జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని దంపతులు పోలీసులను ఆశ్రయించారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల పరిధిలోని బొత్తల వర్రే గ్రామానికి చెందిన తిరుపతి.. గ్రామంలోని సర్వే నెంబర్ 49.88లో తనకు 20 ఎకరాల భూమి ఉందని తెలిపారు. తన భూమిపై స్థానిక ఎమ్మెల్యే కన్నుపడిందని, ఆయన తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని బాధితుడు తిరుపతి వెల్లడించారు. భూమి కోసం తనను, తన తల్లిదండ్రులను వేధిస్తున్నట్లు, భూమి ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు ఆయన వాపోయారు.
హైదరాబాద్‌లో తాను పని చేస్తున్న కళాశాలకు ముత్తిరెడ్డి అనుచరులు వచ్చారని, భూమి ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులకు దిగారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భూమి ఇవ్వకపోతే తమను చంపి తమ ఆస్తులను లాక్కుంటానని హెచ్చరించారని వాపోయాడు. అంతే కాకుండా ఎమ్మెల్యే కాచీగూడలోని తన ఇంటికి 30 అనుచరులను పంపించి తనపై, తన భార్యపై దాడి చేయించాడని బాధితుడు తెలిపాడు. దీంతో తిరుపతి కాచీగూడా పోలీస్ స్టేషన్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశాడు. తనకు, కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి ప్రమాదం జరిగినా దానికి ముత్తిరెడ్డే బాధ్యత వహించాలని తేల్చి చెప్పాడు.
మరోవైపు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నియోజకవర్గమైన జనగామా టికెట్‌ను బీఆర్‌ఎస్ పార్టీ పెండింగ్‌లో పెట్టింది. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ముత్తిరెడ్డి మీడియా ముందు అనేక సార్లు కన్నీటి పర్యంతులయ్యారు. తానుకు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చాడు. తాజాగా ముత్తిరెడ్డి రౌడీయిజం వెలుగులోకి రావడంతో ఆయనకు బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ దూరమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ముత్తిరెడ్డి బీఆర్‌ఎస్‌లో రాజకీయ జీవితం ముగిసినట్లే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.