/rtv/media/media_files/2025/09/14/israel-hamas-war-2025-09-14-07-01-08.jpg)
Israel Hamas War
Israel Hamas War : గాజా నగరంపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ విరుచుకు పడుతోంది. డ్రోన్లు, వైమానిక దాడులతో చెలరేగిపోతుంది. తాజాగా గాజాలోని పలు ప్రాంతాలపై ఐడీఎఫ్ (IDF) దళాలు నిర్వహించిన దాడుల్లో 32 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. వారిలో 12 మంది చిన్నారులే ఉండటం గమనార్హం. గత కొంత కాలంగా గాజాలోని అపార్ట్‌మెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూ వాటిని నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ భవనాలపై హమాస్ నిఘా పరికరాలను ఉంచిందన్న టెల్ అవీవ్ ఆరోపణలతో ఈ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే గాజా నగరాన్ని ఖాళీ చేయాలని అక్కడి పౌరులకు ఐడీఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు దాదాపు 2,50,000 మంది గాజా సిటీని వదిలినట్లు టెల్ అవీవ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే హమాస్‌కు మద్దుతుగా నిలుస్తున్న యెమెన్‌లోని హూతీ తిరుగుబాటు దారులు ఇజ్రాయెల్‌పై హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించారు. దీంతో టెల్ అవీవ్‌లో కొంతసేపు సైరన్లు మోగాయి. అదే సమయంలో ఆ క్షిపణిని తాము విజయవంతంగా నిరోధించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
గాజా నగరంలోని ఉత్తర ప్రాంతంలో ఐడీఎఫ్ జరిపిన కాల్పుల్లోఒకే కుటుంబానికి చెందిన 14 మంది ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. గాజా నగరంలో అట్ ట్వామ్ ప్రాంతంలోని ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో వారంతా మరణించినట్లు పేర్కొన్నాయి. అయితే, ఈ దాడులను పాలస్తీనా గ్రూప్ హమాస్ తీవ్రంగా ఖండించింది. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్థులు ఐదు ట్రక్కుల్లో ఆయుధాలను శనివారం ఆ దేశ సైన్యానికి స్వచ్ఛంధంగా అప్పగించారు. తమ దేశంలో ఉన్న హమాస్, హెచ్‌బొల్లా, ఇతర గ్రూపులు తమ ఆయుధాలు అప్పగించాలని లెబనాన్ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనికి హమాస్, హెచ్‌బొల్లా అంగీకరించలేదు. అయితే పాలస్తీనా లిబరేషన్ అథారిటీ (పీఎల్‌వో) మాత్రం ఆమోదం తెలిపింది. లెబనాన్ పిలుపు మేరకు మే నెల నుంచి పాలస్తీనా శరణార్థులు సైన్యానికి ఆయుధాలు అప్పగిస్తున్నారు.
గడచిన రెండు సంవత్సరాలుగా హమాస్, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తొలిసారి 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దుల్లో హమాస్ దాడికి పాల్పడగా1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. మరో 251 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది. ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. హమాస్‌ను తుదముట్టించే వరకు గాజాపై దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్ సైన్యం ప్రతీన పూనింది. ఇందులో భాగంగా గాజా స్ట్రిప్‌పై భీకర దాడులు చేస్తూనే ఉంది. ఇక ఈ దాడుల్లో ఇప్పటివరకు 64 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతిచెందినట్లు తెలతుస్తోంది. యుద్ధం మొదలైనప్పటినుంచి 64,231 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 400 మందికిపైగా ఆచూకీలేకుండా పోయినట్లు తెలిపింది. మృతుల్లో సగానికిపైగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది.