ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్ హత్యకు మరో కుట్ర.. చెట్టుపై నుంచి స్కోప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి దాడి కుట్ర జరిగినట్లు భావిస్తున్నారు. ఫ్లోరిడా పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రంప్ ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ ఆగే ప్రదేశంలో అనుమానాస్పదంగా ఓ స్నైపర్ గూడును సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు.

New Update
trump airport attack

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి దాడి కుట్ర జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది అప్రమత్తమై, అధ్యక్షుడిని ఎయిర్‌ఫోర్స్ వన్‌లోకి సాధారణంగా వాడే పెద్ద మెట్లకు బదులు, వెనుక వైపు ఉన్న చిన్న మెట్ల ద్వారా లోపలికి తీసుకెళ్లారు. ఈ సంఘటన ఫ్లోరిడాలోని పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. ట్రంప్ ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ ఆగే ప్రదేశానికి దగ్గరలోనే అనుమానాస్పదంగా ఏర్పాటు చేసిన ఓ స్నైపర్ గూడును సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం, విమానం ల్యాండింగ్ జోన్‌కు దాదాపు 200 గజాల దూరంలో ఒక చెట్టుపై ట్రంప్‌పై నిఘా పెట్టేలా ఎత్తైన గూడు (నిచ్చెన సాయంతో నిర్మించిన నిర్మాణం) ఉన్నట్లు గుర్తించారు. ఈ గూడు నుండి అధ్యక్షుడి విమానం ఎక్కే ప్రాంతాన్ని స్పష్టంగా టార్గెట్ చేసుకోవడానికి వీలుందని అధికారులు తెలిపారు.

గూడు ఉన్న ప్రదేశంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానితులు కనిపించనప్పటికీ, గతంలో ట్రంప్‌పై జరిగిన రెండు హత్యాయత్నాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. భద్రతా ఏర్పాట్లలో భాగంగా, ఎయిర్‌ఫోర్స్ వన్ నిలిపే స్థలాన్ని మార్చారు. అలాగే అధ్యక్షుడిని ఎక్కువ సేపు బహిరంగ ప్రదేశంలో ఉంచకుండా సాధారణంగా వీవీఐపీలు వాడని విమానం వెనుక భాగంలోని చిన్న మెట్ల ద్వారా ఆయనను లోపలికి పంపించారు.

ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ అనుమానాస్పద నిర్మాణాన్ని ఎవరు ఏర్పాటు చేశారు, దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే దానిపై దర్యాప్తు జరుగుతోందని, ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలను సేకరిస్తున్నాయని ఎఫ్‌బీఐ డైరెక్టర్ పటేల్ తెలిపారు. ఈ పరిణామం అమెరికా అధ్యక్షుడి భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలను పెంచింది.

Advertisment
తాజా కథనాలు