/rtv/media/media_files/2025/08/27/ganesh-chaturthi-2025-2025-08-27-09-37-30.jpg)
Ganesh Chaturthi 2025
వినాయక చవితి పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. శివపార్వతుల తనయుడు విఘ్ననాయకుడైన గణేశుని జన్మదినంగా భావించే ఈ పండుగను దేశవ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహిస్తారు. నవరాత్రులతోపాటు వినాయకుని పూజలు భక్తిశ్రద్ధలతో చేస్తారు. ప్రజలు తమ పనులలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని కోరుకుంటూ.. గణపతిని తమ ఇళ్లకు ఆహ్వానిస్తారు. వినాయక చవితి రోజున మట్టి విగ్రహాలను ఇంటికి తెచ్చి.. ప్రతిష్టించి పూజించడం ఆనవాయితీ. అయితే వినాయకుడిని ఇంటికి ఆహ్వానించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి.
విగ్రహం ఎంపికలో జాగ్రత్తలు:
విగ్రహాన్ని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎత్తుగా ఉండే విగ్రహం కంటే చిన్న విగ్రహం తీసుకోవడం మంచిది. పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాన్ని ఎంచుకోవాలి. ఎక్కడా పగుళ్లు లేదా విరిగిన భాగాలు లేని విగ్రహాన్ని కొనుగోలు చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాలకు దూరంగా ఉండటం మంచిది. ఇవి నీటి కాలుష్యానికి కారణమవుతాయి. విగ్రహాన్ని ప్రతిష్టించే ముందు.. ఇంట్లో ఒక శుభ్రమైన స్థలాన్ని ఎంచుకుని ఒక టేబుల్‌పై శుభ్రమైన వస్త్రాన్ని పరచాలి. విగ్రహాన్ని ఇంటికి తెచ్చేటప్పుడు గణపతి బప్పా మోరియా వంటి మంత్రాలను జపిస్తూ భక్తితో తీసుకురావాలి. విగ్రహాన్ని నేలపై పెట్టకూడదు. పూజా సామాగ్రి, పువ్వులు, ప్రసాదాలు మొదలైన వాటిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
ఇది కూడా చదవండి: ఇంట్లో ఏ రంగు గణపతిని ప్రతిష్టిస్తే మంచిదో తెలుసా..?
విగ్రహాన్ని పూజ గదికి దగ్గరగా ఉంచడం మంచిది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు గణపతి దర్శనం చేసుకోవడం శుభప్రదం. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తాజా పువ్వులు, అగరబత్తులతో పూజ చేయాలి. మోదకం, ఇతర నైవేద్యాలు సమర్పించాలి. విగ్రహాన్ని శుభ్రమైన చోట ఉంచాలి. వంటగది, షూ రాక్, వాష్‌రూమ్ వంటి వాటికి దగ్గరగా ప్రతిష్టించకూడదు. విగ్రహాన్ని ఐదు, ఏడు లేదా తొమ్మిది రోజులు ఇంట్లో ఉంచవచ్చు. రోజూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజ చేయాలి. వాడిపోయిన పువ్వులను తీసివేసి పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచాలి. వినాయక చవితి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. విగ్రహం ఇంట్లో ఉన్నంత కాలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి పూర్తిగా మానేయాలి. ఇంట్లో ఎల్లప్పుడూ ఒక శుభప్రదమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. విగ్రహం ఉన్న ఇంట్లో ఎప్పుడూ కనీసం ఒకరైనా ఉండాలి. తలుపులు మూసి ఉంచకూడదు. నిమజ్జనం చేయడానికి ముందు, హారతులు సమర్పించి, గణపతికి ఆత్మీయంగా వీడ్కోలు పలకాలి. వచ్చే ఏడాది కూడా ఆయన ఆనందం, ప్రేమ, శక్తి, దీవెనలను పుష్కలంగా అందిస్తాడని ఆశిస్తూ భక్తితో గణేశుడిని నిమజ్జనం చేయాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: వినాయకుడి విగ్రహ ప్రతిష్టకు సరైన సమయం ఏంటో తెలుసా..?