Telangana BJP MP Candidates List: లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుస ఎన్నికల పర్యటనలకు సిద్దమవుతున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 16 సీట్లే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ (Congress), బీఆర్‌ఎస్ (BRS) పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించకముందే ముమ్మరంగా ప్రచారం చేపట్టాలని బీజేపీ (BJP) హైకమాండ్ భావిస్తోంది. ఆ మేరకు ఆ పార్టీలు అభ్యర్థులను ప్రకటనకు ముందే.. ఈ నెలాఖరులోగా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారం చేసేందుకు బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ALSO READ: మెగా డీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
తెలంగాణకు మోడీ...
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించి సభలు నిర్వహించేందుకు సన్నద్దం మవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఆదిలాబాద్, సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలను ప్రధాని మోడీ సందర్శించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 29న ప్రకటన?..
ఆయా సభల కంటే ముందే రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మోడీచేత చేపట్టాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే.. ఈ నెల 29న ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ 29న ఇద్దరు ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉంది. వీరి చేరిక ప్రకారం బలాబలాల ఆధారంగా బలమైన అభ్యర్థులుగా నిలిచే వారి పేర్లను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
దొరకని అభ్యర్థులు..
ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని అనుకుంటున్నా బీజేపీ అధిష్టానం.. అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. అయితే.. జహీరాబాద్, పెద్దపల్లి, నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆదిలాబాద్, సంగారెడ్డి లలో జరిగే సభల్లో ప్రధాని మోడీ పాల్గొంటారని ఆ తర్వాత అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగా 29న తొలి జాబితాను ప్రకటిస్తారని తెలుస్తోంది. విజయ సంకల్ప యాత్రల (Vijaya Sankalpa Yatra) ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో మార్చి 2న అమిత్ షా సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని తొలుత భావించారు. అయితే 2వ తేదీ కాకుండా 4వ తేదీన రాష్ట్రానికి వచ్చేందుకు అమిత్ షా సమయం కేటాయించడంతో అదే రోజు సభను నిర్వహించాలని నిర్ణయించారు.