Minister KTR: తాము ప్రతీకార రాజకీయాలు చేసుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్(Revanth Reddy) ఇప్పటికే జైల్లోనే ఉండేవాడని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్. ఉన్న తెలంగాణను ఆనాడు ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ(Telangana) ఆకాంక్షను దశాబ్దాల పాటు కాంగ్రెస్ అణచివేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా మోసం చేశారని.. దాంతో వందల మంది బలిదానాలు చేసుకున్నారని.. సోనియా గాంధీని బలిదేవత అని అన్నది నాడు రేవంత్ రెడ్డేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏండ్లు బాధపడిందని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.
దేశానికి తెలంగాణ దిక్సూచి..
భారత దేశానికి తెలంగాణ దిక్సూచి అయిందని .. అది సీఎం కేసీఆర్ సాధించిన ఘనత అని పేర్కొన్నారు. నేడు తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నదని వ్యాఖ్యానించారు. తాము రాష్ట్రాన్ని అప్పులపాటు చేశారన్న ఆరోపణలు సరికాదన్నారు. అప్పులు చేసిన నిధులు సంపద సృష్టికి ఉపయోగిస్తున్నామని చెప్పారు. రుణాలను మొత్తం సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామన్నారు. ఐటీ రంగంలో బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని చెప్పారు. ఐటీ ఎగుమతులు 400 శాతం పెరిగాయని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.లక్షా 14 వేలుగా ఉందని, ప్రస్తుతం అది రూ.3లక్షల 17 వేలకు పెరిగిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో తెలంగాణలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు వస్తే.. తాము తొమ్మిదిన్నరేండ్లలో 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మరో 90 వేల ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు మైగ్రేషన్‌కు కేరాఫ్‌గా ఉన్న పాలమూరు ఇప్పుడు ఇరిగేషన్‌కు కేరాఫ్‌గా మారిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపుమాపిందని చెప్పారు. ముస్లిం మైనార్టీలకు దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత బడ్జెట్ తెలంగాణలోనే ఉందని వెల్లడించారు.
Also Read:
కాంగ్రెస్‌లో వారికి జాక్‌పాట్.. పార్టీలో చేరడమే ఆలస్యం టికెట్ల కేటాయింపు..
సీఎం జగన్ పథకాలపై జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం.. ఫుల్ ఖుషీలో వైసీపీ ఫ్యాన్స్..