/rtv/media/media_files/2026/02/04/spain-2026-02-04-10-18-14.jpg)
Spain joins Australia to ban teens from using social media
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. ఇందులో అశ్లీల చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోలు, లైంగిక వేధింపు కంటెంట్ పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడటంపై నిషేధం విధించింది. గతేడాది డిసెంబర్లోనే ఇది అమల్లోకి వచ్చింది. ఇటీవల ఫ్రాన్స్ కూడా 15 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియాను నిషేధిస్తూ పార్లమెంట్లో బిల్లును ఆమోదించింది. ఇప్పుడు స్పెయిన్ కూడా ఈ దేశాల బాటలోనే అడుగులు వేస్తోంది.
Also Read: తొలిసారిగా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసిన యమహా
ఫిబ్రవరి 3న దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ప్రసంగించిన స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాను ఆయన నియంత్రణ లేని అడవిగా, ఓ విఫలమైన వ్యవస్థగా అభివర్ణించారు. మన పిల్లలు ప్రమాదకరమైన ప్రదేశంలో (సోషల్ మీడియాను ఉద్దేశిస్తూ) చిక్కుకుంటున్నారని, దీన్ని తాము ఏమాత్రం అంగీకరించమని అన్నారు. సోషల్ మీడియాలో ద్వేషపూరిత సమాచారం, డీఫ్‌ఫేక్ అశ్లీల చిత్రాలు, చిన్నారుల లైంగిక వేధింపుల నుంచి తమ పిల్లలను కాపాడటం లక్ష్యమని తెలిపారు. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే దీనికి సంబంధించిన బిల్లును స్పెయిన్ ప్రభుత్వం వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కేవలం నిషేధం మాత్రమే విధించకుండా సోషల్ మీడియా కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లను సైతం బాధ్యులను చేసేలా చట్టాన్ని తీసుకురానున్నారు. అశ్లీల కంటెంట్, ద్వేషపూరిత సమాచారాన్ని తొలగించడంలో సోషల్ మీడియా సంస్థలు విఫలమైతే సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఈ బిల్లును ఆమోదించిన వెంటనే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడ్డ రష్యా.. 450 డ్రోన్లు, 70 మిసైళ్లతో దాడులు
ఏ దేశంలో సోషల్ మీడియాపై నిషేధం
16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియాను నిషేధించిన మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. ''ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్లు''ను ఆస్ట్రేలియా పార్లమెంట్ నవంబర్ 28, 2024న ఆమోదించింది. గతేడాది డిసెంబర్ 10న ఈ చట్టం పూర్తిగా అమల్లోకి వచ్చింది. 16 ఏళ్ల లోపు పిల్లలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, ఎక్స్, స్నాప్‌చాట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో యాక్సెస్ ఉండదు. ఆ తర్వాత ఫ్రాన్స్ కూడా ఈ ఏడాది జనవరిలో 15 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియాను నిషేధిస్తూ బిల్లును ఆమోదించింది. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నార్వే, డెన్మార్క్, మలేషియా కూడా ఇదే బాటలో నడవనున్నాయి.
Follow Us