దేశంలో ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి నడుస్తుంది. ఈ క్రమంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెలలో మధ్య ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ఎన్నికల డ్యూటీ పడుతుంటుంది. అది ఎక్కడైనా జరిగేదే. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఓ టీచర్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఎన్నికల శిక్షణా తరగతులకు హాజరు కాకపోవడంతో అతనికి షోకాజ్ నోటీసులు అందించారు. కానీ అటు వైపు నుంచి అధికారులకు షాక్ దిమ్మతిరిగే సమాధానం వచ్చింది. ఆ సమాధానం చూసి ఉన్నతాధికారులకు చిర్రెత్తుకొచ్చి సదరు టీచర్ ని సస్పెండ్ చేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే...అఖిలేష్ కుమార్ మిశ్రా అనే ఉపాధ్యాయుడికి 35 సంవత్సరాలు.
సాత్నాలో సంస్కృత ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. ఆయనతో మిగతా ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల కోసం ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 16, 17 తేదీల్లో శిక్షణా తరగతులకు హాజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఈ తరగతులకు అఖిలేష్ రాలేదు. దీని గురించి ఉన్నతాధికారులు అతనికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
దానికి సమాధానంగా అఖిలేష్ '' నాకు ఇప్పటికే 35 ఏళ్లు వచ్చేశాయి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఒంటరిగా ఉండలేకపోతున్నా. జీవితాంతం భార్య లేకుండా ఉండిపోవాల్సి వస్తుందేమో అని భయమేస్తుంది. ముందు నాకు పెళ్లి చేయండి. ఆ తర్వాత ఎన్నికల విధులకు వస్తాను’’ అని అక్టోబర్ 31న సమాధానం చెబుతూ..రిప్లై ఇచ్చాడు.
పెళ్లి కాలేదు అని చెప్పడంతో పాటు తనకు రూ. 3 లక్షల కట్నం కూడా కావాలి, దానితో పాటు ఓ ప్లాట్ కూడా ఇవ్వాలని కోరడం మరో విశేషం. దీంతో కలెక్టర్ ఆయనను నవంబర్ 2 న సస్పెండ్ చేశారు. అయితే ఆయన సెల్ ఫోన్ ఉపయోగించకపోవడం వల్ల అతను సస్పెండ్ అయిన విషయం తెలియలేదు.
తోటి ఉద్యోగి చెప్పడంతో తాను సస్పెండ్ అయినట్లు అఖిలేష్ కుమార్ విషయాన్ని తెలుసుకున్నారు. పెళ్లికాకపోవడంతో ఒత్తిడిలో ఉన్నాడని, అతని మానసిక పరిస్థితి సరిగా లేదని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. కలెక్టర్ స్థాయి అధికారి ఎవరైనా వివరణ కోరితే ఇలాంటి సమాధానం చెబుతారా..? గతేడాదిగా అతను మొబైల్ ఫోన్ వాడటం లేదని సదరు ఉద్యోగి చెప్పారు.
Also read: ఆ గ్రామ ప్రజలు 200 ఏళ్లుగా దీపావళిని జరుపుకోవడం లేదు..ఎందుకంటే!