Explainer: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఏళ్లనాటి శత్రుత్వం.. ఇప్పుడేం జరగనుంది?

మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ఈరెండు దేశాల కోట్లాట మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అని భయపడుతున్నాయి. అసలీ రెండు దేశాల మధ్యా గొడవ ఏంటి?

Explainer: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఏళ్లనాటి శత్రుత్వం.. ఇప్పుడేం జరగనుంది?
New Update

Iran Vs Israel: 11 రోజుల క్రితం సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌ మీద ఇజ్రాయెల్ చేసిన దాడి మరో యుద్ధానికి దారితీస్తోంది. ఏప్రిల్‌ ఒకటో తేదీన ఇజ్రాయెల్‌ దాడిలో ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ ఇద్దరు సైనిక జనరల్స్ సహా ఏడుగురు అధికారుల మరణం ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. ఇప్పుడు ఈ చర్యకు ప్రతీకారంగా ఇరాన్ రానున్న 24 లేదా 48 గంటల్లో దాడి చేయవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ఏ క్షణమైనా దాడికి దిగవచ్చనే ప్రచారం జరుగుతోంది. దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో టెల్‌ అవీవ్‌పై విరుచుకుపడేందుకు ఇరాన్‌ సిద్ధమైందనట్లు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ కూడా ఈ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధం అంటోంది. ఎలాంటి దాడులను అయినా ఎదుర్కొంటామని చెబుతోంది. అయితే అమెరికా మాత్రం దీనికి అడ్డుపడుతోంది. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ యుద్ధం జరగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చైనా, టర్కీ, సౌదీ అరేబియా, ఇంకా పలు యూరోపియన్ దేశాల వారితో మాట్లాడి ఇరాన్..ఇజ్రాయెల్ మీద దాడి చేయకుండా ఉండేందుకు చర్చలు జరుపుతున్నారు. కానీ ఒకవేళ ఇరాన్ దాడి అంటూ చేస్తే తాము మాత్రం ఇజ్రాయెల్‌కే సంపూర్ణ మద్దతు ఇస్తామని చెబుతోంది యూఎస్. ఇరాన్‌ను ఇజ్రాయెల్, అమెరికా రెండు కలిసి సంయుక్తంగా ఎదుర్కొంటాయని అంటోంది.

ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లోనే కాకుండా రివల్యూషనరీ గార్డ్‌కు దగ్గరగా ఉన్న హైఫా విమానాశ్రయం, డిమోనాలోని అణుకేంద్రం మీద కూడా ఇరాన్ దాడుల చేస్తుందని…సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెలువడ్డాయి. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదనే భయం మరింత పెరిగింది. అలాగే జెరూసలెంలో ప్రధాన మంత్రి కార్యాలయం మీద కూడా దాడులు జరగవచ్చని అంటున్నారు. అయితే ఇరాన్ ఈ దాడులను ప్రత్యక్షంగా చేస్తుందా? లేదా ప్రాక్సీ నెట్ వర్క్ మీద ఆధారపడుతుందా? అనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.

యుద్ధం జరిగితే ఏమవుతుంది..

రెండు దేశాలు కొట్టుకుంటుంటే..ప్రపంచం ఎందుకు భయపడుతోంది. మూడో ప్రపంచం యుద్ధం వస్తుందని ఎందుకు ఆదోళన చెందుతోంది. దీని వెనుక కారణాలు ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం జరిగితే ఏమవుతుంది. ఇప్పుడు ఈ ప్రశ్నలు మొత్తం వరల్డ్‌ను తినేస్తున్నాయి. ప్రపంచం దేశాల్లో ఇరాన్ బలమైన దేశం. ఇక్కడనుంచి భారత్‌తో సహ అనేక దేశాలు ఆయిల్‌ను, పెట్రోల్ వంటి వాటిని ఎగుమతి చేసుకుంటున్నాయి. దాంతో పాటూ ఇరాన్‌కు భారత్‌ నుంచి అనేక వస్తువులు ఎగుమతి అవుతాయి. ఇప్పుడు కనుక యుద్ధం జరిగితే...మొత్తం ఆయిల్ సరఫరా ఆగిపోవచ్చు. ఇది ప్రపంచ ఆర్ధిక మాంద్యానికి దారి తీయవచ్చు. దాంతో పాటూ బంగారం లాంటి వాటి ధరలు అపరిమితంగా పరెగిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పటికే భారతదేశంలో గోల్డ్ రేట్స్ చుక్కలు చూపిస్తున్నాయి. యుద్ధమే కనుక జరిగితే ఫ్యూచర్‌లో బంగారం అనే మాట అనడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో పాటూ భారత్‌ ఇరాన్‌కు ఎగుమతి చేస్తున్న వాటిలో ప్రధానంగా బాస్మతి రైస్‌, టీ ఉత్పత్తులు, షుగర్‌, పండ్లు, మందులు, ఫార్మసీ ఉత్పత్తులు, సాఫ్ట్‌డ్రింక్స్‌, పప్పులు, బోన్‌లెస్‌ మాంసం.. వంటివి ఉన్నాయి. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వాటిలో స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీకి అవసమయ్యే మిథనాల్‌, పెట్రోలియం బిట్యూమెన్‌, ప్రొపేన్‌, డ్రై డేట్స్‌, ఆర్గానిక్‌ కెమికల్స్‌, ఆల్మండ్‌, యాపిల్‌.. వంటివి ఉన్నాయి. వీటన్నిటి మీద ప్రభావం విపరీతంగా పడుతుంది. అలాగే ఫార్మా కంపెనీల మీద ప్రభావం పడుతుంది. కోవిడ్ కారణంగా ఇప్పటికే ఫార్మా కంపెనీలు చాలా డీలా పడిపోయాయి. ప్రపంచం మొత్తం ఈ కంపెనీల స్టాక్ చాలా పడిపోయాయి. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఈ స్టాక్స్‌ను మరింత ప్రభావితం చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతో పాటూ ఐటీ రంగం కూడా చాలా డీలా పడిపోవచ్చని చెబుతున్నారు.  ఇజ్రాయెల్‌కు ఏటా ఐటీ రంగం ద్వారా 14 శాతం ఆదాయం లభిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఇంటెల్‌, విప్రో, టీసీఎస్‌ సహా 500కు పైగా అంతర్జాతీయ ఐటీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అమెరికా, బ్రటిన్, ఫ్రాన్స్‌తో పాటూ చాలా దేశాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు ఇజ్రాయెల్ చేస్తోంది. యుద్ధమంటూ మొదలైతే ఇవన్నీ ఆగిపోతాయి. దీంతో అపార నష్టం వాటిల్లుతుంది.

