Israel: ఇజ్రాయెల్‌పై మరోసారి దాడికి రెడీగా ఉన్న ఇరాన్..

టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌పై మరోసారి దాడికి ఆదేశించినట్లు తెలుస్తోంది. ముగ్గురు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఈ వార్తను నివేదించింది.

New Update
Israel: ఇజ్రాయెల్‌పై మరోసారి దాడికి రెడీగా ఉన్న ఇరాన్..

'ఇజ్రాయెల్ అంతుచూస్తాం.. ప్రతీకార చర్య తప్పదు..జాగ్రత్తగా ఉండండి..' టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హత్య తర్వాత ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ చేసిన కామెంట్స్ ఇవి! ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్‌ రెడీగా ఉందంటూ అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్‌ టైమ్స్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇస్మాయిల్ హత్య విషయంలో ఇరాన్‌ రగిలిపోతుందని అమెరికా వర్గాలు అంటున్నాయి. తమ దేశంలో ఆశ్రయిం పొందుతున్న హమాస్‌ అగ్రనేతను ఇజ్రాయెల్‌ దళాలు చంపడాన్ని ఇరాన్‌ జీర్ణించుకోలేకపోతుందట..! అందుకే ఇజ్రాయెల్‌పై దాడికి ఈ ఇస్లామిక్‌ దేశం పక్కా ప్లాన్‌ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది.

టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌పై దాడికి ఆదేశించినట్లు సమాచారం. ముగ్గురు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఈ వార్తను నివేదించింది. ఇస్మాయిల్ మరణించినట్లు ప్రకటించిన కొద్దిసేపటికే, ఇరాన్ జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఇజ్రాయెల్‌పై దాడికి ఖమేనీ ఆదేశించినట్టుగా సమాచారం. ఇక గత ఏప్రిల్‌లో సిరియాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు ఇరాన్ సైనిక కమాండర్లు మరణించారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఆగ్రహంగా ఉంది.

Also read: 24 గంటల్లో వయనాడ్ లో బ్రిడ్జి నిర్మించిన ఆర్మీ

2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాలస్తీనాలో రక్తం పారుతోంది. హమాస్‌పై ప్రతీకార చర్య పేరుతో గాజాలో ఇజ్రాయెల్ బాంబుల మోత మోగిస్తోంది. ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో దాదాపు 40 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో హమాస్‌ దళాల కంటే పాలస్తీనా సామాన్యులే ఎక్కువ ఉన్నారు. పిల్లలు, మహిళలే 50శాతం కంటే ఎక్కువగా చనిపోయారు. అమాయక ప్రజలపై హింస ఆపాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వస్తున్నా ఇజ్రాయెల్‌ మాత్రం ఆ పని చేయడం లేదు. ఇటు పాలస్తీనాకు ఇరాన్‌ మద్దతు ఉంది. హమాస్‌ టాప్‌ లీడర్‌ ఇస్మాయిల్‌ అందుకే ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఉంటారు. తాజాగా ఎన్నికైన కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి కూడా ఇస్మాయిల్‌ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌ జరిగి ఇంటికి వెళ్లిన తర్వాత ఇస్మాయిల్‌ను హత్య చేశారు. అయితే ఈ హత్య ఇజ్రాయెలే చేసిందని చెప్పేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా ఇది కచ్చితంగా ఆ దేశం పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అటు ఇజ్రాయెల్‌ విషయంలో ఎప్పటినుంచో ఆగ్రహంగా ఉన్న ఇరాన్‌ ఇస్మాయిల్‌ హత్య తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేస్తే పరిస్థితులు మరింత అదుపు తప్పడం ఖాయం. ఎందుకంటే ఇజ్రాయెల్‌కు అమెరికా సపోర్ట్‌ ఉంది. అగ్రరాజ్య అండదండలతోనే ఇజ్రాయెల్‌ దళాలు యుద్ధరంగంలోకి దూకుతాయి. ఇక ఇప్పటికే అమెరికా-ఇరాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 2020లో ఇరాన్ సైనిక అధికారి ఖాసీం సులేమానీ హత్య తర్వాత అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్‌ వెయిట్ చేస్తోంది. ఇక తాజాగా హమాస్‌ అగ్రనేతను తమ దేశంలోనే ఇజ్రాయెల్‌ చంపించిందన్న అనుమానంతో ఇరాన్‌ రివెంజ్‌ ప్లాన్‌ షురూ చేసినట్టుగా తెలుస్తోంది.

Also Read: రేపే జాబ్ క్యాలెండర్.. కేబినెట్ కీలక నిర్ణయం

ఇక 2024 ఏప్రిల్‌లో సిరియాలోని డమాస్కస్‌లో తమ​ రాయబార కార్యాలయంపై దాడి తర్వాత ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ పేరుతో వందలాది డ్రోన్లు, మిస్సైళ్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. అయితే ఇరాన్ దాడుల్ని ఇజ్రాయెల్ సునాయాసంగా ఎదుర్కొంది. ఇజ్రాయెల్‌కు గగనతల రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండడంతో ఇరాన్‌ దాడులు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఇక ఆ తర్వాత పరిస్థితులు కాస్త చల్లారినట్టే అనిపించినా మరోసారి అవి తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు