/rtv/media/media_files/2025/11/07/weevils-in-rice-2025-11-07-12-02-45.jpg)
weevils in rice
ఇంట్లో బియ్యం, పప్పులు, పిండి వంటి నిల్వ ఆహార పదార్థాలలో చిన్న చిన్న పురుగులు చేరడం సర్వసాధారణం. ముఖ్యంగా వర్షాకాలం లేదా చలికాలంలో వాతావరణంలో తేమ శాతం పెరిగినప్పుడు ఈ సమస్య ఎక్కువవుతుంది. ఇలాంటి పురుగులు బియ్యాన్ని పూర్తిగా పాడుచేసి, వాటి రుచి, వాసనను సైతం మార్చేస్తాయి. ఈ పురుగులను ఒక్కొక్కటిగా ఏరివేయడం కష్టంతో కూడుకున్న పని. అయితే.. మన పెద్దలు తరాల నుంచి పాటిస్తున్న కొన్ని చిట్కాలు ఈ సమస్యకు సులభమైన, రసాయన రహిత పరిష్కారాలను అందిస్తున్నాయి. బియ్యాన్ని పురుగుల నుంచి రక్షించుకోవడానికి ఉపయోగపడే సులభమైన పద్ధతులు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
బియ్యంలో పురుగులను తరిమికొట్టే చిట్కాలు:
సూర్యరశ్మి: బియ్యాన్ని శుభ్రమైన వస్త్రం లేదా పెద్ద ట్రేపై పలుచగా పరచాలి. దీనిని రెండు నుంచి మూడు గంటల పాటు ఎండలో ఉంచాలి. సూర్యుని వేడిమికి బియ్యంలో ఉన్న పురుగులు పారిపోతాయి. అంతేకాకుండా.. బియ్యంలోని తేమ కూడా తొలగిపోతుంది. తేమ లేకపోవడం వల్ల పురుగులు తిరిగి రాకుండా ఉంటాయి.
తేమను తొలగించడానికి ఉప్పు: బియ్యం కింద, పైన కొద్దిగా ఉప్పు చల్లడం ద్వారా అందులోని అదనపు తేమను తొలగించవచ్చు. తేమ లేకపోవడం వల్ల పురుగులు చేరవు. ఉప్పును వంటకు ఉపయోగించే ముందు సులభంగా తొలగించవచ్చు.. కాబట్టి రుచి మారే సమస్య ఉండదు. కల్లు ఉప్పు వాడటం మరింత మంచిది.
వెనిగర్, ఇంగువ: ఒక చిన్న గిన్నెలో కొద్దిగా తెల్ల వెనిగర్ పోసి.. అందులో పావు టీస్పూన్ ఇంగువ కలపాలి. ఈ గిన్నెను పురుగులు పట్టిన బియ్యం మధ్యలో ఉంచాలి. వెనిగర్, ఇంగువలకు బలమైన వాసన ఉంటుంది. ఈ వాసన పురుగులకు అస్సలు నచ్చదు.. కాబట్టి అవి కొన్ని గంటల్లోనే బియ్యాన్ని వదిలి వెళ్లిపోతాయి. పురుగులు పోయిన తర్వాత బియ్యాన్ని మరొక శుభ్రమైన డబ్బాలోకి మార్చుకోవాలి.
బిర్యానీ ఆకు పద్ధతి: పురుగులకు బిర్యానీ ఆకుల వాసన పడదు. ఇది సహజమైన కీటక వికర్షిణిగా పనిచేస్తుంది. బియ్యం నిల్వ చేసే డబ్బాలో రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను వేయాలి. ఈ పద్ధతి పిండి, ఇతర పప్పులకు కూడా ప్రభావవంతంగా ఉంటుంది.
వెల్లుల్లి రెబ్బలు: బియ్యంలో పురుగులు చేరకుండా నిరోధించడానికి.. పొట్టు తీయని ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలను వేయాలి. వాటి బలమైన వాసన పురుగులను దరిచేరనివ్వకుండా చేస్తుంది. వెల్లుల్లి రెబ్బలు ఎండిపోయినట్లు అనిపిస్తే వాటిని మార్చాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి:ఈ 5 వస్తువులను మీ పర్సులో పెట్టుకోండి.. ఇక మీకు డబ్బే డబ్బు!!
Follow Us