వరల్డ్ రెండు పార్టీలుగా విడిపోతుందా...

మామూలుగా అయితే ఇప్పుడు యుద్ధం రెండు దేశాల మధ్యనే జరిగే అవకాశం ఉంది. కేవలం ఇరాన్, ఇజ్రాయెల్‌లు మాత్రమే కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. అయితే మరి ఇది ఎందుకు ప్రపంచ యుద్ధంగా మారుతుందని భయపడుతున్నారు. అంటే...యుద్ధమంటూ మొదలైతే అది కేవలం ఆ రెండు దేశాలతోనే ఆగిపోదని చెబుతున్నారు విశ్లేషకులు. ఇప్పటికే అమెరికా తమ పూర్తి మద్దతును ఇజ్రాయెల్‌కు ఇచ్చింది. అలాగే ఇజ్రాయెల్ వైపు మరికొన్ని దేశాలు కూడా రావొచ్చు. ఇక ఇరాన్‌కు కూడా మిత్ర దేశాలు చాలానే ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్, రష్యా వటివి ఇరాన్ కు సపోర్ట్ చేయవచ్చు. అప్పుడు యుద్ధం మొత్తం ప్రపంచానికే అవుతుంది. అందుకే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ జరగకుండా ఉండేందుకు అమెరికాతో సహా అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కోరుతున్నాయి.

ఉద్రిక్తతలు పెరగకుండా అడ్డుపడుతున్న అమెరికా..

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణాన్ని శాంతింప చేయడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇరాన్‌ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం స్పందించారు.తాము అనుకున్న సమయం కంటే ముందే ఇరాన్‌ దాడులు చేసేందుకు ప్లాన్‌ చేస్తోందని.. అయితే, తాము మాత్రం ఇజ్రాయెల్‌ రక్షణకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇజ్రాయెల్‌ను రక్షించడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పారు. ఈ యుద్ధంలో ఇరాన్‌ విజయం సాధించదు అని కామెంట్స్‌ చేశారు. మరోవైపు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ జనరల్‌ మైకెల్‌ ఎరిక్‌ కొరిల్లా ఇజ్రాయెల్‌ చేరుకుని..వారి యుద్ధ సన్నద్ధతను పరీక్షించారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోయావ్‌ గాలాంట్‌తో కలిసి హెట్జోర్‌ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ఇజ్రాయెల్, అమెరికాలను ఓడించడం ఇరాన్‌కు అంత సులభం కాదని ఎరిక్ వ్యాఖ్యానించారు.

ఇక ఇరాన్ కనుక దాడులకు పాల్పడితే…తాము ఆ దేశానికి అండగా ఉండమని చెబుతున్నాయి అరబ్ దేశాలు. ఖతార్, కువైట్‌లో ఇప్పటికే ఈ మేరకు ప్రకటనలు చేశాయి. ఇరాన్ దాడులకు తమ దేశ గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతినివ్వమని చెబుతున్నాయి. సౌదీ అరేబియాతో సహా మిగతా అరబ్‌ దేశాలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది. మరోవైపు రష్యా, జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాలు సంమయమనం పాటించాలని అమెరికా కోరుతోంది. ఆ దేశ విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్ అన్ని దేశాలతోనూ చర్చలు జరుపుతున్నారు. వీటన్నింటితో పాటూ ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడిని ఖండిస్తూ UN భద్రతా మండలి స్పందిస్తే కనుక యుద్ధాన్ని ఆపవచ్చని అమెరికా అభిప్రాయపడుతోంది. మొత్తానికి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం మాత్రం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

అసలు రెండు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు మొదలైంది...

ఇరాన్, ఇజ్రాయెల్‌లు 1979 వరకు స్నేహంగానే ఉండేవి. రాచరికంలో ఉన్నంతరవకు ఈ రెండు దేశాలూ.. అమెరికా అన్నీ కలిసి మెలిసే ఉన్నాయి. కానీ 1979లో ఇరాన్‌లో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారిపోయింది. దాంతో ఇజ్రాయెల్, అమెరికాలు ఆ దేశానికి దూరం అయ్యాయి. సామ్రాజ్యవాదాన్నే తాము సపోర్ట్ చేస్తామంటూ ఇరాన్‌ను వ్యతిరేకించడం మొదలు పెట్టాయి. ఖొమైనీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంపుకుంది. ఇజ్రాయెల్ పౌరుల పాస్‌పోర్టులను గుర్తించడం మానేసింది.టెహ్రాన్‌లోని ఇజ్రాయెలీ దౌత్య కార్యాలయాన్ని సీజ్ చేసి, దానిని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటుకు పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎ‌ల్ఓ)కు అప్పగించింది.

1990 వరకు కూడా ఇజ్రాయెల్‌కు ఇరాన్ మీద శ్రతుత్వం లేదు. కానీ కాలక్రమంలో ఇరాన్‌ను తన మనుగడకు ప్రమాదకారిగా ఇజ్రాయెల్ భావించడం మొదలుపెట్టింది.దీంతో వీరి మధ్య వైరం మాటల నుంచి చేతల దాకా వెళ్ళింది. ఇరాన్‌లో షియాలు మెజార్టీ కాగా, మిగిలిన అరబ్ దేశాలలో సున్నీలదే ఆధిపత్యం. దీంతో తాను ఏకాకిననే సత్యాన్ని ఇరాన్ ప్రభుత్వం గ్రహించింది. దీంతో ఏదో ఒకరోజు తన సొంత ప్రాంతంలోనే తన పై దాడి జరగవచ్చనే ఉద్దేశంతో ఇరాన్ హిజ్బుల్లాను పుట్టించింది.

షాడో వార్
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధాన్ని ‘షాడో వార్’గా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో పరస్పరం దాడులకు దిగినప్పటికీ ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. 1992లో ఇరాన్‌కు సంబంధించిన ఇస్లామిక్ జిహాదీ గ్రూపు బ్యూనస్ ఎయిర్స్‌లోని ఇజ్రాయెలీ ఎంబసీని పేల్చివేసి, 29మంది మృతికి కారణమైంది. దానికి కొన్నిరోజుల ముందే హిజ్బొల్లా నేత అబ్బాస్ అల్ ముసావి హత్యకు గురయ్యారు. ఈ హత్య ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌కు ఆపాదించారు.

ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ తహతహలాడుతూ ఉండేది. ఇరాన్ వద్ద అణుశక్తి ఉండకూడదనేది ఇజ్రాయెల్ కోరిక. ప్రజా అవసరాల కోసమే తాము అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనే ఇరాన్ మాటలను ఇజ్రాయెల్ నమ్మడం లేదు. ఈక్రమంలో 2000 సంవత్సరంలో ఇరాన్ అణు సంపద మీద దాడి చేసింది ఇజ్రాయెల్. న్యూక్లియర్ ప్రాజెక్ట్ లో భాగస్వాములైన కీలక సైంటిస్టులపై దాడులకు ఇజ్రాయెలీ ఇంటలిజెన్స్‌దే బాధ్యత అని టెహ్రాన్ నిరసన వ్యక్తం చేసింది. 2020లో ఇరాన్ శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదెహ్ హత్యకు గురవడానిక కూడా ఇజ్రాయెలే కారణమని ఇరాన్ నమ్ముతోంది. మరోవైపు తమ ప్రాంతాల్లో రాకెట్, డ్రోన్ల దాడులకు కారణం ఇరానేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దాంతో పాటూ ఇజ్రాయెల్ సరిహద్దు దేశమైన సిరియాలో 2011లో మొదలైన అంతర్యుద్ధం కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలకు మరో కారణంగా నిలుస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న షాడో వార్ 2021లో సముద్రంపైకి కూడా చేరింది. ఆ ఏడాది గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో తమ నౌకలపై జరిగిన దాడికి ఇరానే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించగా, ఎర్రసముద్రంలో తమ నౌకలపై దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది. తరువాత ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం కూడా ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్...ఇరాన్ మీద దాడులకు తెగబడింది.

Also Read:Social Media: సోషల్ మీడియాలోనూ పోటీలు పడుతున్న పార్టీలు..టాప్‌లో బీజేపీ

#world #israel #iran #war
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe