Andhra Pradesh: 'తాకట్టులో సచివాలయం' వార్తా కథనంపై ఏపీలో పొలిటికల్ వార్!

'తాకట్టులో సచివాలయం' అనే శీర్షికతో ఓ ప్రముఖ పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించగా.. దీనిపై టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు జగన్ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. మరోవైపు దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ సీఆర్‌డీఏ ఆ వార్త కథనంలో నిజం లేదని స్పష్టం చేసింది.

New Update
Andhra Pradesh: 'తాకట్టులో సచివాలయం' వార్తా కథనంపై ఏపీలో పొలిటికల్ వార్!

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల ఓ ప్రముఖ వార్తాపత్రికలో 'తాకట్టులో సచివాలయం' అనే శీర్షికతో కథనం వచ్చింది. దీనిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు వైసీపీ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం దీన్ని ఖండించింది. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

చంద్రబాబు ఏమన్నారంటే
ఆ కథనంపై స్పందించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో ఎక్స్‌ వేదికగా విమర్శలు చేశారు. "రాష్ట్రానికి ఎంత అవమానకరం...ఎంత బాధాకరం...ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్‌ని! ప్రజలారా...అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి!" అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్‌ చేశారు.

నారా లోకేష్ ఏమన్నారంటే
ఇక ఈ అంశంపై స్పందించిన నారా లోకేష్‌ సైతం జగన్‌ సర్కార్‌పై ఎక్స్‌లో విరుచుకుపడ్డారు. " గత అయిదేళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోంది. రాష్ట్రాన్ని 12.5 లక్షలకోట్ల అప్పుల్లో ముంచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్‌ను తాకట్టుపెట్టాడన్న వార్త చూసి ఉదయాన్నే షాక్ కు గురయ్యాను. ఏపీని అప్పులకుప్పగా మార్చి మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని మేమంటే ఒంటికాలిపై లేచిన వైసీపీ మేధావులు దీనికేం సమాధానం చెబుతారు? ఏపీ సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్ పనితనాన్ని చూశాక శ్రీలంకతో పోల్చడం ఏ మాత్రం సరికాదని అన్పిస్తోంది. ఎంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా శ్రీలంక తమ పాలనాకేంద్రాన్ని తాకట్టుపెట్టలేదు. ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు దిగిపోతూ ఆంధ్రప్రదేశ్ పరువును అంతర్జాతీయస్థాయిలో మంటగలుపుతున్న ఈ ముఖ్యమంత్రిని ఏమనాలో, ఎవరితో పోల్చాలో మాటలు రావడం లేదు... మీరైనా చెప్పండి ప్లీజ్!!" అంటూ నారా లోకేష్ ట్వీట్‌ చేశారు.

వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పింది?
సచివాలయం తాకట్టు అన్న వార్తలపై వైసీపీ ప్రభుత్వం ఖండించింది. పలు మీడియా సంస్థలు రాసుకొచ్చిన తాకట్టులో సచివాలయం వార్త పూర్తిగా అవాస్తవం అని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (AP CRDA) తెలిపింది. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి ఇందుకు సంబంధించిన ప్రతిపాదన తమ వద్దకు రాలేదని చెప్పింది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో 5 భవనాలను.. HDFC బ్యాంకుకు తాకట్టు పెట్టినట్లు వచ్చిన వార్తలు అబద్ధమని పేర్కొంది. ICICI, HDFC బ్యాంకుల నుంచి AP CRDA రుణాలు తీసుకోలేదని.. కనార్టియం బ్యాంకులు, హడ్కోల నుంచి AP CRDA పొందిన రుణాన్న కొన్ని కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వాడామని CRDA అకౌంట్స్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ఫిర్యాదు చేస్తాం

రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్ జీవోఎంఎస్‌ 32 ప్రకారం 2018లో కన్సార్టియం బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకులు రూ. 2060 కోట్లు మంజూరు చేశాయని తెలిపారు. అయితే అందులో కేవలం రూ. 1955 కోట్లు మాత్రమే CRDAకు రిలీజ్ చేశారని పేర్కొన్నారు. 2017లో మౌలిక వసతుల కల్పన కోసం హడ్కో.. రూ.1275 కోట్ల రుణాన్ని మంజూరు చేసిందని.. అందులో నుంచి రూ.1151 కోట్లు మాత్రమే CRDAకు వచ్చాయని చెప్పారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ కూడా జారీ చేసిందని తెలిపారు. సచివాలాయాన్ని తాకట్టు పెట్టారన్న వార్తలో వాస్తవం లేదని.. ఇలాంటి తప్పుడు కథనాన్ని ప్రచూరించినందుకు ఆ వార్తా సంస్థపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

Advertisment
తాజా కథనాలు