంది.ఈదశలోనైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యతా పోరాటాలు విశాలప్రజా బాహుళ్యం కొరకు కొనసాగాలని ఆశిద్దాం. శతవసంతాలు నిండిన శ్రామిక జన జయకేతనం, పీడిత ప్రజల హక్కుల పతాకం అరుణ పతాకకు జై.. 

ఎన్.తిర్మల్
(సీనియర్ జర్నలిస్టు) 
సెల్:9441864514, 

Advertisment
తాజా కథనాలు