2024 ముగియబోతోంది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా చాలా విషయాలు జరిగాయి.. ఇవి రాజకీయంగా ఇంకా చాలా రకాలుగా ప్రభావం చూపించాయి. అందులో ముఖ్యమైన అంశాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం..
ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం..
2023లో మొదలైన ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య యుద్ధం 2024లో కూడా కొనసాగింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 45 వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళల సంఖ్య అత్యధికంగా ఉంది. హమాస్ అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 1200 మంది మరణించగా, హమాస్ 251 మందిని బందీలుగా పట్టుకుంది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ మారణకాండ కొనసాగిస్తూనే ఉంది. దీనంతో గాజా ప్ట్రిప్ కోలుకోలేని విధంగా దెబ్బతింది. దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. కొంత కాలం క్రితమే ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు ఒప్పుకుంది...కానీ ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం...
ఇది అయితే రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. ఇది ఇలానే కొనసాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నాటికి ఈ యుద్ధం మూడవ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఉక్రెయిన్‌ను తమ దేశంలో కలుపుకునే వరకూ ఊరుకునేది లేదని రష్యా అంటోంది. మరోవైపు ఉక్రెయిన్ అది ఎట్టి పరిసథితుల్లోనూ జరగనివ్వమని ఉక్రెయిన్ పట్టుదలగా ఉంది. ఇక అమెరికాకు కొత్త అధ్యక్షుడగా ఎన్నికైన ట్రంప్ ఈ రెండు దేశాల మధ్యా యుద్ధాన్ని ఆపుతానని చెప్పారు. దీనికి రష్యా కూడా సానుకూలంగా స్పందించింది. మరి ట్రంప్ ఏం చేస్తారో...రష్యా ఎలా రియాక్ట్ అవుతుందో వచ్చే ఏడాది చూడాలి.
భారత్–కెనడా దౌత్య సంబంధాలు..
ఈ ఏడాది భారత్–కెనడాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. దౌత్యపరంగా చాలాసార్లు ఉద్రిక్తతలు ఎదుర్కొన్నాయి. కెనడాలో వేర్పాటువాద సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత మొదలై ఈ వివాదం...అంతకంతకూ ఎక్కువైంది. ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించే స్థాయికి పరిస్థితి చేరుకుంది. భారత్ ఎంత చెబుతున్నా, సంయమన పాటిస్తున్నా కెనడా మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. భారత్ మీద ఆరోపణలు చేస్తూనే ఉంది.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాపై తిరుగుబాటు
బంగ్లాదేశ్ మూడు నెలల పాటూ అల్లకల్లోలం అయిపోయింది. ఆగస్టులో హింసాత్మక నిరసనలతో చాలా మంది ప్రాణాలు పోయాయి. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది. ప్రధాని హసీనా దేశం నుంచి పారిపోవలసి వచ్చింది. దీని తర్వాత తాత్కాలికంగా బంగ్లాదేశ్‌కు యూనస్ ఖాన్ ప్రధాని అయ్యారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మతపరమైన మైనారిటీలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఇది భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతోంది. మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్‌ను భారత్ కోరింది. మరోవైఉ షేక్ హసీనాను బంగ్లాదేశ్ పంపాలని ఆదేశం కోరుతోంది.
నరేంద్ర మోదీ హ్యాట్రిక్..
భారతదేశ రాజకీయ చరిత్రలో నరేంద్ర మోదీ కొత్త రికార్డ్‌ను సృష్టించారు. మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తనకు తిరుగులేదని నిరూపించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 292 సీట్లు గెలుచుకుంది. అయితే బీజేపీకి 232 సీట్లు మాత్రమే వచ్చి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో టీడీపీ, జేడీయూ సపోర్ట్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు దాదాపు పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. కాంగ్రెస్ 99, సమాజ్‌వాదీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, టీడీపీ 16, జేడీయూ 12 సీట్లు గెలుచుకున్నాయి. దీంతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి అంతర్జాతీయంగా ప్రభావం చూపించిన వ్యక్తిగా నిలిచారు.
ట్రంప్ రెండవసారి ఎన్నిక...
2024లో ప్రపంచం అంతా ఆసక్తిగా గమనించిన మరో విషయం అమెరికా ఎన్నికలు. చిర వరకూ ఉత్కంఠంగా సాగిన ఈ పోరులో డొనాల్గ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మధ్యలో గ్యాప్ తరువాత రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయి చరిత్ర సృష్టించారు ట్రంప్. భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ను 312 ఎలక్టోరల్ ఓట్లతో ఓడించారు. ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్ అన్నింటినీ క్లీన్ స్వీప్ చేసేశారు. ట్రంప్ ఈ విజయంతో అంతర్జాతీయ రాజకీయాల్లో అనేక మార్పులు రానున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందులో అతి పెద్ద విషయం ఏమిటంటే కొన్ని దేశాలపై సుంకాలు పెంచడం ఒకటి అయితే...ప్రపంచం వ్యాప్తంగా శాంతి దిశగా నడిపించడం మరొకటి. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న రెండు యుద్ధాలు ఆగిపోతాయని చెబుతున్నారు.
సిరియా తిరుగుబాటు...
హయత్ తహ్రీర్ అల్-షామ్ (HTAS) నేతృత్వంలోని తిరుగుబాటుదారులు సిరియా ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఆ దేశ రాజధాని డెమాస్కస్‌ను స్వాధీనం చేసుకుని...దేశాధ్యక్షుడు అసద్ నియంతృత్వనికి చరమగీతం పాడారు. సిరియాకు స్వాతంత్ర్యం ప్రకటించారు. హెచ్‌టిఎఎస్ చీఫ్ అబూ మహ్మద్ అల్-జులానీ పాలన చేపట్టారు. సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ రష్యా ఆశ్రయం పొందుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ లో గొడవలు..
2024లో ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆయన మద్దతుదారులు వీధుల్లోకి వచ్చారు. దీంతో అక్కడ రాజకీయ కలకలం రేగింది. దాంతో పాటూ పాకిస్తాన్ రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటోంది. 2025లో కూడా ఇదే కొనసాగితే అక్కడ ప్రాంతీయ భద్రత, ఆర్థిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది ఇది భారతదేశానికి కూడా అంత మంచి విషయమేమీ కాదు.
Also Read: Business: దారుణంగా పడిపోయిన రూపాయి..ఏడు నెలల కనిష్టానికి..