/rtv/media/media_files/2025/10/29/pakistan-airstrikes-in-balochistan-2025-10-29-11-19-51.jpg)
Pakistan airstrikes in Balochistan
Pakistan: పాకిస్థాన్ మరోసారి సొంత ప్రజల మీదే దాడులకు తెగబడింది. అర్థరాత్రి బరితెగించి వైమానిక దాడులకు పాల్పడింది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల పేరుతో బలోచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) లక్ష్యంగా అర్ధరాత్రి వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో దాదాపు 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
బలోచిస్థాన్‌లోని చిల్తాన్ పర్వత ప్రాంతంలో బీఎల్‌ఏ ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పాక్ బలగాలు వైమానిక దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. బలూచ్ ఉగ్రవాదులు చాలా రోజులుగా తమ నిఘాలో ఉన్నారని పాక్ పేర్కొంది. తాజా దాడుల నేపథ్యంలో ఉగ్రవాదులకు సంబంధించిన అనేక తాత్కాలిక రహస్య స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రావిన్స్‌లోని భద్రతా కాన్వాయ్‌లు, మౌలిక సదుపాయాలపై కూడా ఈ దాడులు జరిగినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే పాక్ తాజా దాడులపై బలోచిస్థాన్ ఇప్పటివరకు స్పందించలేదు.
కాగా, బలోచిస్థాన్‌లో పాకిస్తాన్ సైన్యం, బలూచ్ వేర్పాటువాద గ్రూపుల మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి, పాక్ సైన్యం డ్రోన్లు, మోర్టార్లు, ఇతర ఆయుధాలతో దాడులు నిర్వహిస్తోంది. బలోచ్ గ్రూపులు పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తున్నాయి. బలూచిస్తాన్ సహజ వనరుల నియంత్రణ, రాజకీయ స్వయంప్రతిపత్తి కోసం ఈ ఘర్షణలు కొనసాగుతున్నాయి. 
 
గతంలో కుజ్దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంతంలో పాక్ సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది, దీనికి డ్రోన్లు, మోర్టార్లు, మరియు శతఘ్నులు ఉపయోగించింది. ఈ దాడులు ఉగ్రవాద వ్యతిరేక చర్యల పేరుతో జరుగుతున్నాయని పాకిస్తాన్ పేర్కొంది.  బలూచ్ జాతీయవాద గ్రూపులు సైతం పాకిస్తాన్ సైన్యంపై దాడులు తీవ్రతరం చేశాయి. వారు పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం కోరుతూ పోరాడుతున్నారు. బలోచిస్తాన్‌లో కొన్ని దశాబ్దాలుగా హింస, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని బలూచ్ నాయకులు ఆరోపిస్తున్నారు. 
బలూచిస్థాన్ లో పాకిస్థాన్ సొంత ప్రజలపైనే సైన్యం విరుచుకుపడుతోంది. సైన్యం దాడితో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు, ఎటునుంచి బాంబు వచ్చి మీదపడుతుందోననే భయంతో ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ, బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం జెహ్రీ ప్రాంతమంతా ఉగ్రవాదుల చేతుల్లో ఉందని, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొనే లక్ష్యంతో దాడులు చేస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి.
 Follow Us
 Follow Us