Tarique Rahman: బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిక్‌ రెహమాన్‌.. ఈయన్ని డార్క్‌ ప్రిన్స్ అని ఎందుకంటారో తెలుసా ?

బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో బీఎన్‌పీ గెలిచింది. మాజీ ప్రధాని ఖాలిదా జియా కొడుకు, BNP ఛైర్మన్ తారిక్‌ రెహమాన్ (60) బంగ్లాదేశ్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఆయన్ని డార్క్ ప్రిన్స్ అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
Tarique Rahman

Tarique Rahman

బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) గెలిచింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత బీఎన్‌పీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. 299 పార్లమెంటు స్థానాలకు బీఎన్‌పీ 209 చోట్ల గెలిచింది. పాక్‌కు దగ్గరగా ఉండే మతతత్వ పార్టీ జమాత్ ఏ ఇస్లామీ 68 స్థానాల్లో గెలిచింది. మాజీ ప్రధానమంత్రి ఖాలిదా జియా కొడుడు, BNP ఛైర్మన్ తారిక్‌ రెహమాన్ (60) బంగ్లాదేశ్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.  

డార్క్‌ప్రిన్స్‌గా తారిక్ రెహమాన్

బంగ్లాదేశ్‌ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్, మాజీ ప్రధానమంత్రి ఖలిదా జియా కూమారుడే తారిక్ రెహమాన్. 2001-2006 మధ్య రెండోసారి ఖలిదా జియా ప్రధానిగా ఉన్న సమయంలో తారిక్ రెహమాన్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. 'హవా భవన్' అనే కార్యాలయం నుంచి పాలనతో సహా అన్ని వ్యవహారాలనూ తానే చూసుకునేవాడు. కాంట్రాక్టులు, నియామకాలు, ఇతర ప్రభుత్వ పనుల కోసం ఆయన పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కూడా ఆయన జోక్యం ఎక్కువగా ఉండేది. దీంతో అమెరికా రాయబారి జుడిత్ చమ్మాస్ తారిక్‌ను "డార్క్ ప్రిన్స్" అని అభివర్ణించారు. బంగ్లాదేశ్ విపక్ష పార్టీలు కూడా ఆయన్ని డార్క్ ప్రిన్స్‌ అని పిలిచేవి.

Also Read: సెప్టిక్ ట్యాంక్‌లో శవంగా తేలిన మహిళ.. కేసులో షాకింగ్ విషయాలు!

రెహమాన్‌పై 84 కేసులు

తారిక్ రెహమాన్‌పై గతంలో దాదాపు 84 కేసులు నమోదయ్యాయి.2004లో అప్పటి విపక్ష నేత షేక్ హసీనా సభపై జరిగిన గ్రెనేడ్ దాడిలో తారిక్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై కేసు నమోదుకాగా ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అలాగే సింగపూర్‌కు అక్రమంగా నిధులు తరలించారనే ఆరోపణలతో మనీలాండరింగ్ కేసులు కూడా నమోదు చేశారు. అలాగే ట్రస్ట్ నిధుల దుర్వినియోగం, 2004లో చిట్టగాంగ్ తీరంలో దొరికిన భారీ ఆయుధాల చేరవేత కేసులో కూడా రెహమాన్ పేరు బయటికొచ్చింది. 

2007లో బంగ్లాదేశ్‌లో సైనిక మద్దతు గల ఫక్రుద్దీన్ అహ్మద్ 'ఆపద్ధర్మ ప్రభుత్వం' అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో  దేశవ్యాప్తంగా అవినీతిపై భారీ ఆపరేషన్‌ చేపట్టారు. ఇందులో మార్చి 7న తారిక్ రెహమాన్‌ను సైనిక బలగాలు, అవినీతి నిరోధక అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు తర్వాత తారిక్  సుమారు 18 నెలల పాటు జైల్లోనే శిక్ష అనుభవించారు. జైల్లో తనను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినట్లు బీఎన్‌పీ శ్రేణులు ఆరోపించారు. ఆయన వెన్నెముకకు తీవ్రమైన దెబ్బ తగిలిందని, ఫలితంగా ఆయన నడవలేని పరిస్థితి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. చివరికి 2008, సెప్టెంబర్ 3న కోర్టు తారిక్ రెహమాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. అదే ఏడాది సెప్టెంబర్‌ 11న మెరుగైన వైద్యం కోసం లండన్‌కు వెళ్లారు. అప్పటినుంచి 17 ఏళ్ల పాటు అక్కడే ప్రవాసంలో ఉన్నారు. అక్కడే ఉంటూ BNP కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు.

Also Read: మదురోని బంధించిన అమెరికా యుద్ధనౌక ఇప్పుడు ఇరాన్‌ వైపు ప్రయాణం

ఇక గతేడాది డిసెంబర్‌లో తల్లి ఖాలిదా జియా అనారోగ్యానికి గురవ్వడంతో17 ఏళ్ల తర్వాత తారిక్‌ రెహమాన్ స్వదేశానికి వచ్చారు. డిసెంబర్ 30న ఆమె చనిపోవడంతో తారిక్ రెహమాన్ పార్టీ బాధ్యతలు చేపట్టారు.  ఇటీవల షరీఫ్ ఉస్మాన్‌ హాదీపై, ఆ తర్వాత మైనార్టీలపై దాడులు, హింసాత్మక ఘటనలు పెరగడంతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఇదే సమయంలో రంగంలోకి దిగిన తారిక్‌ రెహమాన్ బంగ్లాదేశ్‌ ఫస్ట్‌ నినాదంతో ప్రచారం చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఎన్‌పీ విజయం సాధించడంతో ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.  

#international #Tarique Rahman #bangladesh #rtv-news #telugu-news
Advertisment
తాజా కథనాలు