తాను కేటీఆర్‌ను తిడితే మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎందుకు కోపం వస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కేటీఆర్ నోట వెలువడే మాటలే పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు చెబితే కరీంనగర్‌ను వదిలి హుస్నాబాద్ పారిపోయారో అందరికీ తెలుసన్నారు. తాను నిర్మాణాత్మకంగా సలహా ఇస్తుంటే వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. తన ఓపికను పరీక్షించొద్దని హెచ్చరించారు.
ఆదివారం మధ్యాహ్నం కొత్తకొండ కోరమీసాల వీరభద్రస్వామి ఆలయానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలోకి అడుగుపెట్టిన బండి సంజయ్ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. 800 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన కొత్తకొండ కోరమీసాల వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని బండి సంజయ్ అన్నారు. ఈ ఆలయ అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుండి రూ.5 లక్షలిస్తున్నానని.. సరిపోకపోతే మరో రూ.5 లక్షలిస్తానని తెలిపారు.
కేటీఆర్‌ను తిడితే నీకెందుకు కోపం
మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు స్పందించిన బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పొన్నం.. నన్ను గెలకొద్దు. కొత్తగా మంత్రివి అయ్యావు కాబట్టి నాపై చిల్లర మాటలు మాట్లాడినా సంస్కారంగా వ్యవహరించాను. కేటీఆర్‌ను తిడితే పొన్నంకు ఎందుకు కోపం వస్తుంది ?. కరీంనగర్‌ను వదిలి హుస్నాబాద్‌కు ఎందుకు పోయిండు ?. ఎవరు చెబితే పోయిండో తెల్వదా ?. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడితే ఆయన అదే మాట్లాడుతున్నాడు. కేటీఆర్ మాటల వల్ల బీఆర్ఎస్ నాశనమైతే.. పొన్నం వల్ల కాంగ్రెస్ నాశనమయ్యే పరిస్థితి ఉంది.
సలహాలిస్తే వ్యక్తిగత ఆరోపణలా..?
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతోందని.. జాగ్రత్తగా ఉండాలని నేను సలహా ఇస్తే.. అడ్డదిడ్డంగా మాట్లాడితే ఎట్లా ?. నేను నిర్మాణాత్మకంగా మాట్లాడితే వ్యక్తిగత ఆరోపణలు చేస్తారా ?. బండి సంజయ్ కొడుకు కొత్త బట్టలు వేసుకుంటున్నాడు. కొత్త బండి ఎట్ల కొనుక్కున్నడని దిగజారి మాట్లాడుతున్నారు. కటౌట్లు ఎట్లా కడుతున్నాడని అంటున్నారు. ఇదేం పద్దతి ?. బండి సంజయ్ పిల్లలు బట్టలేసుకోవద్దు, బండి కొనద్దా ? నేను ఎంపీని కాదా.. కటౌట్లు కట్టుకోవద్దా.. ఇంత దుర్మార్గమా ?.
సమస్యలపై కొట్లాడి జైలుకెళ్లా
వాళ్ల లెక్క నేను వ్యక్తిగత విమర్శలు చేయను. నేను సిద్ధాంతం కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం కొట్లాడే వ్యక్తిని. ప్రజా సమస్యలపై కొట్లాడి జైలుకు పోయిన చరిత్ర నాది. అధికారంలో ఉన్నా పోయినా సమాజం గౌరవించేలా ఉండాలని.. అహంకారంతో మాట్లాడితే సమాజం అసహ్యించుకుంటుందనే విషయాన్ని గుర్తుంచుకుని రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజల కోసం పనిచేద్దామని నేను చెబుతుంటే అడ్డగోలుగా మాట్లాడతారా ' అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు.