మరో ఐదురోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార, విపక్ష నేతలు ప్రచారాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా బిక్కనూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రూ.200 మాత్రమే పింఛను వచ్చేదని.. కానీ ఇప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.2 వేలు ఇస్తోందని వ్యాఖ్యానించారు. మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే.. పింఛను రూ.3 వేలు చేస్తామని.. వచ్చే ఐదు సంవత్సరాల్లో దాన్ని రూ.5 వేలకు పెంచుతామని పేర్కొన్నారు.
Also read: సంచలనంగా మారిన బర్రెలక్క రామక్క పాట.. హోరెత్తుతోన్న ప్రచారం!
అలాగే కాంగ్రెస్ పాలనలో బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు పింఛన్లు వచ్చేవా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 46 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారని.. ఏ రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు వారి ప్రభుత్వాలు పింఛన్లు ఇవ్వడం లేదని తెలిపారు. దేశంలో బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. 'సౌభాగ్యలక్ష్మీ' పథకం కింద కేసీఆర్ కొత్త పథకాన్ని తీసుకొస్తారని తెలిపారు. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.3 వేలు అందజేస్తామని కేటీఆర్ వెల్లడించారు.
Also read: రూ.15 లక్షలు వచ్చాయా?.. మోదీపై ఖర్గే చురకలు!