Mia Schem: హమాస్ చెర నుంచి విడుదల అయిన బందీలు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో కథలా ఉంటోంది. విడుదల అయిన వారిలో మియా స్కెమ్ (Mia Schem)అనే అమ్మాయి తాజాగా తను అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. హమాస్ (Hamas) చెరలో 54రోజులు నేను అడవిలో జంతువులా ఉన్నాను అని చెబుతోంది మియా. గాజాలో నివసించే ప్రజలు, తాను అక్కడ అనుభవించిన నరకం గురించి నిజాలు చెప్పడం చాలా ముఖ్యమని భావిస్తున్నాను అంటోంది. తనను ఒక కసాయి బంధించి తీసుకువెళ్ళాడని తెలిపింది. గాజాలో (Gaza) హమాస్ గ్రూప్‌తో సంబంధం ఉన్న ఒక కుటుంబంతో తనను ఉంచారని చెప్పుకొచ్చింది.తనను తాను సఫారీలో జంతువుగా భావించానని ఆమె వ్యాఖ్యానించింది. వారిని కొంతమంది కుటుంబ సభ్యుల ఇంట్లో ఎందుకు ఉన్నాను? ఇక్కడ పిల్లలు ఎందుకు ఉన్నారు? భార్య ఎందుకు ఉంది? అనే ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను’ అని చెప్పింది. కానీ వారు దేనికీ సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపింది.
మియా గురించి హమాస్ కూడా బందీగా ఉన్నప్పుడు వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ‘నన్ను బాగానే చూసుకుంటున్నారు.. మందులు ఇస్తున్నారు.. అంతా బాగానే ఉంది. నన్ను వీలైనంత త్వరగా నా తల్లిదండ్రులు, నా తోబుట్టువుల వద్దకు తీసుకురావాలని మాత్రమే నేను కోరుతున్నాను.. దయచేసి వీలైనంత త్వరగా నన్ను ఇక్కడి నుంచి పంపించండి’ అని వేడుకుంది. ఆ తర్వాత ఇజ్రాయేల్, హమాస్ (Israel - Hamas) మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ- బందీల మార్పిడి ఒప్పందంలో భాగంగా మియా స్కెమ్‌కు విముక్తి లభించింది.
హమాస్ చెరలో తాను అనుభవించిన కష్టాలు ఎప్పటికీ మరిచిపోలేనని అంటోంది మియా. దాడి తేదీని టాటూగా వేసుకుని మళ్ళీ డాన్స్ చేస్తామని చెబుతోంది. నొప్పి, భయం, తాను కష్టపడ్డ దృశ్యాలు, తిరిగిరాని స్నేహితులు ఇవన్నీ జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయని చెప్పింది. కానీ ఎప్పటికైనా ఇజ్రాయెల్, తాము గెలుస్తామని...అప్పుడు ఆనందంతో నృత్యం చేస్తామని అంటోంది.
అక్టోబరు 7న ఇజ్రాయేల్‌పై హమాస్ దాడిలో దాదాపు 240 మంది బందీలను పట్టుకోగా.. దాదాపు 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తూనే ఉంది. హమాస్ అంతమే లక్ష్యంగా యుద్ధం చేస్తోంది. వాళ్ళను పూర్తిగా మట్టుబెట్టేవరకు తాము వదిలేదని చెబుతోంది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 20వేల మంది చనిపోయారు. వేలమంది నిరాశ్రయులయ్యారు.