దేశంలో జరిగే వివాదాలపై తనదైన శైలీలో స్పందిస్తుంటారు బాలీవూడ్ నటీ కంగనా రనౌత్. గత కొంత కాలంగా ఆమె బీజేపీకి అనుకూలంగా ఉంటూ పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఈసారి జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ కంగనాకు ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగనున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. భారత తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read: పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారెంటీస్..కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో
'టైమ్స్ నౌ' వార్తా సంస్థ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో కంగనా పాల్గొన్నారు. 'మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తొలి ప్రధాని బోస్ ఎక్కడికి వెళ్లారు ?. దేశం కోసం పోరాడిన ఆయన్ని దేశంలోకి అడుగుపెట్టనివ్వలేదని' ఆమె వ్యాఖ్యానించారు. దీంతో వ్యాఖ్యాత.. కంగనా మాటలను సరిచేశారు. అయితే ప్రస్తుతం కంగనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో విపక్ష నేతలు, నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె విద్యాశాఖ మంత్రి అయితే పరిస్థతి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు కంగనా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. 'నార్త్ నుంచి ఒక బీజేపీ అభ్యర్థి.. సుభాష్ చంద్రబోస్ మన తొలి ప్రధాని అని అంటారు. సౌత్ నుంచి మరో బీజేపీ నేత మన మొదటి ప్రధాని మహాత్మ గాంధీ అని అంటారు. వీళ్లందరు ఎక్కడి నుంచి గ్రాడ్యూయేట్ అయ్యారు' అంటూ విమర్శించారు. ఇదిలాఉండగా.. మండి నియోజకవర్గానికి జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది. రాజవంశీయులకు కంచుకోటైన ఈ నియోజకవర్గంలో కంగనా రనౌత్ పోటీ ఆసక్తిగా మారింది.