Last Ekadashi 2025: సంవత్సరంలోని చివరి ఏకాదశి ఎలా పాటించాలి.. ఏ పూజలు చేయాలి తెలుసుకోండి!!

పుష్య పుత్రదా ఏకాదశి ప్రతి సంవత్సరం డిసెంబర్ లేదా జనవరి నెలల్లో వస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో వస్తుంది. ఉదయ తిథి ప్రకారం.. డిసెంబర్ 30, 2025న ఈ వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెబుతున్నారు.

New Update
Putrada Ekadashi 2025

Putrada Ekadashi 2025

ఏకాదశి అనేది హిందూ ధర్మంలో శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన రోజు. ఇది ప్రతి చంద్ర మాసంలో శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో పదకొండవ తిథి నాడు వస్తుంది. అంటే సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశి వ్రతాలు ఉంటాయి. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా పాపాలు తొలగిపోయి, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేక పేరు, ప్రాముఖ్యత ఉంటుంది. తులసి దళాలతో విష్ణు పూజ చేయడం ఈ వ్రతంలో ముఖ్యమైన అంశం. ఈ ఉపవాసాలలో ఏకాదశి వ్రతం అత్యంత ముఖ్యమైనదిగా, అపారమైన పుణ్యాన్ని ఇచ్చేదిగా చెబుతున్నారు. ప్రతి నెలలో శుక్ల పక్షం,  కృష్ణ పక్షంలో కలిపి మొత్తం రెండు ఏకాదశులు వస్తాయి. ఈ విధంగా సంవత్సరానికి 24 ఏకాదశి వ్రతాలు ఉంటాయి. 2025 సంవత్సరంలో వచ్చే చివరి ఏకాదశిగా పుష్య పుత్రదా ఏకాదశిని చెబుతున్నారు. ఈ ఏకాదశి పుష్య మాసంలోని శుక్ల పక్షంలో వస్తుంది. సంతానం కోసం, పిల్లల సంతోషం, క్షేమం కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా శుభప్రదం. 2025 చివరి ఏకాదశి, పుష్య పుత్రదా ఏకాదశి.. శుభ సమయం, పూజా విధానం గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

తేదీలు-ముహూర్తాలు:

పుష్య పుత్రదా ఏకాదశి ప్రతి సంవత్సరం డిసెంబర్ లేదా జనవరి నెలల్లో వస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో వస్తుంది. ఉదయ తిథి (సూర్యోదయ సమయం) ప్రకారం.. డిసెంబర్ 30, 2025న ఈ వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది. వ్రతం యొక్క ఫలం సంపూర్ణంగా పొందడానికి మరుసటి రోజు ద్వాదశి తిథిలో ముహూర్తం చూసి ఉపవాసాన్ని విరమించాలి. సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి ప్రత్యేకమైన పేరు, విశిష్టత ఉన్నట్లే.. పుష్య పుత్రదా ఏకాదశి కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పేరు సూచించినట్లే.. సంతానం లేని దంపతులు మంచి సంతానం పొందడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇప్పటికే పిల్లలు ఉన్నవారు.. వారి సుఖ సంతోషాలు, క్షేమం కోసం ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ రోజున శ్రీ మహా విష్ణువును, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన వ్రతం పాటించే భక్తులకు సంతాన భాగ్యం, కుటుంబ సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయి. నిష్టగా వ్రతం ఆచరించిన వారికి మోక్షం కూడా సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పుత్రదా ఏకాదశి వ్రత కథ: 

పూర్వకాలంలో భద్రావతి నగరంలో సుకేతుమాన అనే రాజు.. ఆయన భార్య శైవ్య నివసించేవారు. వారికి రాజ్యం, సంపద ఉన్నప్పటికీ సంతానం లేకపోవడంతో నిత్యం దుఃఖంతో ఉండేవారు. తమ తర్వాత పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు కొడుకు లేకపోవడం రాజును తీవ్రంగా బాధించింది. ఈ మనస్తాపంతో ఒక రోజు రాజ్యాన్ని విడిచి అడవికి వెళ్ళిన రాజు.. దప్పికతో ఒక కొలను వద్దకు చేరుకుంటాడు. అక్కడ మునులు కూర్చుని ఉండటం చూసి వారికి నమస్కరించి తన దుఃఖాన్ని వివరిస్తాడు. అప్పుడు ఆ ఋషులు, ఆ రోజు పుత్రదా ఏకాదశి అని, సంతానం కోరుకునే వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారికి తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని సలహా ఇస్తారు. రాజు సంతోషించి, మునుల సూచన మేరకు రాజధానికి తిరిగి వచ్చి భార్యతో కలిసి నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తాడు. వ్రత మహిమ వలన కొంత కాలానికి రాణి గర్భం దాల్చి.. ఒక శూరుడైన పుత్రుడికి జన్మనిస్తుంది. ఆ రోజు నుంచి సంతానం కోరుకునే వారు.. లేదా పిల్లల క్షేమం కోరుకునే వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో వారికి సదా శుభం కలుగుతుందని ప్రచారంలోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: మౌని అమావాస్య ప్రత్యేకత.. అమృత స్నానం, మౌనవ్రతంతో పుణ్య ఫలం గురించి తెలుసుకోండి!!

పుష్య పుత్రదా ఏకాదశి పూజా విధానం:

2025 డిసెంబర్ 30 పుష్య పుత్రదా ఏకాదశి రోజున అనుసరించాల్సిన పూజా పద్ధతి ఉంది. వాటిల్లో ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి గంగా జలం చల్లి పవిత్రం చేయాలి. ఒక పీఠంపై వస్త్రం పరచి, శ్రీ మహా విష్ణువు విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించాలి. పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. తర్వాత మొదటగా విష్ణుమూర్తిని గంగాజలం లేదా పంచామృతంతో (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర మిశ్రమం) అభిషేకించాలి. పసుపు రంగు వస్త్రాలు ధరింపజేయాలి. తర్వాత చందనం, పుష్పమాలలు, తులసి దళాలు, పసుపు పువ్వులు సమర్పించాలి. పూజా స్థలంలో నీటితో నిండిన కలశాన్ని ఉంచి.. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అనంతరం పండ్లు, మిఠాయిలు, నైవేద్యం నివేదించాలి. లక్ష్మీదేవిని కూడా పూజించాలి. పుత్రదా ఏకాదశి వ్రత కథను చదవాలి లేదా వినాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి విష్ణు మంత్రాలను జపించాలి. చివరగా హారతి ఇచ్చి.. ఉపవాసం ఉండాలి. ఈ రోజున రాత్రి అంతా మేల్కొని భగవన్నామ స్మరణ, భజనలు చేస్తే మంచిది. మరుసటి రోజు, ద్వాదశి నాడు, శుభ ముహూర్తంలో బ్రాహ్మణుడికి లేదా పేదవారికి ఆహారం, దానం ఇచ్చి, ఆ తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి. ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరించడం ద్వారా భక్తులు శ్రీ మహా విష్ణువు అనుగ్రహానికి పాత్రులై, వారి కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పన్నెండు దశలు.. ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడే రక్షణ కవచాలు

Advertisment
తాజా కథనాలు