రష్యాలో జరుగుతున్న 16వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ రష్యాలోని కజాన్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. అలాగే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇతర దేశాధినేతలతో కూడా ప్రధాని మోదీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బ్రిక్స్ సదస్సుకు రష్యాకు చేరుకున్న ప్రధానికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్‌లో తన సంతోషాన్ని పంచుకున్నారు.
Also Read: అమిత్‌షాకు కోల్‌కతా జూ.డాక్టర్ తండ్రి లేఖ.. ఏం చెప్పారంటే ?
దానిపైనే ఫోకస్ పెట్టాము
'' బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం కజాన్ నగరాన్ని సందర్శించినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌కు రష్యాతో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. విభిన్న రంగాల్లో మన ద్వైపాక్షిక సంబంధాలు ఇంకా ఎలా బలోపేతం చేయాలనే దానిపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి పెట్టామని'' ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు
ఇదిలాఉండగా రష్యాలో బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ప్రపంచ అభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం అనేది ఈ ఏడాది బ్రిక్స్ సదస్సుకు ప్రధాన నినాదంగా ఉంది. ఈ సమావేశంలో పుతిన్, ప్రధాని మోదీతో పాటు చైనా, బ్రెజిల్ తదితర దేశాల నేతలు పాల్గొంటారు. 2009లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా,సౌత్ ఆఫ్రికాతో బ్రిక్స్ (BRICS) కూటమి ఏర్పాటైంది. ఇప్పుడు ఆ కూటమి విస్తరించింది. ఈ ఏడాది ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా,యూఏఈ, ఇథియోపియా కూడా ఈ బ్రిక్స్ కూటమిలో చేరాయి. అయితే కూటమి విస్తరణ తర్వాత ఇదే మొదటి శిఖరాగ్ర సదస్సు కావడం విశేషం.
Also Read: బ్రిజ్ భూషణ్ బెడ్‌పై కూర్చున్నాను.. ఆ సమయంలో.. : సాక్షి మాలిక్
ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల అంశం గురించి కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఈ ఏడాది రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. జులైలో మాస్కోలో జరిగిన 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి కూడా మోదీ హాజరయ్యారు. ఈ పర్యటన సందర్భంగా అప్పుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతేకాదు రష్యా అత్యున్నత పౌరపురస్కారం అయిన 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్' ను అందుకున్నారు. అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ బ్రిగ్స్ సదస్సులో ఆయా దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది.