Mauni Amavasya 2026: మౌని అమావాస్య ప్రత్యేకత.. అమృత స్నానం, మౌనవ్రతంతో పుణ్య ఫలం గురించి తెలుసుకోండి!!

మౌని అమావాస్య జనవరి 18, 2026 ఆదివారం నాడు వస్తుంది. ఇది తెల్లవారుజామున 12:03 గంటలకు ప్రారంభమై 19 తెల్లవారుజామున 1:21 వరకు ఉంటుంది. ఈ రోజున గంగా, యమునా వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం అత్యంత శ్రేష్ఠంగా భావిస్తారు.

New Update
mouni  Amavasya 2025

mouni Amavasya 2026

అమావాస్య అనేది హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో చంద్రుడు కనిపించని రోజు. ఇది కృష్ణ పక్షంలో చివరి రోజు. ఈ రోజున చంద్రుడు సూర్యుడితో కలిసి ఒకే డిగ్రీలో ఉండటం వల్ల భూమి నుంచి చంద్రుడు కనబడడు, అందుకే దీనిని అంధకార దినం అని కూడా అంటారు. ఆధ్యాత్మికంగా, అమావాస్యకు అధిక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. అలాగే దానధర్మాలు చేయడం ద్వారా విశేష పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. అయితే కొత్త సంవత్సరం 2026లో వచ్చే తొలి అమావాస్య మౌని అమావాస్య లేదా మాఘి అమావాస్య. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన, శుభప్రదమైన రోజులలో ఇది ఒకటిగా చెబుతున్నారు. ఈ రోజున చేసే స్నానం, దానం, మౌన వ్రతానికి విశేష ప్రాధాన్యత ఉంది. మౌని అమావాస్యను పుణ్య స్నానాల పండుగగా కూడా జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేకతకు అనేక పురాణ, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

పవిత్ర నదీ స్నానం :

మౌని అమావాస్యజనవరి 18, 2026 ఆదివారం నాడు వస్తుంది. ఇది తెల్లవారుజామున 12:03 గంటలకు ప్రారంభమై జనవరి 19 తెల్లవారుజామున 1:21 వరకు ఉంటుంది. క్యాలెండర్ ప్రకారం.. మౌని అమావాస్య జనవరి 18, 2026న మాత్రమే చెల్లుతుంది. ఈ రోజున గంగా, యమునా వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం అత్యంత శ్రేష్ఠంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. మాఘ మాసపు అమావాస్య రోజున గంగా నది జలం అమృతంగా మారుతుందని నమ్ముతారు. అందుకే ఈ రోజు చేసే గంగా స్నానం అమృతం తాగినంత పుణ్యాన్ని ఇస్తుందని, తెలిసి లేదా తెలియక చేసిన పాపాలను తొలగిస్తుందని ప్రగాఢ విశ్వాసం ఉంది. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం (గంగా, యమునా, సరస్వతి నదుల కలయిక)లో ఈ రోజు స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. పుణ్య నదుల్లో స్నానం చేయలేనివారు.. ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేయవచ్చు.

మౌన వ్రతం:

మౌని అనే పేరు మౌనం (నిశ్శబ్దం) ను సూచిస్తుంది. ఈ పవిత్ర రోజున, ఋషులు, సన్యాసులు, అనేక మంది భక్తులు మౌన వ్రతం పాటిస్తారు. మౌన వ్రతం పాటించడం వల్ల మానసిక శాంతి లభిస్తుందని, మనస్సుపై నియంత్రణ పెరుగుతుందని, కోపం, ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయని నమ్ముతారు. మౌనంగా ఉండటం వల్ల అంతర్గత శక్తి (Inner energy) జాగృతం అవుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. రోజంతా మౌనం పాటించలేనివారు.. కనీసం స్నానం, పూజ కార్యక్రమాలు పూర్తయ్యే వరకు మౌనంగా ఉండవచ్చు. పురాణాల ప్రకారం.. మనువు ఈ రోజునే మౌన ప్రతిజ్ఞను పాటించినట్లు చెబుతారు.. అందుకే దీనికి మౌని అమావాస్య అనే పేరు వచ్చిందని కొందరి విశ్వాసం.

ఇది కూడా చదవండి: స్మార్ట్ ఫోన్ లవర్లకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. ఎందుకో తెలుసా..?

పితృదేవతల ఆరాధన:

ప్రతి అమావాస్య రోజు మాదిరిగానే మౌని అమావాస్య కూడా పితృదేవతలను స్మరించుకోవడానికి చాలా ముఖ్యమైనది. ఈ రోజున పూర్వీకుల ఆత్మ శాంతి కోసం శ్రాద్ధ, తర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నువ్వులు, నీటిని కలిపి పితృదేవతలకు తర్పణాలు వదలడం వల్ల పితృదోషాలు తొలగి వారి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం ఎన్నో రెట్లు పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పేదలకు తిలలు (నువ్వులు), కంబళ్లు, ఆహారం, వస్త్రాలు దానం చేయడం అత్యంత శుభప్రదం. నువ్వులను దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

మౌని అమావాస్య రోజు చేయవలసినవి:

సూర్యోదయానికి ముందు పవిత్ర నదులలో (లేదా గంగాజలం కలిపిన నీటితో) స్నానం చేయాలి. సాధ్యమైనంత వరకు మౌన వ్రతం పాటించాలి. పితృదేవతలకు తర్పణం, పిండ ప్రదానం చేయాలి. మీ శక్తి మేరకు దానధర్మాలు చేయాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి, గాయత్రీ మంత్రాన్ని జపించాలి. శివుడిని, విష్ణువును పూజించడం శుభప్రదం. అయితే మౌని అమావాస్య అనేది ఆధ్యాత్మిక సాధనకు, మనో నియంత్రణకు, పితృదేవతల ఆశీస్సులు పొందడానికి, పాప విమోచనానికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన అవకాశం. ఈ పవిత్రమైన రోజును భక్తి శ్రద్ధలతో గడపడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. సమస్యల నివారణకు సంబంధిత పంతులను సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పన్నెండు దశలు.. ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడే రక్షణ కవచాలు

Advertisment
తాజా కథనాలు