Best Example For Kaleshwaram : తెలంగాణ శాసన సభ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. 42 పేజీల శ్వేత పత్రాన్ని సభ్యులకు అందించిన అనంతరం ఆయన ప్రసంగించారు.
ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని, కానీ గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదన్నారు. రోజూవారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న ఆయన.. ఇలాంటి పరిస్థితి రావడాన్ని తాను దురదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలి. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తాం. సవాళ్లు అధిగమించే దిశలో శ్వేతపత్రం మొదటి అడుగు అని భట్టి అన్నారు.
ఇక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధిని పక్కనపెట్టి సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారన్నారు. మేడీ గడ్డ ప్లాన్ దారుణంగా ఫెయిల్ అయిందని, ప్లానింగ్ ప్రాసెస్ లేకుండా మెటిరీయల్ ఇన్వెస్ట్ మెంట్ లేకుండా ఎలా ముందుకెళ్లారని బీఆర్ఎస్(BRS) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాస్తవాలకు దూరంగా వారి బడ్జెట్ ఉందని ముందుగానే తాము హెచ్చరించామని, వనరులు ఎన్ని ఉన్నాయో తెలియకుండానే ప్రామిస్ చేశాం కాబట్టి హామీలు నెరవేరుస్తామంటే ఎలా అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం మొత్తం ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించి ప్రజలను మభ్య పెట్టారని చెప్పారు. వాళ్లకు నిర్మాణాత్మకమైన ఆలోచన లేదు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకోగానే అధికారం చేపట్టిన బీఆర్ఎస్ 20శాతం గ్యాప్ లేకుండా ఎనాడు బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు. మిగతా రాష్ట్రాలకంటే తెలంగాణలో వనరులు ఎక్కువే. ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి : 13 ఏళ్ల బాలికతో పెళ్లి.. పది రోజులుగా అత్యాచారం చేసి
కాళేశ్వరం(Kaleshwaram), మేడిగడ్డ, పాలమూరు- రంగారెడ్డి తదితర ప్రాజెక్టులతో అందరి భూములకు నీళ్లు వస్తాయని నమ్మితే నట్టేట ముంచేశారని, ప్రజల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీశారని చెప్పుకొచ్చారు. పాలమూరు -రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామా కట్టడాలు తీసుకొచ్చినా.. ఇంకా కొన్నింటికి పంపులే పెట్టలేదన్నారు. కాళేశ్వరం చుట్టు దేశ ప్రజలను తీసుకొచ్చి చూపించారు. మమ్ముల్ని భద్రచలంలో అరెస్ట్ చేశారు. అప్పుడే అనుమానించాం ఏదో ఉందని. మేడి గడ్డ కుంగిపోయింది. నేషనల్ డిపార్ట్ మెంట్ ఇది పనిచేయదు.. పూర్తిగా తొలగించాలని స్పష్టంగా చెప్పింది. ఈ పదేళ్ల బడ్జెట్ మొత్తం మీరు సృష్టించిన ఆస్తుల్లో కాళేశ్వరం ఒక్కటే. బీఆర్ఎస్ పాలనతో అవినీతికి ఈ ప్రాజెక్టులే బెస్ట్ ఎంగ్జాపుల్ అన్నారు. ఎన్ని లక్షాల ఎకరాలు పారాయో ఇంతవరకూ లెక్కలు చెప్పలేదు. కరెంట్ బిల్లులు మాత్రం అడ్డగోలుగా చూపించారు. బడ్జెట్ పేరుతో అప్పులు తీసుకొచ్చి ఆస్తులు సంపాదించుకున్నారు. వాటిని రాష్ట్ర అప్పులుగా చూపిస్తే ఎలా అని భట్టి ప్రశ్నించారు.
శ్వేతపత్రంలోని ప్రధానాంశాలు :
రాష్ట్ర మొత్తం అప్పులు ₹6,71,757 కోట్లు.
2014-15 నాటికి రాష్ట్ర రుణం ₹72,658 కోట్లు.
2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు.
2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం ₹3,89,673 కోట్లు.
2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం.
2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం.
బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం.
57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి ₹4.98 లక్షల కోట్ల వ్యయం.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం.
రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం
రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం
రోజూ వేస్ అండ్ మీన్స్‌పై ఆధారపడాల్సిన దుస్థితి
2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. 2023లో అప్పుల్లో కూరుకుపోయింది.
బడ్జెటేతర రుణాలు పేరుకుపోయి అప్పుల ఊబిలో తెలంగాణ