ఇజ్రాయెల్ అసలెక్కడా తగ్గడం లేదు. ఎవరెంత చెప్పినా తమ దాడులను ఆపేదే లేదంటోంది. తాజగా గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో 15 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం మొదట ఆసుపత్రి తాలూకా అంబులెన్స్ దగ్గరలో బాంబు దాడి చేసింది. ఈ ఆంబులెన్స్ లను హమాస్ ఉపయోగిస్తోందని...తమ మిలిటెంట్లను క్యారీ చేయడానికి ఆంబులెన్స్ లను వాడుతోందన ఇజ్రాయెల్ చెబుతోంది. అందుకే దాని మీద దాడి చేశామని అంటున్నారు. ఈ దాడిలో హమాస్ యోధులు మరణించారని ఐడీఎఫ్ తెలిపింది. హమాస్ తన ఉగ్రవాదులను, ఆయుధాలను అంబులెన్స్‌లో తరలిస్తోందని ఇజ్రాయెల్ చెబుతోంది.
మరోవైపు, ఇజ్రాయెల్ సైన్యం చేసిన ఈ ఆరోపణ నిరాధారమని హమాస్ అంటోంది. అల్-షిఫా ఆసుపత్రి అధికారులు సైతం దీన్ని ఖండిస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇజ్రాయెల్ ఈ ఆసుపత్రి మీద దాడి చేసింది. అప్పుడు ఏకంగా 500మంది పాలస్తీనియన్లు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.
మహాస్ తమ బందీలను విడిచిపెట్టేవరకు ఇజ్రాయెల్ దాడులను ఆపదని చెబుతున్నారు ఆ దేశ ప్రధాని నెతన్యాహు. కాల్పుల విరమణకు ఒప్పుకునేదే లేదని స్పష్టం చేశారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలై దాదాపు నెల రోజులు అవుతోంది. ఇప్పటివరకు, ఇజ్రాయెల్ దాడిలో గాజాలో 9000 మందికి పైగా మరణించారు. 32000 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారు. ఇజ్రాయెల్ దాడిలో 3700 మందికి పైగా పిల్లలు మరణించారు.
మరోవైపు మేము యుద్ధంలోకి దిగితే రణరంగమే అంటున్న ఇరాన్...ఇప్పటి వరకు యుద్ధానికి దిగలేదు. దాంతో పాటూ హెజ్బుల్లాను కూడా యుద్ధంలోకి దింపడం లేదు. ఇవి రెండూ కనుక ఎదురు దాడులకు దిగితే అది చాలా పెద్ద యుద్ధమే అవుతుంది. అప్పుడు సహాయం చేయడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే ఇరాన్ వస్తాం వస్తాం అంటోందే కానీ ముందుకు రావడం లేదు. దాంతో పాటూ హెజ్బుల్లాను కూడా ఆపుతోంది. దానికి తోడు ఇరాన్ ఇప్పుడు యుద్ధానికి దిగితే ఆర్ధికంగా నస్టపోయే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఆర్ధిక ఆంక్షలతో ఆ దేశం కుదేలయిపోయింది. దాన్ని మరింత పెద్దది చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇక హెజ్బుల్లాను పెంచిపోషిస్తున్నది ఇరానే. నిధులు, ఆయుధాలు అన్నీ దానికి ఇరానే అందిస్తోంది. అందుకే ఇరాన్ ఏం చెబితే హెజ్బుల్లా అది చేస్తుంది.