రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై అదనపు సుంకాలు విధించారు. వీటిని భారత్ తిరస్కరించింది. ఈ సుంకాలు చమరు కోసం కాదని..అమెరికా పాల ఉత్పత్తుల దిగుమతి అంగీకరించని కారణంగానే వేస్తున్నారని భారత్ ఆరోపించింది. ఏం చేసినా దేశ ప్రజలు, రైతుల సంక్షేమమే ముఖ్యమని..దానికి కోసం ఎలాంట సవాళ్ళను అయినా ఎదుర్కొంటామని ధీటుగా ఎదుర్కొంటామని భారత ప్రధాని మదీ స్పష్టం చేశారు. దీనికి రష్యా, చైనాలు తమ పూర్తి మద్దతును తెలిపాయి.
మూడు దేశాలు కలిపి ట్రంప్ కు షాక్...
తాజాగా భారత్, రష్యా, చైనా...మూడు దేశాలు కలిపి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాక్ ఇవ్వనున్నాయని తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఇరు దేశాలతో భారత మంత్రులు ఈ విషయమై చర్చలు చేస్తున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎన్. జై శంకర్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ విధంగా రెండు దేశాలతో ఒకేసారి భారత్ వాణిజ్యంపై చర్చలు జరుపుతోంది. అమెరికా చెక్ పట్టే విధంగా పావులు కదుపుతోంది. రష్యాలో జైశంకర్ వారి అధ్యక్షుడు పుతిన్ తో పాటూ మిగలన అధికారులను కలిశారు. ఇక్కడ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి..మన ప్రధాని మోదీతో పాటూ అజిత్ ధోవల్ లాంటి వారితో ప్రత్యేక దౌత్య చర్చలు జరిపారు.
ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు తమ దగ్గర ప్రత్యేక వ్యూహం ఉందని రష్యా దౌత్యాధికారి రోమన్ బబుష్కిన్ తెలిపారు. అమెరికా చేస్తున్నది అన్యాయమని ఆయన అన్నారు. భారత్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చమురు సరఫరా చేసేందుకు మాస్కోకు ప్రత్యేక వ్యవస్థ ఉందని బబుష్కిన్ అన్నారు. ఎవరు ఏం చేసినా తమ రెండు దేశాల మధ్యా దౌత్య సంబంధాలను చెడగొట్టలేరని.. రక్షణ, సైనిక ఉత్పత్తుల విషయంలో ఇరు దేశాల మధ్య సహకారం ఇప్పుడు మరింత బలోపేతం అయిందని ఆయన చెప్పారు. భారత్ వస్తువులు అమెరికాకు ఎగుమతి చేయలేకపోతే..రష్యా వాటిని కొంటుందని హామీ ఇచ్చారు. ట్రంప్ ఎంత సుంకాలు పెంచినా రష్యా నుంచి భారత్ కు చమురు ఎగుమతి అవుతుందని ఆ దేశ ఉప ప్రధాని డెనిస్ స్పష్టం చేశారు. దాంతో పాటూ విద్యుదుత్పత్తి, ఉక్కు తయారీకి అవసరమైన బొగ్గును కూడా రవాణా చేస్తామన్నారు. అలాగే భారత్ లో తయారయ్యే వస్తువులను దిగుమతి చేసుకుంటామని రష్యా ఉప ప్రధాని డెనిస్ స్పష్టం చేశారు.
తాజాగా చైనా కూడా ఇదే మద్దతును ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా వస్తువులను తమ మార్కెట్ లోకి ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చైనా రాయబారి జు ఫీ హాంగ్ అన్నారు. సుంకాల యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫీ హాంగ్ ఈ వ్యాఖ్యలను చేశారు. భారత్ కు వెన్నంటి నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ నెలాఖరున జరిగే ఎస్ పీవో శిఖరాగ్ర సదస్సులో భారత్ సహా అన్ని పక్షాలతో కలిసి పని చేసేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. ప్రపంచ వాణిజ్యంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని..ఈ తరుణంలో అభివృద్ధి చెందుతున్న భారత్, చైనాలు కలిసి పని చేయడం ఎంతో అవసరం అని ఫీ హాంగ్ అన్నారు. మరోవైపు భారత ప్రధాని మోదీ కూడా భారత్, చైనా మధ్య సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయని రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. పైగా నేపాల్ సరిహద్దు లిపులేఖ్ గుండా వ్యాపారం పునరుద్ధరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. దీని బట్టి చూస్తే భారత్, చైనా, రష్యాలు కలిసి అమెరికాకు గట్టిగానే చెక్ పట్టనున్నాయని తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. దీంతో అగ్రరాజ్యం ఆధిపత్యానికి పెద్ద సవాల్ ఎదురవుతుందని చెబుతున్నారు.