/rtv/media/media_files/2025/10/08/gaza-2025-10-08-22-29-07.jpg)
మొత్తానికి రెండేళ్ళుగా సాగుతున్న యుద్ధానికి తెర పడుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన 21 శాంతి సూత్రాలకు ఇజ్రాయెల్ తో పాటూ హమాస్ కూడా అంగీకారం తెలిపేందుకు ముందుకు వచ్చింది. అంతకు ముందే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దానిని అంగీకరించారు. అయితే ట్రంప్ ప్రతిపాదనకు హమాస్ ఒప్పుకుంది కానీ కొన్ని షరతులను పెట్టినట్టు తెలుస్తోంది. వాటిపై చర్చలకు ఆహ్వానించింది. ఇవి ప్రస్తుతం ఈజిప్టులో జరుగుతున్నాయి. ఇందులో ఈరోజు కీలక ముందడుగు పడినట్టు తెలుస్తోంది. విడుదల కావాల్సిన బందీలు, ఖైదీల పేర్లు ఉన్న జాబితాలను ఇజ్రాయెల్- హమాస్ మార్పిడి చేసుకున్నాయని చెబుతున్నారు.
దీంతో పాటూ హమాస్ తమ లీడర్లు అయిన యహ్యా సిన్వర్, మహ్మద్ సిన్వర్ మృతదేహాలను అప్పగించాలని కూడా కోరిందని వాల్ స్ట్రీట్ జర్నల్ చెబుతోంది. ఇజ్రాయెల్‌కు చెందిన బందీలకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేటప్పుడు వారి మృతదేహాలను అప్పజెప్పాలని కోరినట్టు వాల్ స్ట్రీట్ కథనం రాసింది. ఇంతకు ముందు కూడా హమాస్ తమ లీడర్ల మృతదేమాలను అప్పగించాలని కోరింది. కానీ అప్పుడు ఇజ్రాయెల్ తిరస్కరించింది. ఇప్పుడు యుద్ధాన్ని ముగించడానికి ఆ దేశం కూడా రెడీ అయిన సందర్భంలో ఏం చేస్తుందో చూడాలి.
ఈజిప్టులో జరుగుతున్న చర్చలు..
ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఇప్పటికి సఫలం అయ్యాయి అయితే ఇంకా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా దీనిపై ఒక క్లారిటీ రాలేదు. ఈజిప్టులో జరుగుతున్న శాంతి ప్రణాళిక మొదటి దశలు అమలులో ఒప్పందం ప్రకారం హమాస్ చెరలో 48 మంది బందీలు ఉండగా.. వారిలో 20 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ బందీలకు బదులుగా 2023, అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ అదుపులో ఉన్న గాజా ప్రజలు, జీవిత ఖైదు అనుభవిస్తోన్న 250 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనున్నారు.
ఈ చర్చలకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. కాగా ఈ శాంతి చర్చలు ఎర్ర సముద్ర తీరంలోని షర్మ్ ఎల్-షేక్ రిసార్టులో ప్రారంభమైనట్లు ఈజిప్టుకు చెందిన అధికారి ఒకరు స్పష్టం చేశారు. కాగా ఆయా దేశాల ప్రతినిథులతో పాటు అమెరికా పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ కూడా ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఈజిప్టు చేరుకున్నారని తెలుస్తోంది. మరోవైపు పాలస్తీనియన్లకు సంఘీభావంగా పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ నాయకత్వంలో గాజా తీరానికి పడవల ద్వారా వచ్చి అరెస్టైన 171 మంది ఆందోళనకారులను ఇజ్రాయెల్ వదిలివేసింది. వారు తిరిగి వారు వారి స్వదేశాలకు చేరుకున్నారు.