BREAKING: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ఖరారు.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే?

నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే దానిపై ఉత్కంఠ వీడింది. తాజాగా ఆ దేశ పార్లమెంట్‌ రద్దయింది. మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుశీల కర్కిను నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా జెన్‌-జడ్‌ ఉద్యమకారులు ఎంపిక చేశారు.

New Update
Nepal

నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే దానిపై ఉత్కంఠ వీడింది. తాజాగా ఆ దేశ పార్లమెంట్‌ రద్దయింది. మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుశీల కర్కిను నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా జెన్‌-జడ్‌ ఉద్యమకారులు ఎంపిక చేశారు. సైన్యం అనుమతితో అధ్యక్షుడి ఆమోదం కోసం ఆమె పేరును పంపారు. మరికాసేపట్లో సుశీల ప్రమాణస్వీకారం చేయనున్నారు.

సుశీలా కర్కి ఈరోజు రాత్రి 8.45 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని వర్గాలు తెలిపాయి. ఆమె నేపాల్ అధ్యక్షుడి అధికారిక నివాసం 'శీతల్ నివాస్'లో పదవీ ప్రమాణస్వీకారం చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలో నిరసనలకు నాయకత్వం వహించిన 'జెన్-జెడ్' యువత ఆమెను తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ఎంపిక చేయాలని డిమాండ్ చేయడంతో ఈ నిర్ణయం వెలువడింది.

ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి రాజీనామా చేయడంతో దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో, సుశీల కర్కీ పేరు ప్రముఖంగా వినిపించింది. నిరసనకారులు, ఆర్మీ చీఫ్, అధ్యక్షుడు మధ్య జరిగిన చర్చల తర్వాత ఆమె పేరును ఖరారు చేశారు. నేపాల్ పార్లమెంట్‌ను రద్దు చేయడంతో పాటు, సుశీల కర్కీని తాత్కాలిక ప్రధానిగా నియమించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. వారి డిమాండ్లను అంగీకరించడంతో సుశీల కర్కీ నేపాల్‌ను తిరిగి గాడిలో పెట్టే కీలక బాధ్యతను చేపట్టనున్నారు.

సుశీల కర్కీ నేపాల్‌ సుప్రీంకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. అవినీతిపై ఆమె తీసుకున్న కఠిన వైఖరి, నిష్పక్షపాత తీర్పులకు ప్రసిద్ధి చెందారు. ఆమె న్యాయవ్యవస్థపై ఉన్న పట్టు, నిష్కపటమైన వ్యక్తిత్వం కారణంగా యువత ఆమె వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నేపాల్ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. హింసాత్మక నిరసనల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. విమాన సర్వీసులు, ప్రజా రవాణా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో, సుశీల కర్కీ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం ముందు ఎన్నికలు నిర్వహించడం, శాంతిభద్రతలను పునరుద్ధరించడం, ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడం వంటి అనేక సవాళ్లు ఉన్నాయి. తన శక్తి సామర్థ్యాలతో ఆమె ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు